
దర్శకుడు సుకుమార్ కూతురు సుకృతి వేణి లీడ్ రోల్‌లో పద్మావతి మల్లాది తెరకెక్కించిన చిత్రం ‘గాంధీ తాత చెట్టు’(Gandhi Tatha Chettu).మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, గోపీ టాకీస్ సంస్థలు నిర్మించాయి. ఇప్పటికే పలు ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శింపబడిన ఈ చిత్రం నేడు శుక్రవారం (జనవరి 24న) థియేటర్లలలో విడుదలైంది. ‘మహాత్మాగాంధీ సిద్ధాంతాలను అనుసరించే ఓ చిన్నారి తన ఊరి కోసం ఏం చేసిందనేది పూర్తి రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటంటే::
నిజామాబాద్ జిల్లాలో అడ్లూరు అనే ఒక పల్లెటూరు. అక్కడ రామచంద్రయ్య (ఆనంద చక్రపాణి) అనే రైతు ఉంటాడు. అతను అనుక్షణం గాంధీ సిద్ధాంతాలను ఆచరిస్తుంటాడు. రామచంద్రయ్యకు 15 ఎకరాల పంట భూమి ఉంటుంది. ఆ భూమి తన తాతల నుండి వస్తోన్న ఆస్తి. అక్కడ అదే పొలంలో ఓ వేప చెట్టు ఉంటుంది. రామచంద్రయ్యకు ఆ చెట్టు అంటే చచ్చేంత ప్రాణం. ఆ చెట్టు కిందే తన మనువరాలు గాంధీ (సుకృతి వేణి)కి నిత్యం కథలు చెబుతుంటాడు. గాంధీ సిద్ధాంతాల్ని నమ్మి అనుసరించే ఆయన.. తన మనవరాలికి గాంధీ (సుకృతివేణి) అని పేరు పెడతాడు. పేరే కాదు, గాంధీ సిద్ధాంతాల్ని సైతం బోధిస్తూ పెంచుతాడు.
అలా ఆనందంగా సాగుతున్న రామచంద్రయ్య జీవితంలోకి ఓ వ్యాపారవేత్త సతీష్ (రాగ్ మయూర్) వస్తాడు. ఆ అడ్లూరు గ్రామంలో కెమికల్ ఫ్యాక్టరీ పెట్టడం కోసం భూమిని సేకరిస్తుంటాడు. డబ్బు ఆశ చూపెట్టి ఆ ఊర్లో ఉన్న రైతుల పొలాలు కోనేస్తుంటాడు. అయితే, రామచంద్రయ్య మాత్రం తన పొలాన్ని అమ్మడానికి ఇష్టపడడు. తన కొడుకు మాత్రం పొలం అమ్మేద్దామంటూ తండ్రితో గొడవపడ్డ కానీ, అసలు ఒప్పుకోడు.
ఈ క్రమంలో కన్న కొడుకుతో పాటు ఊరివాళ్లకు రామచంద్రయ్య శత్రువుగా మారిపోతాడు. అలా కొన్నిరోజులు దిగులుతో రామచంద్రయ్య చనిపోతాడు. కానీ, తాను దిగులు చెంది చనిపోవడానికి కారణం మరొకటి ఉంటుంది? ఆ విషయం తెలుసుకున్న తన మనువరాలు గాంధీ ఎవ్వరిని ఎదిరించాల్సి వచ్చింది? అసలు రామచంద్రయ్య మరణానికి కారణం ఎవ్వరు? ఊళ్లోని భూములను కాపాడేందుకు అహింస మార్గంలో గాంధీ చేసిన పోరాటం తల్లిదండ్రులతో పాటు ప్రజల్లో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది? అనేది పూర్తి కథ.
ఎలా ఉందంటే::
సమాజంలో జరుగుతున్న ఓ సామాజిక సమస్యని చూపిస్తూ రాసుకున్న ఈ కథ అందరినీ ఆలోచింపజేస్తుంది. దర్శకురాలు పద్మావతి మల్లాది రాసుకున్న కథలో గాంధీ సిద్ధాంతాల వల్ల పోరాటం ఎలా చేయొచ్చని విషయాన్నీ అర్థమయ్యేలా చేసింది. గాంధీ అనే అమ్మాయి, ఆమె తాత, ఆయన నాటిన చెట్టు మధ్య జరిగే కథ. గాంధీ గారి సిద్దాంతమైన అహింస ఆయుధంగా ఊరిని, చెట్టును ఆమె ఎలా కాపాడింది అనేది మెయిన్ కాన్సెప్ట్. మెసేజ్‌తో పాటు కమర్షియాలిటీ ఉన్న సినిమా ఇది. అందరి హృదయాలకు హత్తుకునే కథగా రూపొందింది.
ఈ సినిమాకు ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో మంచి అప్లాజ్ వచ్చింది. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు చూపించాల్సిన సినిమా ఇది. అందరి హృదయాలను హత్తుకునే భావోద్వేగాలతో సినిమాను తెరకెక్కించింది దర్శకురాలు పద్మావతి. రామచంద్రయ్య కొడుకు టౌన్‌కి వెళ్లాలని నిర్ణయించుకోవడం, అదే సమయంలో రైతుల అవసరాల్ని, వాళ్ల నిస్సహాయతనే తనకు అనువుగా మార్చుకుని వాళ్ల పంటపొలాల్ని కొనేందుకు వ్యాపారవేత్త సురేష్ (రాగ్ మయూర్) వచ్చి భూములు కొనడం వంటి సంఘర్షణలు ఆసక్తిగా ఉంటాయి.
ALSO READ | Anuja Story: ఆస్కార్ బరిలో ఇండియన్ మూవీ అనూజ.. బాల కార్మికుల జీవితాలు ఎలా నలిగిపోతున్నాయి?
గాంధీ అహింస సిద్ధాంతాలను చిన్నప్పటి నుంచే బాగా చదివిన ఓ అమ్మాయి.. ఆయన బాటలోనే కార్పొరేట్ శక్తుల బారి నుంచి తమ ఊరిని ఎలా కాపాడిందనే పాయింట్ అందరికీ నచ్చుతుంది. చెట్లకు ప్రాణం ఉంటుందని, ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందనే సందేశాన్ని సినిమా ద్వారా ఇచ్చారు. ఫ్యాక్టరీలు పెట్టి ఉపాధి కల్పిస్తామని పల్లెటూర్లను మోసం చేస్తున్న వ్యాపారవేత్తలు, వారి మాటల వల్ల భూములు కోల్పోతున్న అమాయక రైతులను కళ్లకి కట్టినట్లు చూపించారు.
ఎవరెలా చేశారంటే::
ఇందులో గాంధీ పాత్రకు సుకుమార్ డాటర్ సుకృతి పర్‌ఫెక్ట్‌గా సెట్ అయ్యింది. ఈ సినిమా కోసం తను నిజంగానే గుండు చేయించుకుని డేరింగ్ డెసిషన్ తీసుకుంది. తెలంగాణ యాసలో సుకృతి చెప్పిన డైలాగ్స్ బాగున్నాయి. స్వచ్ఛత, అమాయకత్వం సుకృతివేణి నటనలో ఇమిడిపోయాయి. ఒక్కమాటలో చెప్పాలంటే గాంధీ పాత్రకు సుకృతి ప్రాణం పోసింది.
తాత పాత్రలో నటించిన ఆనంద చక్రపాణి ఎప్పటిలాగే తన సహజమైన నటనతో మెప్పించారు. బిజినెస్ మ్యాన్ సతీష్‌గా రాగ్ మయూర్ తన పాత్రకు న్యాయం చేశాడు. గాంధీ తల్లిదండ్రులుగా నటించిన రఘురాం, లావణ్య తమ పాత్రల్లో జీవించారు. మిగతా గ్రామస్థులు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. ఇకపోతే చెట్టుకు తనికెళ్ల భరణి వాయిస్ ఓవర్ చక్కగా కుదిరింది.
సాంకేతిక అంశాలు::
డైరెక్టర్‌గా పద్మావతి మల్లాదికి ఇదే తొలి సినిమా. తన రచన, దర్శకత్వంతో మెప్పించింది. ఎక్కడా తడబాటు లేకుండా తనదైన స్క్రీన్ ప్లేతో మెప్పించింది. సినిమాటోగ్రఫీ: శ్రీజిత్ చెర్వుపల్లి, విశ్వ దేవబత్తుల ప్రతి ఫ్రేమ్ కళ్ళకు కట్టినట్లు సహజంగా చూపించారు. హరిశంకర్ ఎడిటింగ్ బాగుంది. 'రీ' స్వరపరిచిన పాటలు బాగున్నాయి. సుద్దాల అశోక్ తేజ, కాసర్ల శ్యామ్, విశ్వ రాసిన లిరిక్స్ ఆలోచింపజేస్తాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.