శిరోమణి అకాలీదళ్ అధ్యక్ష పదవికి సుఖ్‌బీర్ సింగ్ బాదల్ రాజీనామా

శిరోమణి అకాలీదళ్ అధ్యక్ష పదవికి సుఖ్‌బీర్ సింగ్ బాదల్ రాజీనామా

ఛండీఘర్: పంజాబ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీనియర్ రాజకీయ నేత, పంజాబ్ మాజీ ఉపముఖ్యమంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాదల్ శిరోమణి అకాలీదళ్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. పంజాబ్, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో సుఖ్‌బీర్ సింగ్ బాదల్ నేతృత్వంలో బరిలోకి దిగిన శిరోమణి ఆకాళీదళ్ పూర్తిగా చతికిలపడింది. పంజాబ్ రాష్ట్రాల్లో రాజకీయాలను ప్రభావితం చేయగల సామర్థ్యం ఉన్న ఆకాలీదళ్.. ఇటీవల జరిగిన అన్ని ఎన్నికల్లో ఘోర వైఫల్యాన్ని చవిచూసింది. 

రోజు రోజుకు పార్టీ గ్రాఫ్ దారుణంగా పడిపోవడం, ప్రత్యర్థుల నుండి ఎదురవుతోన్న సవాళ్ల నేపథ్యంలో శిరోమణి అకాలీదళ్ పార్టీ అధ్యక్ష పదవికి సుఖ్‌బీర్ సింగ్ బాదల్ రాజీనామా చేసి.. పార్టీ పగ్గాలను మరొకరికి అప్పగించాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 2024, నవంబర్ 16వ తేదీన శిరోమణి ఆకాలీదళ్ పార్టీ అధ్యక్ష పదవి నుండి తప్పుకుంటున్నట్లు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ప్రకటించారు. సుఖ్‌బీర్ సింగ్ బాదల్ రాజీనామా విషయాన్ని ఆ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ దల్జీత్ సింగ్ చీమా ఎక్స్ వేదికగా వెల్లడించారు.

కొత్త అధ్యక్షుడి ఎన్నికకు మార్గం సుగమం చేసేందుకు శిరోమణి ఆకాలీదళ్ పార్టీ వర్కింగ్ కమిటీకి సుఖ్‌బీర్ సింగ్ బాదల్ రాజీనామా సమర్పించారు. తన నాయకత్వంపై విశ్వాసం ఉంచి పదవీకాలం మొత్తం మద్దతు & సహకారాన్ని అందించినందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు’’ అని ట్వీట్ చేశారు దల్జీత్ సింగ్ చీమా.

ALSO READ | జార్ఖండ్ ఎన్నికల ప్రచారానికి పేపర్ లీకేజీల డబ్బు: బీజేపీపై సీఎం హేమంత్ ​సోరెన్​ ఫైర్​

 కాగా, 2008 నుండి శిరోమణి అకాలీదళ్ పార్టీ అధ్యక్ష పదవిలో సుఖ్‌బీర్ సింగ్ బాదల్ కొనసాగుతున్నారు. తాజాగా శిరోమణి ఆకాలీదళ్ పార్టీ అధ్యక్ష పదవి నుండి దల్జీత్ సుఖ్‌బీర్ సింగ్ బాదల్ తప్పుకోవడంతో.. పార్టీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై ఎస్ఏడీ ఫోకస్ పెట్టింది. త్వరలోనే పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నకుంటామని దల్జీత్ సింగ్ చీమా తెలిపారు.