3 రోజులు మాడు పగిలే ఎండలు : మధ్యాహ్నం బయటకు రావొద్దు!

3 రోజులు మాడు పగిలే ఎండలు : మధ్యాహ్నం బయటకు రావొద్దు!
  • ఈశాన్య ఛత్తీస్ గఢ్ నుంచి ఉపరితల ద్రోణి
  • రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు వడగాల్పులు
  • ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు చేరే అవకాశం

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న టెంపరేచర్స్ జనాలను భయపెడుతున్నాయి. వడదెబ్బ, వడగాలులకు వృద్ధులు పిట్టల్లా రాలుతున్నారు. ఏపీ, తెలంగాణలో రెండు రోజుల్లోనే ఏకంగా 26 మంది ప్రాణాలు విడిచారు. మండే ఎండలకు తోడు మరో 3 రోజులు తీవ్రమైన వడగాల్పులు ఉంటాయని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది.

ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈశాన్య ఛత్తీస్ గఢ్  నుంచి కోమోరిన్  ప్రాంతం వరకు తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడంతో.. పొడి వాతావరణం పెరిగిందని తెలిపింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది.

రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వీలైనంత వరకు పగటిపూట బయటకు రాకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. ఎండలో బయటకు వెళ్లాల్సివచ్చిన తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.

రాష్ట్రంలో ఆదివారం అత్యధికంగా ములుగు, వరంగల్ రూరల్, మహబూబాబాద్ జిల్లాల్లో 46 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. భద్రాచలం, ఖమ్మంలో 45 డిగ్రీల చొప్పున అత్యధిక పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్లగొండ, రామగుండాల్లో 44 డిగ్రీలు, హన్మకొండ, నిజామాబాద్ లో 43 డిగ్రీలు, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ లో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక  హైదరాబాద్ లో 41 డిగ్రీల టెంపరేచర్స్ రికార్డ్ అయ్యాయి.

అటు ఆంధ్రప్రదేశ్ లోనూ ఎండలు దంచికొడుతున్నాయి. ఎండల తీవ్రత పెరుగుతుండటంతో రియల్  టైం గవర్నెన్స్ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. ఏపీ వ్యాప్తంగా 210 మండలాల్లో వడగాల్పుల ప్రమాదం ఉందని తెలిపింది. చిన్నారులు, వృద్ధులు ఎండల్లో తిరగకుండా జాగ్రత్తలు పాటించాలని కోరింది. ఈ నెల 10 వరకు ఇదే పరిస్థితి కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందంది. ఆదివారం ఉదయం 11 గంటలకే పోలవరంలో అత్యధికంగా 45.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఏపీలోని 52 ప్రాంతాల్లో 45 డిగ్రీలకుపైగా పగటి ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి.

ఎండల తీవ్రతకు తట్టుకోలేక జనం ప్రాణాలు విడుస్తున్నారు. వడదెబ్బతో తెలంగాణలో ఆదివారం ఒక్కరోజే ఏడుగురు చనిపోయారు. ఏపీలో శని, ఆదివారాల్లో కలిపి 19 మంది ప్రాణాలు వదిలారు.