ఎండలు ముదురుతున్నయ్!

ఎండలు ముదురుతున్నయ్!
  • వారం రోజులుగా 36 డిగ్రీలకు పైనే టెంపరేచర్
  • రాష్ట్రవ్యాప్తంగా14 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు  
  • సోమవారం నిర్మల్ లో 38.3 డిగ్రీలు నమోదు 
  • ఆదిలాబాద్ లో పొద్దంతా ఎండలు.. రాత్రి చలిగాలులు 
  • కూలర్లు, ఏసీల ఏర్పాటుకు సిద్ధమవుతోన్న జనాలు
  • శివరాత్రి తర్వాత ఉష్ణోగ్రతలు పెరుగుతాయంటున్న 
  • వాతావరణ శాఖ అధికారులు

ఆదిలాబాద్, వెలుగు :  రాష్ట్రంలో రోజురోజుకు ఎండలు ముదురుతున్నాయి. వారం రోజులుగా 36 డిగ్రీలు నమోదైన టెంపరేచర్ సోమవారం 38.3 డిగ్రీలకు పెరిగింది.  తెలంగాణ వ్యాప్తంగా14 జిల్లాలో 38 డిగ్రీలకుపైగా , 15 జిల్లాలో 37 డిగ్రీలకుపైగా, 4 జిల్లాల్లో 36 డిగ్రీలు నమోదు అయ్యాయి. సాధారణ టెంపరేచర్ కంటే ప్రస్తుతం 3 డిగ్రీలు ఎక్కువగానే నమోదవుతోంది. 

అత్యధిక నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్ లో 38.3, భద్రాద్రి, జగిత్యాల, కామారెడ్డి, ఖమ్మం, వనపర్తి జిల్లాల్లో 38.2, గద్వాల్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, కొమురం భీమ్ జిల్లాల్లో 38.1, మంచిర్యాల కోటపల్లి, నర్సాపూర్ ప్రాంతాల్లో, ములుగు, వరంగల్ జిల్లాలో 38 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. 

భూపాలపల్లి, మహబూబ్ నగర్ లో 37.9 , కరీంనగర్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో 37.8, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో 37.7, జనగాం, మేడ్చల్, నల్గొండ, సూర్యాపేట, 37.6, సిద్దిపేట, హనుమకొండలో 37.4, మహబూబాబాద్, నారాయణ పేట్, 37.3, మెదక్ 36.8, యాదాద్రిలో 36.6, హైదరాబాద్ 36.3, సంగారెడ్డి 36.1 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. ఇప్పటికే ఇండ్లలో కూలర్లు, ఏసీలను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా పాతవాటికి రిపేర్లు చేయిస్తున్నారు. 

ఆదిలాబాద్ జిల్లాలో భిన్నంగా పరిస్థితులు 

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కంటే ఆదిలాబాద్ లో వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. అన్ని చోట్ల ఎండలు ముదురుతుండడంతో పాటు ఉక్కపోస్తుంటే.. ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం పొద్దంతా ఎండలు.. రాత్రి చలితో  ఈదురు గాలులు వీస్తున్నాయి. శివరాత్రి తర్వాత ఎండల తీవ్రత పెరిగే చాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. గతేడాది కంటే ఈసారి వేసవిలో ఉష్ణోగ్రతలు ఎక్కువగానే  నమోదుకానున్నట్లు పేర్కొన్నారు.