
- కొత్త సబ్ స్టేషన్లకు ప్రపోజల్స్
- అందుబాటులోకి టోల్ ఫ్రీ నంబర్
మహబూబ్‌నగర్, వెలుగు: ఎండాకాలం ప్రారంభానికి ఇంకా నెల రోజుల టైం ఉంది. ఇప్పటి నుంచే ఎండలు దంచి కొడుతున్నాయి. ఉక్కపోత మొదలైంది. ఎండలకు గ్రౌండ్ వాటర్ కూడా క్రమంగా తగ్గుతోంది. దీంతో విద్యుత్ డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో ఓవర్ లోడ్‌ను తట్టుకొని నాణ్యమైన విద్యుత్ సప్లై చేసేందుకు సంబంధిత ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకుగాను మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో సమ్మర్ యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. లో వోల్టేజీ సమస్యను అధిగమించేందుకు ప్రత్యేక నిధులు కేటాయించారు.
ముందస్తు చర్యలు..
విద్యుత్ డిమాండ్ పెరుగుతుండడంతో ట్రాన్స్ఫార్మర్ల వద్ద ట్రిప్ కావడం, కాలిపోవడం వంటి వాటికి చెక్ పెట్టడంతో పాటు ఓవర్ లోడ్‌ను తట్టుకునేందుకు ఆఫీసర్లు సమ్మర్ యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. ఇందులో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లాలో రూ.14.14 కోట్లతో ఐదు 33/11 కేవీ సబ్ స్టేషన్ల కోసం ప్రతిపాదనలు పంపారు.
రూ.4.94 కోట్లతో కొత్తగా 33 కేవీ లైన్‌ను, రూ.1.84 కోట్లతో కొత్తగా 11 కేవీ విద్యుత్ లైన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తూ.. రూ.7.40 కోట్లతో అధిక సామర్థ్యం ఉన్న 9 కొత్త పవర్ ట్రాన్స్ఫార్మర్లు, రూ.3.05 కోట్లతో ఎక్కువ సామర్థ్యం ఉన్న 325 కొత్త డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు సిద్ధం చేశారు. నారాయణపేట జిల్లాలో పవర్ ట్రాన్స్ పార్మర్స్ కోసం రూ.4 కోట్లు, 11 కేవీ లైన్ కోసం రూ.80 లక్షలు, 33 కేవీ లైన్ ఏర్పాటు కోసం రూ.30 లక్షలు, కొత్త డీటీఆర్ ఏర్పాటుకు రూ.4.5 లక్షలతో ప్రణాళికలు రూపొందించారు.
అందుబాటులోకి టోల్ ఫ్రీ నంబర్..
కరెంట్ సమస్యలను వీలైనంత స్పీడ్‌గా పరిష్కరించేందుకు ఆఫీసర్లు మహబూబ్‌నగర్ జిల్లాలో 1912 టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రతి డివిజన్ పరిధిలో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ప్రజలకు సేవలు అందించనున్నారు. జిల్లాకు ఒక మొబైల్ వెహికల్‌ను అందుబాటులోకి తెచ్చారు.
విద్యుత్ వినియోగదారులు కరెంట్ సమస్య వస్తే ఈ టోల్ ఫ్రీ నంబర్ కంప్లైంట్ చేస్తే సరిపోతుంది. వెంటనే ఆఫీసర్లు అలర్ట్ అయి మొబైల్ వెహికల్తో స్పాట్‌కు చేరుకొని సమస్యను పరిష్కరిస్తారు. ఈ మొబైల్ వెహికల్లో కరెంటు వైర్లు, ఫ్యూజులు, తాళ్లు, నిచ్చెనతో పాటు ట్రాన్స్ఫార్మర్ పాడైతే, కొత్త వాటిని ఏర్పాటు చేయడానికి అదనపు ట్రాన్స్ఫార్మర్ అందుబాటులో ఉంటాయి.
సమీక్షలు.. సమావేశాలు..
ఎండాకాలం నేపథ్యంలో విద్యుత్ డిమాండ్‌తో వచ్చే సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, ఎమ్మెల్యేలు విద్యుత్ శాఖ ఆఫీసర్లతో వారం రోజులుగా సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. 33/11 కేవీ సబ్ స్టేషన్ల పనితీరుపై ఇటీవల మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో జరిగిన సమీక్షలో ఉన్నతాధికారులు వివిధ అంశాలపై ఆరా తీశారు. అవసరం ఉన్న చోట కొత్త ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 11 కేవీ కరెంట్ వైర్లపై ఓవర్ లోడ్ లేకుండా, ట్రాన్స్ఫార్మర్లు అవసరమైన చోట మార్చేందుకు ప్రపోజల్స్ పంపించాలని ఆదేశాలు జారీ చేశారు.
పాలమూరు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఇటీవల కరెంట్ ఆఫీసర్లతో సమావేశమయ్యారు. వ్యవసాయానికి, ఇంటి అవసరాలకు ఎలాంటి కోతలు లేకుండా విద్యుత్ అందించాలని సూచించారు. మహబూబ్‌నగర్‌కు కొత్తగా వచ్చిన ట్రాన్స్ఫార్మర్లను ఎండాకాలం ప్రారంభం కాకముందే ఏర్పాటు చేయాలని ఆదేశించారు.