
ఎండలు పెరుగుతున్నాయి. పెరుగుతున్న ఎండలతో పాటే సెలవులొస్తున్నయ్. భగభగ మండే ఎండల్లో చల్లని విహారం ఓ మధురానుభూతి. సాయంత్రం వేళ నీటి అలలపై తేలిపోతూ బోటింగ్ చేస్తుంటే ఉండే ఆనందమే వేరు. సమ్మర్ ట్రావెలర్స్ కోసం తెలంగాణ టూరిజం వారసత్వ కట్టడాలు, వైల్డ్ లైఫ్ శాంక్చురీలకు దగ్గర్లో బోటింగ్ ఎక్స్ పీరియన్స్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఎండల్లో మీరూ చల్లని విహారానికి సిద్ధంకండి.
హుస్సేన్ సాగర్ : హైదరాబాద్ నగరంలోని అతి పెద్ద చెరువులలో ఇది ఒకటి . నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ లో బోటింగ్ షికారు కోసం పర్యాటకులు రోజూ క్యూ కడతారు. చుట్టూ ఉండే పార్కులు చూసిన తర్వాత హుస్సేన్ సాగర్ లో విహరించాలని కోరుకుంటారు.
పర్యాటక శాఖ ఎనిమిది రకాల బోట్లను వినియోగిస్తుంది. ఇక్కడ వంద మందిని ఒకేసారి తీసుకుపోయే పెద్ద నౌక నుంచి ఒక్కరినే తీసుకుపోయే జెట్ స్కై వరకు అన్ని ఉన్నాయి. వీటిలో హెచ్ డీపీ ఈ స్పీడ్ బోట్ (నలుగురు), స్పీడ్ బోట్ (ఏడుగురు) , పారా సెయిల్ బోట్ (ఏడుగురు) , మెకనైజ్డ్ బోట్ (55 మంది) ఉన్నాయి.
వేసవిలో ప్రతీ రోజూ వేల సంఖ్యలో వచ్చే పర్యాటకుల కోసం మొత్తం 23 పడవలు ఉన్నాయి. హుస్సేన్ సాగర్ జలవిహారం ప్రత్యేకమైనది. ఇక్కడ జరిగే వాటర్ స్పోర్ట్స్ కూడా ఈ విహారంలో వీక్షించవచ్చు. హుస్సేన్ సాగర్ మధ్యలో ఉండే ఎత్తైన గౌతమ బుద్ధున్ని దర్శించవచ్చు
లక్నవరం చెరువు : లక్నవరం చెరుపు గుర్తొస్తే తీగల వంతెనే గుర్తుకొస్తుంది. ఈ చెరువులో పర్యాటకుల విడిది కోసం చెక్కతో చిన్న కుటీరాలు నిర్మించారు. పర్యాటకుల కోసం ...పర్యాటక శాఖ బోటింగ్ నిర్వహిస్తోంది. హైదరాబాద్ నగరం నుంచి వరంగల్ మీదుగా (210కిలోమీటరు)లక్నవరం చేరుకోవచ్చు. వరంగల్ పట్టణానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.
దుర్గం చెరువు : ఈ చెరువుని 'సీక్రెట్ లేక్ ' అని కూడా పిలుస్తారు. చుట్టూ ఉండే అడవి దీనిని దూరంగా ఉన్న వాళ్లకు కనిపించకుండా ఉంచేది. అందుకే దీనికా పేరొచ్చింది. బండలు, కొండల మధ్య ఉండే ఈ పార్కు విహారానికి అనుకూలమైనది. హైటెక్ సిటీ సమీపంలో ఉంది.
బోటింగ్ కోసం వచ్చే వారికి మెకనైజ్డ్, వాటర్ స్కూటర్, పెరల్ బోటు ఉన్నాయి. స్పీడ్ గా నీటిపై ప్రయాణం చేసే మెకనైజ్డ్ బోట్ నుంచి పుట్టి (వెదురుతో చేసిన చిన్న నాటు పడవ) వరకు అన్ని ఉన్నాయి. సాహస యాత్రలు చేసేవాళ్ల కోసం ట్రెక్కింగ్, ర్యాపెల్లింగ్ యాక్టివిటీలను పర్యాటక శాఖ నిర్వహిస్తోంది
మీరాలం ట్యాంక్ : ఇది రెండు వందల ఏళ్ల నాటి చెరువు సినిమా. షూటింగ్ లకు పేరుగాంచినది. పర్యాటకులతో రోజూ కళకళలాడుతుంది. నెహ్రూ జూలాజికల్ పార్క్ పక్కనే మీరాలం చెరువు ఉంది. జూపార్క్ చూసిన తర్వాత మీరాలం చెరువులో బోటింగ్ చేయొచ్చు.
చెరువు పక్కనే ఉన్న జూ పార్క్ నుంచి బోటింగ్ ఎంట్రీ ఉంటుంది. తెలంగాణ టూరిజం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య ఇక్కడ బోటింగ్ నిర్వహిస్తోంది. సీబీఎస్ ( బస్టాండ్)కు అయిదు కిలోమీటర్ల దూరంలో ఉంది. బస్ లో 30 నిమిషాల్లో ఇక్కడికి చేరుకోవచ్చు. నాంపల్లి రైల్వే స్టేషన్ కు 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. బస్ లో30 నిమిషాల ప్రయాణం చేసి మీరాలం ట్యాంకు చేరుకోవచ్చు.
నిజాం సాగర్ : గోదావరికి ఉపనది మంజీరాపై దీనిని నిర్మించారు. అచ్చంపేట, బంజపల్లే గ్రామాల మధ్య ఈ ప్రాజెక్ట్ ఉంది. ప్రశాంతంగా ఉండే నిజాం సాగర్ పరిసరాలు చూడదగినవి. వర్షాకాలం, శీతాకాలంలో ఇక్కడ బోటింగ్ చేసేందుకు బాగా వస్తారు. నిండుగా ఉన్న జలాశయంలో నీటి ముంపు ఎక్కువగా ఉంటుంది. బోటింగ్ ఎక్కువ దూరం ఉంటుంది. దీనికి సమీపంలో పోచారం రిజర్వాయర్, సింగూరు రిజర్వాయర్ ఉన్నాయి.
నాగార్జున సాగర్ : సువిశాలమైన నీటిపై బోటింగ్ చేయాలంటే నాగార్జున సాగర్‌కు పోవాల్సిందే. ఉల్లాసం కలిగించే పరిసరాల్లో ఉత్సాహవంతంగా సాగే పర్యటన ఇది. నాగార్జున సాగర్ మధ్యలో ఉన్న నాగార్జున కొండకు బోట్ పై తీసుకుపోతారు. నాగార్జున కొండపై ఉన్న ప్రాచీన బౌద్ధ నిర్మాణాలను చూసి మళ్లీ బోట్ లో విహరిస్తూ తిరిగి వస్తారు. నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ విహారంలో పలు ప్రకృతి అందాలు వన్యప్రాణి విహారాలను చూసి తరించవచ్చు. నల్లమల అడవుల మధ్య సాగే కృష్ణా ప్రవాహంలోని ప్రయాణం ఓ మధురానుభూతి.