టెన్త్ క్లాసులో సెక్షన్​కొక టీచర్ బడికి రావాలె

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని స్కూల్ స్టూడెంట్లకు ఈ నెల 24 నుంచి సమ్మర్ హాలీడేస్ ప్రారంభం కానున్నాయి. విద్యాశాఖ షెడ్యూల్​ ప్రకారం ఈ నెల 23తో అకడమిక్ ఇయర్ ముగియనుంది. అయితే మే 23 నుంచి టెన్త్ ఎగ్జామ్స్ ఉండటంతో.. పరీక్షలకు స్టూడెంట్లను ప్రిపేర్ చేసేందుకు ప్రతి సెక్షన్​కు ఒక టీచర్​ బడికి రావాలని అధికారులు ఆదేశించారు. ఈ మేరకు బుధవారం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన ఉత్తర్వులిచ్చారు. పబ్లిక్ పరీక్షలు జరిగేదాకా దీన్ని అమలు చేయాలని డీఈవోలను ఆదేశించారు. సర్కారు బడులతోపాటు మోడల్ స్కూల్స్, కేజీబీవీలు, రెసిడెన్షియల్ గురుకులాలు, ఎయిడెడ్ స్కూళ్లలోనూ ఈ ఉత్తర్వులు అమలు అవుతాయని తెలిపారు. టెన్త్ స్టూడెంట్లకు మిడ్డే మీల్స్ పెట్టాలా లేదా అనేదానిపై అధికారులు స్పష్టత ఇవ్వలేదు. కాగా, నవంబర్ 30దాకా ఎస్​ఎంసీ కమిటీల గడువును పొడిగించినట్టు విద్యాశాఖ సెక్రటరీ సందీప్​ కుమార్ సుల్తానియా ఉత్తర్వులిచ్చారు.