KKR రుచి చూపించిన ఈ ఘోర ఓటమితో SRHకి ప్లే ఆఫ్స్ ఆశలు లేనట్లేనా..?

KKR రుచి చూపించిన ఈ ఘోర ఓటమితో SRHకి ప్లే ఆఫ్స్ ఆశలు లేనట్లేనా..?
  • సన్‌‌ మళ్లీ ఢమాల్ హైదరాబాద్‌‌కు హ్యాట్రిక్‌‌ పరాజయాలు
  • 80 రన్స్‌‌ తేడాతో కోల్‌‌కతా భారీ విజయం
  • వెంకటేశ్‌‌, రఘువంశీ బ్యాటింగ్‌‌ షో
  • సమష్టిగా ఫెయిలైన సన్‌‌రైజర్స్‌‌ 


కోల్‌‌కతా: బ్యాటింగ్‌‌, బౌలింగ్‌‌లో సమష్టిగా ఫెయిలైన సన్‌‌రైజర్స్‌‌ హైదరాబాద్‌‌.. ఐపీఎల్‌‌–18లో హ్యాట్రిక్‌‌ పరాజయాలను నమోదు చేసింది.  డిఫెండింగ్‌‌ చాంపియన్‌‌ కోల్‌‌కతా నైట్‌‌రైడర్స్‌‌తో గురువారం జరిగిన ప్రతీకార పోరులో 80 రన్స్‌‌ తేడాతో ఓటమిపాలైంది. టాస్‌‌ ఓడిన కోల్‌‌కతా 20 ఓవర్లలో 200/6  స్కోరు చేసింది. వెంకటేశ్‌‌ అయ్యర్‌‌ (29 బాల్స్‌‌లో 7 ఫోర్లు, 3 సిక్స్‌‌లతో 60), రఘువంశీ (32 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 2 సిక్స్‌‌లతో 50), రహానే (30), రింకూ సింగ్‌‌ (32 నాటౌట్‌‌) దంచికొట్టారు. తర్వాత హైదరాబాద్‌‌ 16.4 ఓవర్లలో 120 రన్స్‌‌కే ఆలౌటైంది. క్లాసెన్‌‌ (33), కమింద్‌‌ మెండిస్‌‌ (27) పోరాడినా ప్రయోజనం దక్కలేదు. వైభవ్‌‌ అరోరా (3/29), వరుణ్‌‌ చక్రవర్తి 3/22) ఎస్‌‌ఆర్‌‌హెచ్‌‌ ఇన్నింగ్స్‌‌ను శాసించారు. వైభవ్​కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. 

తడబడ్డా.. దంచారు..

ఫ్లాట్‌‌ వికెట్‌‌పై ఆరంభంలో తడబడ్డ కోల్‌‌కతా బ్యాటర్లు చివర్లో దంచికొట్టారు. ఎస్‌‌ఆర్‌‌హెచ్‌‌ పేసర్లు కమిన్స్‌‌ (1/44), షమీ (1/29).. మూడు ఓవర్లలోనే హిట్టర్లు డికాక్‌‌ (1), సునీల్‌‌ నరైన్‌‌ (7)ను ఔట్‌‌ చేయడంతో కేకేఆర్‌‌ 16/2తో కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్‌‌ రహానే, రఘువంశీ  సిక్స్‌‌లు, ఫోర్లతో ఇన్నింగ్స్‌‌ను ఆదుకున్నారు. దీంతో పవర్‌‌ప్లేలో 53/2 స్కోరు చేసింది. 

ఫీల్డింగ్‌‌ విస్తరించిన తర్వాత కూడా ఈ ఇద్దరు స్ట్రయిక్‌‌ రొటేట్‌‌ చేస్తూ బౌండ్రీలు రాబట్టారు. తర్వాతి నాలుగు ఓవర్లలో 31 రన్స్‌‌ రావడంతో ఫస్ట్‌‌ టెన్‌‌లో కోల్‌‌కతా 84/2కి పెరిగింది. జీషాన్‌‌ (1/25) వేసిన 11వ ఓవర్‌‌లో రఘువంశీ 6, 4  బాదినా లాస్ట్‌‌ బాల్‌‌కు రహానేను పెవిలియన్‌‌కు పంపడంతో మూడో వికెట్‌‌కు 81 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. 12వ ఓవర్‌‌లో రఘువంశీ ఇచ్చిన క్యాచ్‌‌ను నితీశ్‌‌ రెడ్డి జారవిడిచినా.. 13వ ఓవర్‌‌లో మెండిస్‌‌ అద్భుతమైన ఆఫ్‌‌ స్పిన్‌‌ బాల్‌‌తో ఔట్‌‌ చేశాడు. 

రఘువంశీ 30 బాల్స్‌‌లో హాఫ్‌‌ సెంచరీ చేసి వెనుదిరగడంతో స్కోరు బోర్డు106/4గా మారింది. ఈ దశలో వెంకటేశ్‌‌ అయ్యర్‌‌, రింకూ సింగ్‌‌ ఒక్కో రన్‌‌తో ముందుకెళ్లారు. 15వ ఓవర్‌‌లో అయ్యర్‌‌ సిక్స్‌‌ కొట్టడంతో స్కోరు 122/4గా మారింది. 16వ ఓవర్‌‌లో రింకూ, వెంకటేశ్‌‌ చెరో ఫోర్‌‌తో హిట్టింగ్‌‌ షురూ చేశారు. 17వ ఓవర్‌‌లో రింకూ హ్యాట్రిక్‌‌ ఫోర్లు బాదాడు. 18వ ఓవర్‌‌లో వెంకటేశ్‌‌ 2 ఫోర్లు, రింకూ సిక్స్‌‌తో 17 రన్స్‌‌ వచ్చాయి. 19వ ఓవర్‌‌లో వెంకటేశ్​ 4, 6, 4, 4తో 21 రన్స్‌‌ దంచాడు. ఈ క్రమంలో 25 బాల్స్‌‌లోనే ఫిఫ్టీ కొట్టాడు. ఆఖరి ఓవర్‌‌లో వెంకటేశ్‌‌ 6, 4 కొట్టి ఔట్‌‌కావడంతో ఐదో వికెట్‌‌కు 91రన్స్‌‌ ముగిశాయి. ఆఖరి బాల్‌‌కు రసెల్‌‌ (1) వెనుదిరిగాడు. చివరి ఐదు ఓవర్లలో 78 రన్స్‌‌ వచ్చాయి. 

పెవిలియన్‌‌కు క్యూ..

భారీ ఛేజింగ్‌‌లో హైదరాబాద్‌‌ బ్యాటర్లు పెవిలియన్‌‌కు క్యూ కట్టారు. వైభవ్‌‌ అరోరా, హర్షిత్‌‌ రాణా (1/15) దెబ్బకు13 బాల్స్‌‌ తేడాలో ట్రావిస్‌‌ హెడ్‌‌ (4), అభిషేక్‌‌ శర్మ (2), ఇషాన్‌‌ కిషన్‌‌ (2) ఔటయ్యారు. దీంతో హైదరాబాద్‌‌ 9 రన్స్‌‌కే మూడు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో నితీశ్‌‌ కుమార్‌‌ (19), కమింద్‌‌ మెండిస్‌‌ ఆదుకునే బాధ్యత తీసుకున్నా నైట్‌‌రైడర్స్‌‌ బౌలర్ల  ముందు నిలవలేకపోయారు. 

పవర్‌‌ప్లేలో 33/3కే పరిమితమైన రైజర్స్‌‌ ఏ దశలోనూ వికెట్లను కాపాడుకోలేకపోయింది. 7, 10, 11వ ఓవర్లలో వరుసగా నితీశ్‌‌, మెండిస్‌‌, అనికేత్‌‌ (6)  ఔట్‌‌కావడంతో స్కోరు 75/6గా మారింది. ఓ ఎండ్‌‌లో ధనాధన్‌‌ షాట్లతో ఆశలు రేకెత్తించిన క్లాసెన్‌‌ను 15వ ఓవర్‌‌లో అరోరా పెవిలియన్‌‌కు పంపడంతో హైదరాబాద్‌‌ వెనకబడిపోయింది. 16వ ఓవర్‌‌లో వరుణ్‌‌ చక్రవర్తి తొలి రెండు బాల్స్‌‌కు కమిన్స్‌‌ (14), సిమర్‌‌జిత్‌‌ సింగ్‌‌ (0)ను ఔట్‌‌ చేస్తే, 17వ ఓవర్‌‌లో హర్షల్‌‌ పటేల్‌‌ (3)ను రసెల్‌‌ (2/21) కాటన్‌‌ బౌల్డ్‌‌ చేయడంతో ఎస్‌‌ఆర్‌‌హెచ్‌‌ 120 రన్స్‌‌కే పరిమితమైంది. 

సంక్షిప్త స్కోర్లు

కోల్‌‌కతా: 20 ఓవర్లలో  200/6 (వెంకటేశ్‌‌ 60, రఘువంశీ 50, మెండిస్‌‌ 1/4). 
హైదరాబాద్‌‌: 16.4 ఓవర్లలో 120 ఆలౌట్‌‌ (క్లాసెన్‌‌ 33, మెండిస్‌‌ 27, వైభవ్‌‌ 3/29, వరుణ్‌‌ 3/22).