హైదరాబాద్‌లో వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను సుల్తాన్ బజార్ పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌కు చెందిన ఐదుగురు మహిళలతో కూడిన ముఠా సికింద్రాబాద్‌లోని సితార హోటల్‌లో పట్టుబడింది. ఈ ముఠా ఒకే సారి గుంపులుగా దుకాణాలలో ప్రవేశించి కొనుగోలు చేస్తున్నట్లు నటిస్తూ, దుకాణాల యజమానుల దృష్టి మరల్చి, విలువైన వస్తువులను దొంగిలిస్తున్నారు. సుల్తాన్ బజార్‌లోని ఓ షాపింగ్ మాల్‌ను టార్గెట్ చేసి, అక్కడ ఓ ఎన్నారై మహిళ నుంచి బ్యాగ్ లాక్కెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించారు.
ఈ ముఠా దొంగిలించిన డబ్బుతో రూ.14 వేల విలువైన బట్టలు కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. వారి వద్ద నుంచి 14 వేల రూపాయల విలువైన నకిలీ నగలు, బట్టలు స్వాధీనం చేసుకున్నారు. ముఠా సభ్యులు నగరంలోని పలు ప్రాంతాలకు వెళ్లి దుకాణాదారుల దృష్టి మళ్లించి విలువైన వస్తువులను దొంగిలించడంతో పాటు బంగారు ఆభరణాల స్థానంలో నకిలీవి అమర్చి దోచుకెళ్తారు. 100 గంటల పాటు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన తర్వాతే అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు. నగరంలో పలు చోరీలకు పాల్పడుతున్న మరో ముఠాపై పోలీసులు ఆరా తీస్తున్నారు.