ప్రధానిపై అసభ్యంగా మాట్లాడినందుకు సుమొటోగా కేసు పెట్టాలి 

ప్రధానిపై అసభ్యంగా మాట్లాడినందుకు సుమొటోగా కేసు పెట్టాలి 
  • రాజ్యాంగంపై విశ్వాసంలేని వ్యక్తి సీఎం కుర్చీలో ఉండొద్దు
  • ఆర్టికల్ 3 లేకుంటే తెలంగాణ ఎలా వచ్చింది? 
  • కేసీఆర్ వ్యాఖ్యలపై కమ్యునిస్టులు స్పందించాలి
  • దేశ వ్యాప్తంగా యువత నిరసనలు తెలపాలి
  • దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు


సిద్దిపేట: అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని సీఎం కేసిఆర్ అవహేళన చేస్తూ మాట్లాడడడం తగదని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. రాజ్యాంగం పట్ల విశ్వాసం లేని వ్యక్తి ఒక్క నిముషం కూడా సీఎం కుర్చీలో కూర్చోవద్దన్నారు. దుబ్బాకలో సిఎం కేసీఆర్ దిష్టి బొమ్మను బీజేపీ నాయకులు దగ్ధం చేశారు. సిద్దిపేట పట్టణంలోని శివాను భవ మండపంలో ప్రధాని మోడీ వర్చువల్ ప్రసంగాన్ని బీజేపీ నాయకులతో కలసి వీక్షించారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు.
70వేల పుస్తకాలు చదివిన వ్యక్తికి ఏం మాట్లాడాలో కూడా తెలవడం లేదని ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ భాష సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. ప్రధానిపై కేసీఆర్ మాట్లాడిన భాష అభ్యంతరకరమని..  దేశ యువత కేసీఆర్ వ్యాఖ్య ల పై నిరసన తెలపాలని కోరారు. 
కొత్త రాజ్యాంగాన్ని రాయాలన్న కేసీఆర్ వ్యాఖ్య లపై కమ్యునిస్ట్ నాయకులు స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. 
రాజ్యాంగంలో ఆర్టికల్ 3లేకుంటే తెలంగాణ రాష్ట్రం ఎలా వచ్చిందని ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. కేసీఆర్ కు  ప్రధాని కావాలనే కోరిక ఉంటే ప్రజలను ఒప్పించుకోవాలి కానీ బూతు పురాణం ద్వారా కాదని హితవు పలికారు. కేసీఆర్ కి ప్రజలపై, వ్యవస్థలపై దేనిపై కూడా విశ్వాసం లేదన్నారు. డీజీపీ మహేందర్ రెడ్డి సీఎం కేసీఆర్ పై దేశ ద్రోహం కేసు పెట్టాలని ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు.  ప్రధానిపై అసభ్యంగా మాట్లాడిన వ్యక్తిపై  సుమొటోగా కేసు నమోదు చేయాలన్నారు. కేంద్రం ఎన్ ఆర్ ఈ జి ఎస్ నిధులను జిల్లాకు 53కోట్లు మంజూరు చేస్తే అన్ని నియోజక వర్గాలకు సమానంగా ఎందుకు పంచలేదని ఆయన నిలదీశారు. మోడీ గుజరాత్ కి మాత్రమే ప్రధాని అయితే తెలంగాణ  ట్రైబల్ యూనివర్సిటీకి 44కోట్లు ఎలా వచ్చాయి ? అని ఆయన నిలదీశారు. కేసీఆర్ వెంటనే రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ కి క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు.