
- కుక్కల దాహం తీర్చేలా.. రోడ్లపై నీళ్ల తొట్టెలు
- ముందుగా 7 వేల వాటర్ బౌల్స్ ఏర్పాటు
- వేసవిలో నీళ్లు, ఆహారం దొరక్క జనంపై దాడులు చేస్తున్న కుక్కలు
- దాహం తీరిస్తే.. దాడులు తగ్గుతాయంటున్న జీహెచ్ఎంసీ
- పక్షులకూ వాటర్ బౌల్స్ ఉపయోగకరంగా ఉంటాయన్న అధికారులు
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఎండా కాలంలో వీధి కుక్కల దాహం తీర్చేందుకు ఎప్పటిలాగే ఈసారి కూడా సిటీ రోడ్లపై నీటి తొట్టెలను ఏర్పాటు చేస్తోంది. ఎండలకు ఆకలి, దప్పికతో అల్లాడి.. చిర్రెత్తి వచ్చిపోయే వారిని కరవకుండా చర్యలు తీసుకుంటోంది. గత రెండేండ్లుగా కుక్కల కోసం రోడ్ల వెంట ఇలా తొట్టెలను ఏర్పాటు చేస్తోంది.
గ్రేటర్పరిధిలో 30 సర్కిళ్లు ఉన్నాయి. ఒక్కో సర్కిల్ కు 200కు పైగా సుమారు 7 వేల కుండీలు ఏర్పాటు చేసింది. స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి బాధ్యత తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తోంది. గతేడాది ఎండాకాలం చివరలో ఏర్పాటు చేయడంతో లాభం లేకుండా పోయింది. అందుకే ఈసారి ముందుగానే నీటి తొట్టెలను పెడుతోంది. కుక్కలతోపాటు పక్షులు కూడా నీళ్లు తాగేందుకు ఇవి ఉపయోగపడతాయని భావిస్తోంది.
ఎండా కాలమే అసలు సమస్య
యానిమల్ వెల్ఫేర్బోర్డు ఆఫ్ ఇండియా గైడ్ లెన్స్ ప్రకారం కాలనీల్లో ఫీడింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నాలుగేండ్ల కింద జీహెచ్ఎంసీ సర్క్యూలర్ జారీ చేసింది. అయితే, ఆయా కాలనీవాసులకు, స్వచ్ఛంద సంస్థలకు పెద్దగా అవగాహన కల్పించలేకపోయింది. రెండేండ్ల కింద కుక్కకాటు కేసులు అధికమవడంతో వలంటీర్లు, డాగ్ లవర్స్ తో కలిసి జీహెచ్ఎంసీ వెటర్నరీ అధికారులు కొన్నిచోట్ల ఫీడింగ్ సెంటర్లు ఏర్పాటు చేయించారు.
ఆహారం దొరకకపోవడంతోపాటు వేసవిలో నీళ్లు దొరక్క దాహంతో అల్లాడుతున్నాయని గుర్తించారు. దాహం తీరకు కూడా దాడులు చేస్తున్నాయని తెలుసుకున్నారు. అప్పుడు కొన్నిచోట్ల, గత వేసవిలో మరికొన్నిచోట్ల వాటర్బౌల్స్ఏర్పాటు చేశారు. ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఈసారి వేసవి ప్రారంభంలోనే తొట్టెలను అందుబాటులోకి తెచ్చారు.
ఎక్కడైనా వలంటీర్లు ముందుకు వస్తే వారికీ అవకాశం కల్పిస్తున్నారు. కుక్కలు నీళ్లు, ఆహారం దొరక్క పక్క కాలనీలకు పోతున్నాయని, అక్కడి వేరే కుక్కలు దాడులు చేస్తుండడంతో వెర్రితో జనాలపై పడుతున్నాయంటున్నారు. అందుకే, ఒక కాలనీలోని కుక్కలు మరో కాలనీలోకి పోకుండా పక్కాగా నీటి తొట్టెలు ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నారు.
చిరు వ్యాపారులకు నీళ్లు పోసే బాధ్యత
మెయిన్రోడ్లు, కాలనీల్లో చిరువ్యాపారులు ఉండే చోట నీటి తొట్టెలు ఏర్పాటు చేస్తున్నారు. వారికే నీళ్లు పోసే బాధ్యత అప్పగిస్తున్నారు. చిన్న కాలనీలైతే ఒకచోట, పెద్ద కాలనీలైతే రెండు, మూడు చోట్ల తొట్టెలు పెడుతున్నారు. ఎవరికీ సంబంధంలేని చోట ఏర్పాటు చేస్తే బల్దియానే నీళ్లు పోసే బాధ్యత తీసుకుంటోంది. 2023లో 2,453, గత వేసవిలో మరికొన్ని, ఇప్పుడు 7 వేల నీటి తొట్టెలను ఏర్పాటు చేయగా, ఇంకా అవసరమైన ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.