ఫిట్‌గా, హెల్దీగా ఉండాలనుకునేవారు రెగ్యులర్‌గా వర్కవుట్స్ చేస్తూనే ఉంటారు. వేసవికాలం వచ్చేసింది. వేడి కొద్ది కొద్దిగా పెరుగుతోంది. ఈ టైంలో ఎక్సర్‌సైజ్‌లు చేసేవాళ్లు రొటీన్‌గా కాకుండా కొంచెం డిఫరెంట్ ఎక్సర్‌సైజ్‌లు చేస్తే మంచిది. సమ్మర్‌లో శరీరంలో వేడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చల్లబరిచే ఎక్సర్‌సైజ్‌లు చేయాలి. ఈత కొట్టడం, గార్డెనింగ్, వాకింగ్ లాంటివి చేస్తే బెటర్. అయితే, వాటితో పాటు కేర్ కూడా ముఖ్యమే.
ఈత
ఈత కొట్టడం అనేది ఎరోబిక్ ఎక్సర్‌సైజ్‌లలో బెస్ట్. ఈత కొట్టడం వల్ల బాడీలోని ప్రతి మజిల్‌లో మూమెంట్ ఉంటుంది. దానివల్ల బాడీ స్ట్రెంత్ పెరుగుతుంది. అంతేకాకుండా వేసవిలో టెంపరేచర్ ఎక్కువగా ఉన్న కారణంగా శరీరం కూడా చల్లబడుతుంది.
తోటపని
తోటపని.. మనసుకు, శరీరానికి మంచి వర్కవుట్. నేచర్‌తో కలిసి ఉండటం వల్ల బ్లడ్ ప్రెజర్ కంట్రోల్‌లో ఉంటుంది, ఒత్తిడి తగ్గుతుంది. పొద్దున ఎండలో ఉండటం వల్ల విటమిన్ – డి కూడా అందుతుంది. మొక్కలు నాటేందుకు గుంతలు తీయడం, గార్డెన్‌లో కలుపు తీయడం లాంటివి చేస్తే చాలా మంచి ఫిజికల్ యాక్టివిటీ అవుతుంది.
సైక్లింగ్
రోజూ చేసే స్టేషనరీ ఎక్సర్‌సైజ్ కంటే..వేసవిలో సైకిల్ తొక్కడం చాలా మంచిది. ఈతలో ప్రతి కండరం కదిలినట్లే సైక్లింగ్‌లో కూడా అవుతుంది. శరీరం ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. కీళ్లు బిగుసుకుపోకుండా యాక్టివ్‌గా ఉంటాయి.
నడక
వేసవిలో బ్రిస్క్ వాకింగ్ చేయడం ఉత్తమం. సాయంత్రం వేళలో పార్క్, గార్డెన్ లాంటి చల్లని ప్రదేశాల్లో వాకింగ్ చేస్తే చక్కటి ఎక్సర్‌సైజ్ అవుతుంది. మంచి వాతావరణంలో ఉన్నామనే ఫీలింగ్ కూడా వస్తుంది.
బీచ్ వాలీబాల్
బీచ్ వాలీబాల్ ఆడటం అందరికీ కుదరదు. అందుకే, బీచ్ దగ్గర్లో ఉన్నవాళ్లకి ఇది మంచి సమ్మర్ ఎక్సర్‌సైజ్. బీచ్‌లో చల్లటి గాలి తగులుతూ ఉంటుంది, మరోవైపు వాలీబాల్ ఆడటం మంచి ఎక్సర్‌సైజ్ కూడా.
కేర్ ఇలా
టైం ముఖ్యం
వేసవిలో మనం వర్కవుట్ చేసే టైం చాలా ఇంపార్టెంట్. తెల్లవారుజామున లేదా సాయంకాలం మాత్రమే వర్కవుట్స్ చేయాలి. ముఖ్యంగా 10 నుంచి 4 గంటల మధ్యలో ఎండ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ టైంలో వర్కవుట్స్‌కు దూరంగా ఉంటే బెటర్. ఆ టైమ్‌లోనే కుదురుతుంది అనుకునేవారు ఈత కొట్టడం లాంటి ఆక్వా ఎరోబిక్స్ చేస్తే మంచిది.
లేతరంగు, వదులు బట్టలు
వర్కవుట్స్ చేసేటప్పుడు లేతరంగు, ఒంటికి సౌకర్యంగా ఉండే బట్టలే వేసుకోవాలి. సమ్మర్‌లో మామూలుకంటే శరీరంలో వేడి ఎక్కువగా ఉంటుంది. అందుకే గాలి తగిలి శరీరం చల్లబడేందుకు వీలుగా ఉండే, లేతరంగులు ఉన్న జిమ్‌వేర్ వేసుకుంటేనే మంచిది.
సన్‌స్క్రీన్ లోషన్ మస్ట్
సమ్మర్‌లో అవుట్‌డోర్ వర్కవుట్స్ చేసేటప్పుడు సన్‌స్క్రీన్ లోషన్స్ లాంటివి వాడాలి. నేరుగా ఎండలోకి వెళ్తే చర్మం పాడవుతుంది కాబట్టి లోషన్స్ వాడటం మంచిది.
నీళ్లు తాగాలి
వర్కవుట్స్ చేసేటప్పుడు హైడ్రేటెడ్ కాకుండా చూడాలి. ఎక్సర్‌సైజ్ మొదలుపెట్టేముందు, పూర్తయ్యాక కచ్చితంగా నీళ్లు తాగాలి. లేకుంటే బాడీ డీ – హైడ్రేట్ అయ్యే ప్రమాదం ఉంటుంది.