ప్రతి ఒక్కరి లోపల ఒక సీతాకోకచిలుక ఉంటుంది. అది రెక్కలు విప్పి ఎగరడానికి ఎదురు చూస్తుంటుంది. ఎవరైతే.. ఆత్మన్యూనత, అభద్రతా భావాల నుండి బయటపడి, అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారో వాళ్ల లోపలి సీతాకోకచిలుక మాత్రమే ఎగురుతుంది...” అని చెప్పడమే కాదు.. పాటించి సక్సెస్ కూడా అయ్యింది సుమిలా జయరాజ్. ఆమె కొన్నేండ్లపాటు ఉద్యోగం చేసి, విసిగిపోయి ‘గ్రీన్ ఆరా’ అనే స్టార్టప్‌తో సక్సెస్‌ఫుల్ ఎంట్రపెనూర్‌గా మారింది. చిన్న షెడ్డులో మొదలుపెట్టిన ఆ కంపెనీ ప్రొడక్ట్స్ ఇప్పుడు షెడ్డు దాటి... సరిహద్దులు దాటి... విదేశాలకు చేరాయి.
ప్రతి నెలా వచ్చే శాలరీ ఇచ్చే సేఫ్టీ ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యం. కానీ.. అంతకుమించి సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే కొన్ని సవాళ్లను ఎదుర్కొనేందుకు రెడీగా ఉండాలి. అలాంటి ఎన్నో సవాళ్లను ఎదుర్కొని, ఎన్నో ప్రయత్నాలు చేసి చివరికి సక్సెస్ సాధించింది సుమిలా జయరాజ్. వ్యాపారవేత్త కావాలనే ఆలోచన ఆమెకి ఎప్పుడూ లేదు. వ్యాపార రంగంలో ఎలాంటి అనుభవం లేదు. అయినా.. ఆమె పెట్టిన బిజినెస్ బాగా సక్సెస్ అయ్యింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలకు గ్రీన్ ఆరా తయారుచేసిన ప్రొడక్ట్స్ ఎగుమతి అవుతున్నాయి.
సుమిల వాళ్లది కేరళలోని ఎంగండియూర్ అనే చిన్న పట్టణం. చిన్ననాటి నుంచి డాక్టర్ కావాలని కలలు కనేది. జువాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తయిన వెంటనే ఇంగ్లిష్ లిటరేచర్ చదివింది. ఆ కోర్సు రిజల్ట్ కూడా రాకముందే ఆమె పెండ్లి జరిగింది. పెండ్లి తర్వాత భర్తతో కలిసి ముంబయి వెళ్లిపోయింది. కవల పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత పిల్లలు, ఇంటి పనులతో బిజీ అయింది.
ఉద్యోగంలో..
పెళ్లయిన ఆరేళ్లకు ఉద్యోగం కోసం దుబాయి వెళ్లిపోయాడు సుమిల భర్త. దాంతో ఆమె పిల్లలతో పాటు కేరళకు షిఫ్ట్ అయ్యింది. పిల్లలు స్కూల్‌కి వెళ్తుండడంతో సుమిలకు చాలా టైం దొరికింది. పైగా తన భర్త ఇండియా తిరిగి రావడానికి మరో ఎనిమిది నెలలు పడుతుందని తెలిసి.. ఏదైనా ఉద్యోగం చేయాలని నిర్ణయించుకుంది. 2010లో తన ఇంటికి దగ్గర్లో ఉన్న ఒక కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్‌గా చేరింది. ఆ కంపెనీలో వర్జిన్ కొబ్బరి నూనె తయారు చేస్తుంటారు. ఉద్యోగంలో చేరేటప్పటికి సుమిలకు నూనె గురించి పెద్దగా తెలియదు.
కానీ.. ఆమె ఇంగ్లిష్ లిటరేచర్ చదువుకోవడం వల్ల ఇంగ్లిష్‌లో బాగా మాట్లాడుతుంది. అందుకని ఇంటర్నేషనల్ కస్టమర్స్‌తో ఫోన్ కాల్స్ మాట్లాడే పని అప్పగించారామెకు. ఇతర దేశాల నుంచి వచ్చే ఆర్డర్లు తీసుకోవడం, వాళ్లకు ప్రొడక్ట్ గురించి వివరించడం ఆమె పని. అలా మొదటి ఎక్స్‌పోర్ట్ ఆర్డర్‌ను లండన్ నుంచి తీసుకుంది. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, మలేసియాలోని కస్టమర్లతో ఎక్కువగా మాట్లాడేది. అలా ఆయా దేశాల్లో కస్టమర్ బేస్‌ని బాగా డెవలప్ చేసింది.
ఎక్కువ తెలుసుకోవడం వల్లే...
విదేశాల నుంచి ఫోన్ చేసేవాళ్లు ప్రొడక్ట్ గురించి రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు. ఎన్నో ప్రశ్నలు వేస్తుంటారు. వాళ్లకు సమాధానాలు చెప్పాలంటే.. ముందుగా ప్రొడక్ట్ గురించి సుమిలకు తెలియాలి. అందుకే ప్రొడక్ట్స్ గురించి ఎక్కువగా తెలుసుకోవడం మొదలుపెట్టింది. అప్పుడామెకు కొబ్బరితో చేసే ప్రొడక్ట్స్ మీద ఆసక్తి పెరిగింది. పైగా ఆ ప్రొడక్ట్స్‌కి మార్కెట్‌లో ఎంత డిమాండ్ ఉందో అర్థమైంది. తానే స్వయంగా అలాంటి ప్రొడక్ట్స్ తయారుచేయాలి అనుకుంది. కంపెనీలో చేరిన మూడేళ్లకు ఆ కంపెనీలో మంచి స్థాయికి చేరుకుంది. అయినప్పటికీ ఉద్యోగం మానేసింది. ఆ తరువాత సొంత వ్యాపారం పెట్టింది.
సొంత కంపెనీ
ఉద్యోగం మానేశాక సొంతంగా ‘గ్రీన్ ఆరా’ పేరుతో ఒక సంస్థ మొదలుపెట్టింది. ముగ్గురు ఉద్యోగులతో ప్రొడక్షన్ మొదలుపెట్టింది. ప్రొడక్షన్ ప్లాంట్ ఏర్పాటుకు డబ్బు లేకపోవడంతో తన ఇంటి పక్కనే ఉన్న ఒక షెడ్డు అద్దెకు తీసుకుంది. వ్యాపారం పెరిగే కొద్దీ షెడ్డు పరిమాణం కూడా పెరిగింది. మొదట్లో కొబ్బరి నూనె మాత్రమే ప్రధాన ఉత్పత్తి. కేవలం వర్జిన్ ఆయిల్ మాత్రమే అమ్మేది. మొదట్లో చాలా కష్టపడి ఆర్డర్లు సంపాదించేది. ప్రొడక్ట్స్‌ని రోజూ షాపులకు తీసుకెళ్లి డెలివరీ చేసేవాళ్లు. డ్రైవర్ రాని రోజుల్లో సుమిల కూడా డెలివరీ చేసేది. 2013లో కేరళకు చెందిన ఒక మంచి సంస్థలో పనిచేసే అసిస్టెంట్ మేనేజర్ సుమిల యూనిట్‌ని చూశాడు. ప్రొడక్ట్స్ క్వాలిటీ మెచ్చుకుని భారీ ఆర్డర్ ఇచ్చాడు. అప్పటినుండి ఆర్డర్లు నెమ్మదిగా పెరిగాయి. అలా రోజురోజుకూ కంపెనీ డెవలప్ అయ్యింది.
ఇబ్బందులు
కంపెనీ మొదలుపెట్టినప్పుడు తన వెంచర్ చూసేందుకు ఎవరైనా వస్తే ఇంటి దగ్గర ఉన్న షెడ్డు చూపించేందుకు చాలా ఇబ్బంది పడేది. లాభాలు వచ్చాక 2021లో సొంతంగా భూమి కొని ప్రొడక్షన్ యూనిట్, ఆఫీస్ బిల్డింగ్ కట్టించింది. కొబ్బరి నూనె తర్వాత కొబ్బరి పాల ప్రొడక్షన్ మొదలుపెట్టింది. తాను జీవితంలో ఎదుర్కొన్న కొన్ని చిన్న సమస్యలకు సొల్యూషన్స్‌గా తన ప్రొడక్ట్స్ తీసుకొచ్చింది. పాయసం చేసేందుకు కొబ్బరి తురిమేందుకు చాలా కష్టపడాల్సి వచ్చేది సుమిల. ఆ కష్టం తెచ్చిన ఆలోచనే కొబ్బరి పాల ఉత్పత్తి. ఇప్పుడు ఈ కంపెనీ చేసే కొబ్బరి పాలకు రెగ్యులర్ కస్టమర్లు ఉన్నారు. ఎక్కువగా క్యాటరింగ్ వాళ్లు కొంటున్నారు. కొబ్బరి పాలను తీయడానికి అయ్యే ఖర్చుతో పోలిస్తే.. కొబ్బరి పాలు కొనడమే క్యాటరర్లకు మేలు అందుకే సేల్స్ బాగా పెరిగాయి.
చమ్మంతి పొడి
ఇడ్లీ, దోసెలతోపాటు మనం పల్లీ చట్నీ తిన్నట్టు కేరళలో ఎక్కువగా చమ్మంతి చట్నీ లేదా పొడి తింటారు. దీన్ని కొబ్బరితో తయారు చేస్తారు. కాకపోతే.. చమ్మంతి తయారీకి కాస్త ఎక్కువ టైం పడుతుంది. అందుకే చమ్మంతి పొడి తయారీ మొదలుపెట్టింది. ఆ తర్వాత కొబ్బరికాయ ఊరగాయలు, కొబ్బరి నీళ్లతో వెనిగర్ లాంటి చాలా ప్రొడక్ట్స్ లాంచ్ చేసింది. ప్రస్తుతం కొబ్బరితో చేసే దాదాపు13 రకాల ప్రొడక్ట్స్‌ని మార్కెట్‌లో అమ్ముతోంది సుమిల. వ్యాపారం మొదలుపెట్టిన కొత్తలో ఈ ప్రొడక్ట్స్‌కి ఇంతలా డిమాండ్ ఉంటుందని ఆమె కూడా ఊహించలేదు. కానీ.. రోజురోజుకూ డిమాండ్ పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా ఆన్‌లైన్ పోర్టల్స్‌లో వెనిగర్‌కు చాలా డిమాండ్ ఉంది.
మార్కెటింగ్ ఇలా...
ముగ్గురితో మొదలైన ఈ కంపెనీలో ఇప్పుడు పదకొండు మంది పనిచేస్తున్నారు. కంపెనీ తయారుచేసే ప్రొడక్ట్స్ ఇండియామార్ట్, అమెజాన్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి. కేరళలోని కొన్ని సూపర్‌మార్కెట్లు, హైపర్‌మార్కెట్లలో కూడా సేల్ చేస్తున్నారు. మొదట్లో కేవలం దేశీయ మార్కెట్‌పైనే దృష్టి పెట్టారు. ముఖ్యంగా రిటైల్ దుకాణాలు, సూపర్ మార్కెట్ చైన్లకు సప్లయ్ చేసేవాళ్లు. ఆ తర్వాత 2016లో ఎగుమతి చేయడం మొదలుపెట్టారు. కేరళలోని ఒక ప్రముఖ ఎక్స్‌పోర్ట్ కంపెనీ ఈ కంపెనీ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తోంది.
ఇప్పటివరకు యూకే, అమెరికా, న్యూజిలాండ్, మలేసియా, సింగపూర్ మొదలైన దేశాలకు ఎగుమతి చేశారు. ఉత్పత్తుల్లో దాదాపు 50 శాతం వరకు ఎగుమతి చేస్తున్నారు. ముఖ్యంగా కొబ్బరి పాలు, వర్జిన్ కొబ్బరి నూనె, కొబ్బరి నీళ్లతో చేసిన వెనిగర్, ఎండు కొబ్బరి ఎగుమతి ఎక్కువ. ఎగుమతి చేయడానికి కోషర్ పాస్ ఓవర్ సర్టిఫికేషన్ కూడా ఉంది. ఈ సర్టిఫికెట్‌ను పాలు, మాంసం కాకుండా మిగతా తినే వస్తువులకు ఇస్తారు. ఎగుమతి చేయడమే కాకుండా ఎగ్జిబిషన్స్, ట్రేడ్ ఫెయిర్స్లో స్టాల్స్ పెడుతున్నారు. అవి కస్టమర్ బేస్ పెంచుకునేందుకు సాయపడుతున్నాయి. ప్రస్తుతం తన కంపెనీ విలువ కోటిన్నర రూపాయలపైనే. గ్రీన్ ఆరా మొదలుపెట్టినప్పుడు పెట్టుబడిలో 48 శాతం సుమిల తన సేవింగ్స్ నుంచే ఖర్చుచేసింది. మిగతాది బ్యాంకు నుంచి లోన్ తీసుకుంది. ‘కోకోనట్ డెవలప్‌మెంట్ బోర్డు’ కూడా ఆమెకు సాయం చేసింది.
నెలకు 20 లక్షలు
సుమిల తన కంపెనీ ద్వారా నెలకు సగటున 20 లక్షల రూపాయల కంటే ఎక్కువే అమ్మకాలు చేస్తోంది. కానీ.. కంపెనీ పెట్టిన రెండేండ్ల వరకు పెద్దగా ఆర్డర్లు రాకపోయినా.. ఓపికతో ఎదురు చూసింది. తనకు ఎదురైన ప్రతి సమస్యకు పరిష్కారాన్ని వెతుక్కుంది. అందుకే ఇంతలా సక్సెస్ అయ్యింది. కొన్నాళ్ల నుంచి తన వెబ్‌సైట్ ద్వారా డెలివరీ చేస్తూ యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, ఆస్ట్రేలియా, మలేసియాలో కస్టమర్ బేస్ డెవలప్ చేసుకుంటోంది.
ముడి సరుకు
కేరళ తీరప్రాంతాల్లోని కొబ్బరికాయల క్వాలిటీ చాలా బాగుంటుంది. అందుకే అవి ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. అందుకే ప్రొడక్షన్‌కు కావాల్సిన కొబ్బరికాయలను స్థానికంగా కొంతమంది రైతుల నుంచి కొంటున్నారు. మార్కెట్ ధర కంటే1–2 రూపాయల ఎక్కువ ధర చెల్లిస్తున్నారు. రోజుకు పది వేల కొబ్బరి కాయలు ప్రాసెస్ చేయగల కెపాసిటీ ఉన్నా.. ప్రస్తుతం 60 శాతం మాత్రమే వాడుతున్నారు. యూనిట్ ఉన్న చావక్కాడ్ ప్రాంతం తీర ప్రాంతంలో ఉంది. దానివల్ల ట్రాన్స్‌పోర్టేషన్‌కు కూడా ఇబ్బంది లేదు.
సిగ్గుపడితే కుదరదు
“నేను ఒకప్పుడు చాలా సిగ్గుపడే దాన్ని. బయటి వాళ్లతో మాట్లాడటానికి భయపడేదాన్ని. కానీ.. ఉద్యోగంలో చేరాక పూర్తిగా మారిపోయా. సిగ్గుపడితే సక్సెస్ రావడం కష్టం. అందుకే మారా. ఇప్పుడు యూనివర్సిటీల్లో కూడా మాట్లాడుతున్నా. ఈ మధ్య విదేశీ పరిచయాలు పెరిగాయి. కొబ్బరి అభివృద్ధి బోర్డు ఆధ్వర్యంలో జరిగిన ఒక ఈవెంట్ కోసం థాయిలాండ్‌కు వెళ్లా. మహిళలు అంకితభావంతో పనిచేస్తే.. ఏదైనా సాధించగలరు. ఆడవాళ్లు ఆర్థిక స్వాతంత్ర్యం పొందితే వాళ్లు ఎదుర్కొనే ఎన్నో సమస్యలు తొలగిపోతాయి” అంటుంది సుమిల. c