వినకుంటే సస్పెన్షన్​ : వాటర్ బోర్డుపై విజిలెన్స్

వినకుంటే సస్పెన్షన్​ : వాటర్ బోర్డుపై విజిలెన్స్

హైదరాబాద్, వెలుగురెండు నెలల క్రితం జలమండలి బోర్డుకు కన్నం పెట్టారనీ డీజీఎం స్థాయి అధికారిని సస్పెండ్​ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించారనీ మరో మేనేజర్ పై వేటు వేశారు. ఇలా మహానగరానికి తాగునీళ్లందించే వాటర్ బోర్డు పాలనను గాడిలో పెట్టేందుకు ఎండీ దానకిశోర్​దూకుడుగా వ్యవహరిస్తున్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది అవినీతితో బోర్డు మొత్తానికి చెడ్డపేరు వస్తుండడంతో కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అవినీతి ఆరోపణలు రావడమే ఆలస్యం.. వెంటనే ‘విజిలెన్స్’ను ప్రయోగిస్తున్నారు. జలమండలిని గాడిలో పెట్టేందుకు ఎండీ తీసుకుంటున్న చర్యలతో క్షేత్రస్థాయి సిబ్బందిలో గుబులు మొదలైంది.

ఎండీకి నేరుగా ఫిర్యాదులు

జలమండలిలో మొత్తం 19 ఓఅండ్ఎం డివిజన్లున్నాయి.  ప్రతి డివిజన్ లో కనీసం మూడు నుంచి ఏడు సెక్షన్లున్నాయి. సెక్షన్ స్థాయిలో మేనేజర్లు  పనిచేస్తుండగా, ఆపైన డీజీఎం, జీఎం, సీజీఎం స్థాయి అధికారులు విధులు నిర్వర్తిస్తున్నారు. క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండే మేనేజర్లు, డీజీఎం లెవల్​అధికారుల నిర్లక్ష్యంతో తాగునీటి సరఫరా, నూతన నల్లా లైన్లు, సీవరేజీ సమస్యలను నగరవాసులు ఎదుర్కొంటున్నారు. వీటిని తక్షణమే పరిష్కారించేందుకు తగిన యంత్రాంగం ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. దాంతో జలమండలికే చెడ్డపేరు వస్తోంది. తమ సమస్యలను పరిష్కారించాలంటూ నేరుగా ఎండీకే ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ తరహా ఫిర్యాదులు ఎక్కువవుతున్న నేపథ్యంలో అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

ఆరోపణలు వస్తే విజిలెన్స్ అస్త్రం

పని విషయంలో అధికారులకు, సిబ్బందికి ఎండీ స్వేచ్ఛనిచ్చారనే జలమండలిలో టాక్​ఉంది. ఆ అతి స్వేచ్ఛనే ఇప్పుడు అలసత్వంగా మారడానికి కారణమైందనీ తెలుస్తోంది. అందుకే అక్రమాలకు పాల్పడుతూ, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. సిబ్బంది ఆరాచకాలు మితిమీరడంతో ఎండీ దానకిశోర్​ చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం. ఓ సెక్షన్ లో నల్లా కనెక్షన్లలో అవినీతికి పాల్పడ్డారనీ ఆరోపణలు వచ్చిన వెంటనే శాఖాపరమైన చర్యలకు ఆదేశించారనీ తెలిసింది. దీనికితోడు రహస్య నివేదిక ఇవ్వాలని విజిలెన్స్ విభాగానికి సూచించగా, బోర్డులో అక్రమాలకు పాల్పడుతున్న జాబితానే సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. దాని ఆదారంగా అధికారులపై చర్యలు తీసుకుంటారని ఓ ఉన్నతాధికారి అభిప్రాయం వ్యక్తం చేశారు.

తొలిసారి మందలింపు, వినకుంటే సస్పెన్షన్​

సెక్షన్ పరిధిలో సిబ్బందికి పూర్తి పట్టు ఉంటుంది. ఇటీవల సంస్థ ఆదాయానికి గండికొడుతున్న అక్రమ నల్లా కనెక్షన్లపై విజిలెన్స్ శాఖ వరుస తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో సిబ్బంది చేతివాటం ఉన్నట్టు తేలింది. దాంతో సెక్షన్లవారీగా జాబితాను సిద్ధం చేసిన ఆ విభాగం నివేదిక ఆధారంగా తొలుత మందలింపులు, వినకపోతే సస్పెండ్ చేస్తూ కట్టడి చేస్తున్నారు. గతంలో రెండు నెలల క్రితమే 15వ డివిజన్ లో డీజీఎంగా పనిచేస్తున్న ఓ అధికారిపై అవినీతి ఆరోపణలు రాగానే శాఖాపరమైన చర్యలకు ఎండీ ఆదేశించారు. వెంటనే క్షేత్రస్థాయిలో ఉండే నిజానిజాలను విజిలెన్స్ నిగ్గు తేల్చింది. దాంతో ఆ అధికారిని సస్పెండ్ చేస్తూ ఎండీ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఓ అండ్ ఎమ్ డివిజ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ -3, గోల్కొండ సెక్షన్ మేనేజ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రించారన్న ఫిర్యాదును సీరియస్ గా తీసుకున్నారు. మేనేజ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్ స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌య్యద్ సాజిద్ ను స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అయితే అధికారులపై ఎండీ తీరు కంటి తుడుపు చర్యగా ఉండకుండా కఠినంగా వ్యవహారిస్తేనే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.