చౌదరికుంట జాడేది .. నాడు జలకళ .. కబ్జాలతో నేడు వెలవెల!

  • గతంలో నగరానికి తాగునీటిని అందించిన సమ్మర్​ స్టోరేజ్​ ట్యాంక్
  • కాలక్రమేణా మూలకుపడిన డీ ఫ్లోరైడ్ ప్రాజెక్టు
  • అందులోనే మిషన్ భగీరథ ఆఫీస్, చుట్టూరా పెరిగిన ఆక్రమణలు
  • అన్యాక్రాంతమైన సమ్మర్​ స్టోరేజ్​ల్యాండ్స్..

హనుమకొండ/ హసన్ పర్తి, వెలుగు: చౌదరికుంట జాడ కనుమరుగవుతోంది. గ్రేటర్​వరంగల్​ నగరానికి తాగునీరు అందించిన ఈ సమ్మర్​ స్టోరేజ్​ ట్యాంక్​ ఇప్పుడు ఆక్రమణలకు కేరాఫ్​గా మారింది. కబ్జాలను అరికట్టాల్సిన ఆఫీసర్లే నిబంధనలకు నీళ్లోదిలి కుంట స్థలంలో ఆఫీస్​నిర్మించడం, పరిరక్షించకపోవడంతో రూ.కోట్ల విలువ చేసే మిగతా భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించిన అధికారుల కారణంతోగానే నగర తాగునీటి అవసరాలను తీర్చే ప్రాజెక్టు కబ్జాల చెరలో చిక్కుకున్నదని స్థానిక ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం సమ్మర్​లో నీటి సమస్య రాకుండా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో గతంలో తాగునీటిని అందించి, నిరుపయోగంగా మారిన చౌదరికుంట వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది.

కోట్ల విలువైన భూములు..

కాకతీయుల కాలంలో ఓరుగల్లు నగరం చుట్టూ గొలుసుకట్టు చెరువులు, కుంటలు నిర్మించగా, కబ్జాల పుణ్యమాని దాదాపు 42 చెరువులు కనుమరుగయ్యాయి. ఇప్పుడు చౌదరికుంట వంతు వచ్చినట్లు కనిపిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా చౌదరికుంటలో హనుమకొండ, వరంగల్​ జిల్లాల మిషన్​ భగీరథ ఆఫీస్​లను నిర్మించడంతో అప్పట్లో వివాదానికి దారి తీసింది. అయినప్పటికీ కుంటకు సంబంధించిన ఎఫ్​టీఎల్​భూమి పరిరక్షణ లేకపోవడంతో బై నంబర్లు సృష్టించి పలువురు కబ్జాలకు పాల్పడ్డారు. దీంతో 18.2 ఎకరాలు ఉండాల్సిన భూమి ఇప్పుడు 15.32 ఎకరాలే ఉంది. 

ఈ ల్యాండ్​ వరంగల్​–కరీంనగర్​ హైవేకు ఆనుకొని ఉండడంతో ఇక్కడ గజం సుమారు రూ.20 వేలకుపైనే పలుకుతున్నది. ఈ లెక్కన కబ్జా అయిన మూడెకరాల భూమి విలువ సుమారు రూ.30 కోట్లకు పైనే అన్యాక్రాంతమైందని తెలుస్తోంది. హసన్ పర్తి పోలీస్ స్టేషన్, ఎమ్మార్వో ఆఫీస్​కు 100 మీటర్ల దూరంలోనే ఉన్నా ఆక్రమణలు ఆగలేదు.

15.32 ఎకరాల చుట్టూ ఆఫీసర్లు కాంపౌండ్ వాల్ కట్టి చేతులుదులుపుకొగా, గతంలో చౌదరికుంట స్థలంలో నిర్మించిన వాటర్​ట్యాంక్ స్థలం కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడం, భగీరథ భవన్ మెయిన్ గేట్ ఎదుటే ప్రైవేటు బిల్డింగులు లేవడం గమనార్హం. కుంట కట్ట చుట్టూ ఉన్న భూమిని కూడా ప్రైవేటు పరం చేసేందుకు చూస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఓ మాజీ ప్రజాప్రతినిధి పేరు చెప్పి ఇక్కడ చుట్టుపక్కలా నిర్మాణాలు వేలిశాయనే స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టిసారించి చౌదరికుంట పరిరక్షణతోపాటు అన్యాక్రాంతమైన భూములపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

గతంలో డీ ఫ్లోరైడ్ ప్రాజెక్ట్..

​వరంగల్ నగర పరిధి 66వ డివిజన్ హసన్ పర్తి సమీపంలో సర్వే నెంబర్ 180లో దాదాపు 18.2 ఎకరాల్లో చౌదరికుంట విస్తరించి ఉండేది. 2001లో అప్పటి ప్రభుత్వం దీనిని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్​గా ఉపయోగించడంతోపాటు డీ ఫ్లోరైడ్ ప్రాజెక్టు ఏర్పాటు చేసి హసన్​పర్తి మండలం, చుట్టుపక్కల గ్రామాలకు తాగునీటిని అందించేది. కరీంనగర్ ఎల్ఎండీ నుంచి వచ్చే రా వాటర్​ను ఇక్కడ ట్రీట్మెంట్ చేసి సప్లై చేసేవారు. బీఆర్​ఎస్​ సర్కారు ఏర్పడిన తర్వాత 'మిషన్ భగీరథ' పేరుతో తాగునీటి సరఫరాను విస్తరించి, ఈ డీఫ్లోరైడ్ ప్రాజెక్టును వదిలేశారు. ఎల్ఎండీ నుంచి నీటిని తీసుకునేందుకు కాకతీయ కెనాల్ నుంచి వేసిన పైపులైన్లను కూడా తొలగించారు. దీంతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఎండిపోయింది.