హైదరాబాద్: దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో మూడో రోజు తెలంగాణకు భారీగా పెట్టుబడులు వచ్చాయి. సన్ పెట్రో కెమికల్స్ సంస్థ తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. తెలంగాణలో రూ.45,000 కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు ఆ సంస్థ అంగీకరించింది. ఈ మేరకు దావోస్లో తెలంగాణ ప్రభుత్వంతో సన్ పెట్రో కెమికల్ సంస్థ ఎంవోయూ చేసుకుంది. రాష్ట్రంలో భారీ పంప్డ్ స్టోరేజ్ జల విద్యుత్తు, సౌర విద్యుత్ ప్రాజెక్టులను ఈ సంస్థ ఏర్పాటు చేయనుంది.
ఈ ఒప్పందంతో దాదాపు రాష్ట్రంలోని 7,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. తెలంగాణలోని నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టులు నెలకొల్పనుంది సన్ పెట్రో కెమికల్స్ సంస్థ. ఇప్పటివరకు దావోస్ వేదికగా తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న భారీ ఒప్పందం ఇదే కావడం గమనార్హం. రాష్ట్రానికి భారీ పెట్టుబడి రావడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, తెలంగాణ అధికారుల బృందం సంతోషం వ్యక్తం చేసింది.
Also Read :- ఆర్టీసీ డిపోల ప్రైవేటీకరణ అవాస్తవం.. TGSRTC క్లారిటీ
స్విట్జర్లాండ్ లోని దావోస్లో జరుగుతోన్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ బృందం వెళ్లిన విషయం తెలసిందే. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ టీమ్ వివిధ కంపెనీల ప్రతినిధులతో భేటీ అవుతున్నారు. తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వం కల్పించే రాయితీల గురించి కంపెనీలకు వివరిస్తున్నారు. ఇప్పటికే యూనీ లివర్, స్కైరూట్, కంట్రోల్ ఎస్ డేటా సెంటర్స్ లిమిటెడ్ సంస్థ వంటి సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. తాజాగా సన్ పెట్రో కమికల్స్ సంస్థ కూడా భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది.