- ఫిట్ కాప్ ద్వారా హెల్త్ చెక్
- రాచకొండలో ఏసీ హెల్మెట్లు
హైదరాబాద్, వెలుగు: ఎండలు దంచి కొడుతున్నాయి. వారం రోజుల నుంచి మరీ తీవ్రంగా ఉన్నాయి. దీంతో ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. కానీ డ్యూటీ చేయక తప్పని ట్రాఫిక్ పోలీసులు ఉదయం నుంచి సాయంత్రం వరకు సూర్యుడి ప్రతాపానికి విలవిల్లాడుతున్నారు. ఓ వైపు ఉక్కపోత మరోవైపు ఎండలతో నరకం అనుభవిస్తున్నారు. కొందరు ఇప్పటికే అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో గ్రేటర్‌లోని 3 కమిషనరేట్ల పరిధిలో పనిచేస్తున్న సుమారు 5 వేల మందికి పైగా ట్రాఫిక్ పోలీసుల ఆరోగ్యంపై అధికారులు దృష్టిపెట్టారు. ఫిక్ కాప్ యాప్ ద్వారా వారి ఆరోగ్య పరిస్థితులను సమీక్షిస్తున్నారు. గ్రేటర్‌లోని 3 కమిషనరేట్లలో ట్రాఫిక్ పోలీసులకు ఇప్పటికే సమ్మర్ స్పెషల్ కిట్లు అందించారు. పోలీస్ సిబ్బందికి సైతం ఈ కిట్లను అందిస్తోంది.
వాటర్ బాటిల్, ఓఆర్ఎస్
ట్రాఫిక్ పోలీసులకు అందించే ఈ కిట్లలో ఓ వాటర్ బాటిల్, ఓఆర్‌ఎస్, గాగుల్స్, హెల్మెట్, విఫెల్టెట్ జాకెట్ ఎండవేడికి చల్లదనం కలిగించే షూస్ అందిస్తున్నారు. వీటితో పాటు షిఫ్ట్‌లో ఉన్న వారికి రెండు సార్లు మజ్జిగ, నిమ్మరసం,రాగి జావ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. రాచకొండ పోలీసులు ప్రయోగత్మకంగా ఐదు ఏసీ హెల్మెట్లను సిబ్బందికి అందించారు. ఫలితాలను బట్టి పాయింట్ డ్యూటీలో ఉన్న సిబ్బందికి వీటిని ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆయిల్‌ఫుడ్ తగ్గించాలి
ఫిట్ కాప్ ద్వారా సిబ్బంది హెల్త్‌ను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. సాధ్యమైనంత వరకు ఆయిల్ ఫుడ్స్ తగ్గించి.. వాటర్ ,మజ్జిగ లాంటి లిక్విడ్ఐటమ్స్ ను ఎక్కువగా తీసుకోవాలి. డ్యూటీలో ఉన్న సిబ్బందికి ఇప్పటికే సమ్మర్ కూల్ కిట్స్ అందించాం.
–సుధీర్‌బాబు, ట్రాఫిక్ చీఫ్, హైదరాబాద్