- ఉక్కపోతతో లైబ్రరీలు, పార్కుల్లో అభ్యర్థులు చదవలేని పరిస్థితి
- నెల రోజులుగా స్టూడెంట్స్ తో నిండిపోతున్న ఏసీ రీడింగ్ హాల్స్
హైదరాబాద్, వెలుగు : ఎండల తీవ్రత పోటీ పరీక్షలకు ప్రిపేర్ అభ్యర్థులపై కూడా పడుతోంది. సిటీలో లైబ్రరీలు, పార్కులు, రూమ్ ల్లో ఉంటూ చదివేవారు ఎండలను తట్టుకోలేక ఏసీ స్టడీ హాళ్లకు వెళ్తున్నారు. సిటీలో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరుకోవడం, ఉదయం 10 దాటిందంటే వడ గాడ్పులు, ఉక్కపోత ఎక్కువవుతుంది. దీంతో ఏకాగ్రతతో చదవలేకపోతుండగా..
టైమ్ వేస్ట్ అవుతుందని చాలామంది ఏసీ స్టడీ సెంటర్లకు వెళ్లి చదువుకునేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. దీంతో లైబ్రరీలు, పార్కుల్లో ప్రిపేరయ్యే స్టూడెంట్స్సంఖ్య తగ్గుతోంది. మరోవైపు నెలరోజులుగా ఏసీ స్టడీ హాళ్లకు రద్దీ పెరిగింది. ప్రస్తుతం సిటీలోని దిల్సుఖ్నగర్, అశోక్ నగర్పరిసర ప్రాంతాల్లోని ఏసీ స్టడీ హాల్స్ అభ్యర్థులతో కిక్కిరిసిపోతున్నాయి.
బయట చదవలేని పరిస్థితి..
కాంపిటేటివ్ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యేవారిలో ఎక్కువ మంది ఓయూ లాండ్ స్కేప్గార్డెన్, చిక్కడపల్లి లైబ్రరీ, అఫ్జల్గంజ్లైబ్రరీ, సిటీలోని వివిధ పార్కులకు వెళ్తుంటారు. ఉదయం వెళ్లి సాయంత్రం వస్తుంటారు. ప్రస్తుతం ఎండల తీవ్రత పెరగడంతో పది గంటలకే చెమట, ఉక్కపోత పెరిగిపోతుంది. దీంతో పార్కుల్లో చెట్ల కింద చదివేవారు వడదెబ్బ బారిన పడుతున్నారు. రూమ్ టెంపరేచర్లు కూడా 38, 40 డిగ్రీలు ఉంటుండ టంతో చదవలేని పరిస్థితి ఉంది. దీంతో చేసేదేమి లేక ఏసీ స్టడీ సెంటర్లకు వెళ్తున్నారు.
సిటీలో 100 కు పైగా ఏసీ స్టడీ సెంటర్లు
జాబ్ నోటిఫికేషన్లు రిలీజ్కావడం, త్వరలో గ్రూప్ 1,2,3 ఎగ్జామ్స్ ఉండటంతో స్టడీ హాళ్లకు వెళ్లేవారి సంఖ్య పెరిగింది. ప్రస్తుతం ఎండల కూడా మండుతుండటంతో ఏసీ స్టడీ సెంటర్లకు డిమాండ్ పెరిగింది. సిటీలో అశోక్‌నగర్, దోమలగూడ, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, దిల్ సుఖ్ నగర్, చైతన్యపురి, కొత్తపేట్, అమీర్‌పేట్, ఎస్ఆర్నగర్, వెంగళ్రావు నగర్, షేక్‌పేట్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో 100కు పైగా ఏసీ స్టడీ సెంటర్లు ఉన్నాయి.
స్టడీ సెంటర్లను బట్టి నెలకు 1800 – 2500 దాకా ఫీజులు వసూలు చేస్తున్నారు. గతంలో ఫీజులు 1500 మాత్రమే ఉండేదని ప్రస్తుతం డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని నిర్వాహకులు 2500 దాకా వసూలు చేస్తున్నారని చెబుతున్నారు.
నిర్వాహకులు మాత్రం సమ్మర్లో ఏసీ వాడకం ఎక్కువగా ఉంటుందని, ఖర్చులు పెరగడంతోనే ఫీజులు పెంచామని చెబుతున్నారు. రేట్లు మొదటి నుంచి ఒకేలా ఉన్నాయని, సమ్మర్‌ను దృష్టిలో పెట్టుకొని ఏమీ పెంచలేదని ఇంకొందరు నిర్వాహకులు తెలిపారు.
ఎండలతో చదవలేకపోతుండగా..
గ్రూప్– 2కు ప్రిపేర్అవుతున్నా. ఇంతకుముందు చిక్కడపల్లి లైబ్రరీకి వెళ్లి ప్రిపేర్అయ్యేవాడిని. ఎండలతో చదవలేకపోతున్నా. చెమట, ఉక్కపోత కారణంగా చదివింది కూడా గుర్తుండడంలేదు. టైమ్‌వేస్ట్ అవుతుందని భావించి ఏసీ స్టడీ హాల్ కు వెళ్తున్నా. ఎండలు తగ్గేవరకు అక్కడే ప్రిపేర్ అవ్వాలని డిసైడ్ అయ్యా.
– మహిపాల్, గ్రూప్ –2 యాస్పిరెంట్, చిక్కడపల్లి
స్టడీ హాల్ ఫుల్
నెల రోజుల నుంచే ఎక్కువ మంది స్టూడెంట్స్వస్తున్నారు. మా స్టడీ హాల్ లో 160 మందికి సీటింగ్కెపాసిటీ ఉంది. ప్రస్తుతం ఫుల్ అయ్యింది. ఫీజు కూడా తక్కువగానే తీసుకుంటున్నం. ప్రస్తుతం రోజుకు పది మంది స్టూడెంట్స్ కాల్ చేస్తున్నారు. ఖాళీ లేదని చెప్తున్నా. మరో రెండు నెలలు పరిస్థితి ఇలాగే ఉండొచ్చు.
– శివప్రసాద్ గుప్తా, తారా స్టడీ స్పేస్, అశోక్‌నగర్