45 వేల కోట్లతో రాష్ట్రంలో సన్ పెట్రో కెమికల్స్ భారీ పెట్టుబడి

45 వేల కోట్లతో  రాష్ట్రంలో సన్ పెట్రో కెమికల్స్ భారీ పెట్టుబడి
  • దావోస్ వేదికగా ప్రభుత్వంతో ఒప్పందం
  • పంప్డ్ స్టోరేజీ హైడ్రో పవర్, సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు
  • నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో 
  • 3,400 మెగావాట్లతో హైడ్రో పవర్ ప్రాజెక్టులు 
  • మరో 5,440 మెగావాట్లతో సోలార్ పవర్ ప్లాంట్లు
  • 7 వేల మందికి ఉపాధి అవకాశాలు
  • దావోస్​లో ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద ఒప్పందం  
  • గ్రీన్ ఎనర్జీలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతం : సీఎం రేవంత్

హైదరాబాద్, వెలుగు : దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో రాష్ట్ర  ప్రభుత్వం మరో భారీ పెట్టుబడి సాధించింది. ఇంధన రంగంలో పేరొందిన సన్ పెట్రో కెమికల్స్ సంస్థ రాష్ట్రంలో రూ.45,500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. పంప్డ్ స్టోరేజీ హైడ్రో పవర్, సోలార్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు సీఎం రేవంత్​ సమక్షంలో ఒప్పందం చేసుకుంది. ఇప్పటి వరకు దావోస్ వేదికగా ప్రభుత్వం చేసుకున్న భారీ ఒప్పందం ఇదే.నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో పంప్డ్ స్టోరేజీ హైడ్రో పవర్ ప్రాజెక్టులను నెలకొల్పనున్నట్టు సంస్థ ప్రకటించింది. 

ఈ మూడు ప్రాజెక్టుల మొత్తం సామర్థ్యం 3,400 మెగావాట్లు అని తెలిపింది. వీటికి 5,440 మెగావాట్ల సామర్థ్యం ఉండే సోలార్ పవర్ ప్లాంట్లను అనుసంధానం చేస్తామని చెప్పింది. వీటి ద్వారా దాదాపు 7 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొంది. దావోస్ లో సన్ పెట్రోకెమికల్స్ ఎండీ దిలీప్ సంఘ్వితో సీఎం ఎ.రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, ఇన్వెస్ట్ మెంట్స్ ప్రమోషన్ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. 

రికార్డు బ్రేక్ చేశాం : సీఎం రేవంత్ 

గ్రీన్ ఎనర్జీ లక్ష్య సాధనలో ఈ ఒప్పందం మైలురాయిగా నిలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన సన్ పెట్రోకెమికల్స్ ప్రతినిధులను ఆయన అభినందించారు. ఈ భారీ ఒప్పందంతో పోయినేడాది దావోస్ లో సాధించిన రూ.40 వేల కోట్ల పెట్టుబడి రికార్డును బ్రేక్ చేశామని పేర్కొన్నారు. ‘‘భవిష్యత్తు ఇంధన అవసరాల దృష్ట్యా క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీకి మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తున్నది. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో తెలంగాణను దేశంలో అగ్రగామిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాం. 

సన్ పెట్రోకెమికల్స్ భాగస్వామ్యంతో భవిష్యత్తులో డిమాండ్ కు అనుగుణంగా కరెంట్ సమకూరుతుందని ఆశిస్తున్నాం. ఈ ఒప్పందంతో రాష్ట్రంలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయి. నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు జిల్లాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతాయి” అని చెప్పారు. .

తమ ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించాయని, రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఇంత భారీ పెట్టుబడి సాధించినందుకు ఆనందంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. తాము చేపట్టబోయే ప్రాజెక్టు గ్రీన్ ఎనర్జీ రంగంలో అందరి దృష్టిని ఆకర్షిస్తుందని సన్ పెట్రోకెమికల్స్ ఎండీ దిలీప్ సంఘ్వి అన్నారు.