- కేసులు పెరుగుతున్నందున సర్కారు యోచన
- 23న లాస్ట్ వర్కింగ్ డే ప్రకటించే చాన్స్
- 1 నుంచి 9వ తరగతి వరకు అందరూ పాస్!
- నేడో, రేపో ఉత్తర్వులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో స్కూళ్లకు సమ్మర్ హాలిడేస్ ఇవ్వాలని సర్కారు యోచిస్తోంది. ప్రతిఏటా లాగే ఈ ఏడాది ఏప్రిల్ 23న లాస్ట్ వర్కింగ్ డే పెట్టాలని భావిస్తోంది. ఇప్పటికే అన్ని క్లాసులు రద్దు చేసినప్పటికీ టీచర్లు స్కూళ్లకు వెళ్తున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్టూడెంట్లతో పాటు టీచర్లకు కూడా సెలవులు ప్రకటించాలని టీచర్ యూనియన్ల నుంచి ఒత్తిడి రావడంతో ఈ నెల 24 నుంచి సెలవులు ప్రకటించాలని సర్కారు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అలాగే ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు స్టూడెంట్లను ఎగ్జామ్స్ లేకుండా పైక్లాసులకు ప్రమోట్ చేస్తూ ఒకటీ, రెండ్రోజుల్లో అధికారిక ఉత్తర్వులు రానున్నాయని తెలిసింది.
స్టూడెంట్లు లేకుండా.. టీచర్లే
రాష్ట్రంలో మొత్తం 40,898 స్కూళ్లుండగా, వాటిలో 59.26 లక్షల మంది చదువుతున్నారు. కరోనా తీవ్రతతో ఈ అకడమిక్ ఇయర్ ఆలస్యంగా ప్రారంభమైంది. సెప్టెంబర్ ఫస్ట్ నుంచే మూడో తరగతి నుంచి పదోతరగతి వరకూ టీవీల ద్వారా పాఠాలు మొదలుపెట్టారు. కరోనా కేసులు తగ్గడంతో ఫిబ్రవరిలో ఫిజికల్ క్లాసులు స్టార్ట్ చేశారు. అయితే మళ్లీ కేసులు పెరుగుతుండటంతో మార్చి 24 నుంచి అన్ని విద్యాసంస్థలను ప్రభుత్వం మూసివేసింది. దీంతో ఫిజికల్ క్లాసులు బంద్ కాగా, ఆన్లైన్ క్లాసులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. బడులకు స్టూడెంట్లు రాకున్నా, టీచర్లు మాత్రం బడులకు పోతున్నారు. దాదాపు నెలరోజులుగా బడుల్లో వారంతా ఖాళీగానే ఉంటున్నారు. స్టేట్‌లో కరోనా కేసులు పెరుగుతుండడంతో పీఆర్టీయూ, యూటీఎఫ్, ఎస్టీయూ, టీపీటీఎఫ్, డీటీఎఫ్, తపస్‌తో పాటు పలు సంఘాలు టీచర్లకూ సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. కొన్నిసంఘాలు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశాయి. దీనిపై ఆమె సానుకూలంగా స్పందించినట్టు నేతలు చెబుతున్నారు.
9వ తరగతి వరకు అంతా పాస్
రాష్ట్రంలో 1 నుంచి 9వ తరగతి వరకు సుమారు 54 లక్షల మంది చదువుతున్నారు. వీరిలో ఒకటీ, రెండో తరగతి స్టూడెంట్లకు ఎలాంటి క్లాసులు జరగలేదు. మూడో తరగతి నుంచే ఆన్లైన్ క్లాసులు నిర్వహించారు. ఈ క్రమంలో చాలా ప్రైవేటు స్కూళ్లు పై తరగతులకు ప్రమోట్ చేయాలంటే మొత్తం ఫీజు కట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై పేరెంట్స్, స్టూడెంట్ల యూనియన్ల నుంచి సర్కారుకు ఫిర్యాదులు అందాయి. దీంతో సాధ్యమైనంత త్వరగా అందరినీ ప్రమోట్ చేస్తున్నట్టు ప్రకటించాలని సర్కారు భావిస్తోంది. దీనిపై సీఎంకు తెలియజేసి, ఒకటి రెండ్రోజుల్లోనే అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చే అవకాశముంది.
మే 27 నుంచి అనుకున్నా..
మామూలుగా ఏటా సమ్మర్ హాలిడేస్ ఏప్రిల్ 24 నుంచి ఉంటాయి. కరోనా కారణంగా అకడమిక్ ఇయర్ గందరగోళంగా మారి, లేట్‌గా క్లాసులు మొదలైన నేపథ్యంలో మే 27 నుంచి సమ్మర్ హాలిడేస్ ఉంటాయని ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ గతంలో ప్రకటించింది. అయితే మళ్లీ కరోనా కేసులు పెరగడంతో క్లాసులు రద్దు చేసిన నేపథ్యంలో రెండు రోజుల క్రితం ప్రభుత్వ పెద్దలు, విద్యాశాఖ అధికారులు సమీక్షించి, టీచర్లకూ సెలవులపై నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఏటా మాదిరిగానే ఏప్రిల్ 23నే లాస్ట్ వర్కింగ్ డేగా ప్రకటించేందుకు సిద్ధమైనట్లు తెలిసింది.