పంజాబ్ కొత్త సీఎంగా సుఖ్జిందర్ రణ్ ధావా?

పంజాబ్ కొత్త సీఎంగా సుఖ్జిందర్ రణ్ ధావా?

న్యూఢిల్లీ: పంజాబ్‌ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ఎవరిని ఎన్నుకోవాలన్న దానిపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జోరుగా మంతనాలు సాగిస్తోంది. ఎన్నికల ముందు కొత్త సీఎం ఎంపిక కావడంతో జాగ్రత్తగా కసరత్తు చేసేందుకు పార్టీ హైకమాండ్ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ నేతలందరి అభిప్రాయాలు తీసుకుని  సుఖ్జిందర్ రణ్ ధావా ను ఏఐసీసీ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఆయన గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ అపాయింట్‌మెంట్ కూడా కోరారు. 

ఇప్పటి వరకు సీఎంగా ఉన్న అమరిందర్ సింగ్ నిన్న తన రాజీనామా సమర్పించడంతో ఆయన స్థానంలో కొత్త సీఎం ఎంపిక జరిగింది. సీఎం మార్పిడి పరిణామాలు దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాయి. నాటకీయ ఫక్కీలో రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ నిన్న  తన పదవికి రాజీనామా చేయడం సంచలనం సృష్టించింది. పోతు పోతూ అయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. పంజాబ్ తదుపరి సీఎం ఎవరనే విషయం దేశ వ్యాప్తంగా ఆసక్తికర పరిణామంగా మారింది. క్రికెటర్ నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ రేసులో ఉన్నప్పటికీ పలువురు సీనియర్లు ఆయన అభ్యర్థిత్వం పట్ల సముఖంగా లేనట్లు వార్తలు వినిపించాయి. ఈ నేపధ్యంలో రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత అంబికా సోని పేరు తెరపైకి రాగా ఆమె సున్నితంగా తిరస్కరించారు. పంజాబ్‌కు సిక్కు నేతే సీఎంగా ఉండాలని ఆమె స్పష్టం చేశారు. పంజాబ్‌ రాష్ట్రంతో తనకు ప్రగాఢ అనుబంధం ఉన్నప్పటికీ ఆ రాష్ట్రానికి సిక్కు నాయకుడు ముఖ్యమంత్రి అవ్వడమే సరైన నిర్ణయం అవుతుందన్నారు. ఇదే విషయాన్ని సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో జరిగిన సమావేశంలో అంబికా సోని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. 

మహిళా నాయకురాలు సీఎం అయితే బాగుంటందని అంబికా సోనీకి అధిష్టానం సీఎం పదవిని ఆఫర్ చేయగా ఆమె సున్నితంగా తిరస్కరించారని నేషనల్ మీడియాలో వార్తలు వచ్చాయి. సిద్ధూతోపాటు పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ సునీల్ జాఖర్, సుఖ్జిందర్ సింగ్ రణ్‌ధావా, పార్టీ నేతలు త్రిప్త్ రాజీందర్ సింగ్ బజ్వా, బ్రహ్మ మోహింద్రా, విజయేందర్ సింగ్లా, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుల్జీత్ సింగ్ నగ్రా తదితరులు సీఎం రేసులో ఉన్నారని వార్తలు వచ్చాయి.