- గతేడాదితో పోలిస్తే 2 లక్షల కనెక్షన్లు అదనం
- నిరుడు గరిష్ట డిమాండ్4,352 మెగావాట్లు
- ఈసారి 5 వేలకు చేరే అవకాశం
- ఒక్క నిమిషం కూడా కరెంట్ పోవద్దని సీఎం సూచన
- కచ్చితంగా అమలు చేస్తామంటున్న సీఎండీ ముషారఫ్ ఫరూఖీ
హైదరాబాద్ సిటీ, వెలుగు: విద్యుత్ శాఖకు సమ్మర్ సవాల్‌గా మారనుంది. గ్రేటర్లో ప్రతి ఏటా విద్యుత్‌కనెక్షన్లు పెరుగుతుండడం, ఈసారి రెండు లక్షలకు పైగా కనెక్షన్లు పెరగడంతో విద్యుత్‌కు డిమాండ్ విపరీతంగా పెరగనున్నది. గ్రేటర్ పరిధిలో 2003లో 60.26 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, 2024 డిసెంబరు నాటికి ఇవి 62.92 లక్షల కనెక్షన్లకు చేరుకున్నాయి. దీనికి సరిపడా ఏర్పాట్లు చేయడం డిస్కంకు సవాలుగా మారింది. అందుకే, దీనికి సంబంధించి కార్యాచరణను నవంబర్లోనే ప్రారంభించిన డిస్కం దాదాపు సమ్మర్సవాల్ను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది.
20 నుంచి 25 శాతం పెరుగుదల
గ్రేటర్ లో ప్రతి వేసవిలోనూ విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో నమోదవుతున్నది. 2023లో 3,756 మెగావాట్ల గరిష్ట డిమాండ్ ఉండగా.. 2024 లో ఇది 16 శాతం పెరిగి 4,352 మెగావాట్లకు చేరుకుంది. 2023 మే నెలలో గరిష్ట వినియోగం 81.39 మిలియన్ యూనిట్లు కాగా, 2024లో 12 శాతం వృద్ధితో 90.68 మిలియన్ యూనిట్లకు చేరింది.
అయితే, రెండు లక్షల కనెక్షన్లు పెరగడంతో ఈ సమ్మర్ లో విద్యుత్ డిమాండ్ 20 నుంచి 25 శాతం పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు అంటున్నారు. దీంతో రోజుకు గరిష్ట డిమాండ్ 5000 మెగావాట్లు కాగా, ఈ గరిష్ట వినియోగం ఏడాదికి 100 మిలియన్ యూనిట్లకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
నాలుగు నెలలే కీలకం
ప్రస్తుతం చలి తగ్గి ఎండలు పెరుగుతున్నాయి. దీంతో విద్యుత్‌వాడకం కూడా పెరుగుతున్నది. జనవరి పూర్తి కాకముందే ఎండల తీవ్రత పెరిగి విద్యుత్వినియోగం కూడా పెరిగింది. మూడు రోజుల కింద జవనరి 31న 3,334 మెగావాట్లు నమోదు కావడం దీనికి నిదర్శనం. గతేడాది మార్చి 31న చూస్తే ఈ వినియోగం 3,018 మెగావాట్లు మాత్రమే.. దీన్ని బట్టి ఈ వేసవిలో విద్యుత్‌వాడకం ఎలా ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. గతంలో విద్యుత్ వినియోగం చూస్తే.. మార్చి నుంచి పెరుగుతూ ఏప్రిల్, మే వరకు గరిష్ఠ స్థాయికి చేరుకున్నది. ఈసారి కూడా ఇంతకన్నా ఎక్కువే నమోదయ్యే అవకాశాలున్నాయి.
శివారులో పెరిగిన డిమాండ్
గ్రేటర్ శివారు ప్రాంతాలైన నెమలి నగర్, గోపన్ పల్లి, కోకాపేట్, కోహెడ, తట్టి అన్నారం, అబ్దుల్లాపూర్ మెట్, మాన్సాన్ పల్లి, అజిజ్ నగర్, కందుకూరు, కే సింగారం, మల్లాపూర్, వాయుపురి, ఉప్పల్ భగాయత్, దుండిగల్ వంటి ప్రాంతాల్లో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరుగుతున్నది.
దీంతో ఆయా ప్రాంతాల్లో అవసరానికి తగ్గట్టు 220/132/33 కేవీ సబ్ స్టేషన్స్ ఏర్పాటు, ఇతర నెట్వర్క్పటిష్టం చేయడానికి చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులకు సీఎండీ ముషారఫ్ఫరూఖీ సూచించారు. ఈ ప్రాంతాల్లో ఇండస్ట్రీస్రావడం, కొత్తగా వెలసిన కాలనీల్లో ఇండ్ల నిర్మాణాలు, డెవలప్మెంట్కారణంగా విద్యుత్ కనెక్షన్లు, విద్యుత్ డిమాండ్ పెరిగినట్లు అధికారులు చెప్తున్నారు.
ఫోన్‌చేస్తే స్పందించాలి
వేసవిలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండొద్దని, సమస్యలు రాకుండా చూసుకోవాలని సీఎం ఆదేశించారు. ఆ మేరకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఈ బాధ్యతను ఎస్ఈ లు తీసుకొని ఒక్క నిమిషం కూడా కరెంటు పోకుండా చూసుకోవాలి. ఎక్కడైనా సమస్యలు ఏర్పడి వినియోగదారులు ఫోన్ చేస్తే వెంటనే స్పందించి పరిష్కరించాలి. లేకపోతే యాక్షన్తప్పదు ముషారఫ్ ఫరూఖీ, టీజీఎస్పీడీసీఎల్, సీఎండీ