
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో శ్రీరామనవమి.. రామయ్య కళ్యాణం .. ఆదివారం రావడం విశేషం. రామయ్యకు ఆదివారం అంటే ఎంతో ప్రీతికరమైనది. దీంతో ఆ రోజున స్వామివారి కల్యాణాన్ని కనులారా తిలకిస్తే అంతా శుభమే జరుగుతుందని భక్తుల విశ్వాసం, శ్రీ రామచంద్ర మూర్తి సూర్యవంశంలో జన్మించారు.
మానవుడు వైవశ్వత మనువు సంతానం కాబట్టి మనమంతా మనుషులం. సూర్యుని కుమారుడు మనువు. మానవజాతికి ఆది పురుషుడని కూడా అంటారు. ఆది అనగా సూర్యుడు. అందుకే ఆదివంశం విశుద్దుడు అని పేరు. ఆదివారం అనగా రామచంద్రునికి సంబంధించిన వారం. ఈ ఏడాది (2025) ఆదివారం శ్రీరామ నమవి.. రామ కల్యాణం కావడం ఎంతో విశేషమని పండితులు చెబుతున్నారు.
పురాణాల్లో సూర్యుడిని నవగ్రహాలకు రాజుగా అభివర్ణించారు. సూర్యుడు, ఇతర గ్రహాలు మేరు పర్వతం చుట్టూ ప్రదక్షిణం చేస్తాయి. మేరువు కుమారుడు భద్రుడు. ఆ భద్రమహర్షి వెలసిన క్షేత్రమే భద్రాద్రి. ఏ విధంగా మేరు చుట్టూ గ్రహాలు తిరుగుతుంటాయో అలాగే మేరుపుత్రుడైన భద్రుని కొండ చుట్టూ సకల దేవతల అనుగ్రహాలు తిరుగుతుంటాయి. అలా గ్రహాలన్నింటికీ ప్రభువైన సూర్యుని వారం నాడే సకల దేవతలకు ప్రభువు అయిన రాముని కల్యాణం జరగడం విశేషం. ఆదివారం కల్యాణం వీక్షించడం వల్ల పదవీలాభం, ఐశ్వర్యం ప్రాప్తిస్తాయని పెద్దలు చెబుతుంటారు.
భద్రాద్రి విశిష్టత మరెక్కడా కానరాదు
రెండు చేతుల్లో లీలా పద్మాలు ఉంటే ఆ మూర్తిని లక్ష్మీదేవి అంటారు. ఆ రకంగా భద్రాచలంలో స్వయంభూగా వెలసిన రాముడు పద్మాసనంలో భక్తులకు దర్శనమిస్తే ఎడమ వామాంకము (తొడ) పై సీతమ్మ వారు ఆసీనులు కావడమే కాకుండా రెండు చేతుల్లో పద్మాలు దర్శనమిస్తాయి. ఎడమ చేయిలో పద్మం భక్తులకు దర్శనమిస్తుండగా కుడి చేతిలో పద్మం రామయ్య వీపునకు ఆనించినట్లుగా ఉంటుంది. ఇటువంటి విలక్షణమైన రూపం మనం ఎక్కడా చూడలేం. ఏ ఆలయంలోనైనా స్వామివారిని చూస్తే మధ్యలో స్వామి వారు దర్శనం ఇస్తారు. కానీ భద్రాద్రిలో మధ్యలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తారు. కాగా, రెండు చేతుల్లో పద్మాలుం డీ భద్రాద్రిలో లక్ష్మీ అమ్మవారు సీతామహాలక్ష్మిగా దర్శనమిస్తుంటే ఆమె భర్త రామనారాయణుడిగా దర్శనమిస్తుండడం ఇక్కడ ప్రత్యేకత..
ఆస్థాన పురోహితులు : సుప్రభాత సమయంలో పంచాగ పఠనం చేస్తారు. అభిషేక సమయంలో మంత్రాలు చెప్పడం. భక్త రామదాసు 24 చూర్ణికలతో రచించిన సంక్షిప్త రామాయణాన్ని పఠిస్తారు. భగవద్గీత, క్షేత్ర మహత్మ్యం నిత్య పారాయణం చేస్తారు. ఆలయాల్లో ఏ పూజా కార్యక్రమం ఎప్పుడు నిర్వహించాలో నిర్ణ యించేది ఆస్థాన పురోహితులే. నెలసరి ఉత్సవాల తిధులు నిర్ణయించే వైదిక కమిటీలో వీరు సభ్యులు.
అర్చకులు : స్వామివారికి నిత్య పూజలతోపాటు ఆర్జితసేవలు నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తారు. ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాలు, అధ్యయనోత్సవాల్లో వీరిదే ప్రధాన భూమిక.
స్థానాచార్యుల ప్రాధాన్యత : అన్ని వైదిక విభాగాలకు స్థానాచార్యులు ఆచార్య స్థానంగా, గురుస్థానంగా నిలుస్తారు. ఆలయంలో జరిగే అన్ని ఉత్సవాల్లో మార్పులు, చేర్పుల్లో వారి అంగీకారం కీలకం.
వేదపండితులు : భద్రాచలంలోని అధర్వణ, సామ, రుగ్వేద, యజుర్వేద పండితులు ప్రతీ రోజు వేద పారాయణం చేస్తారు. అలాగే ఆలయంలో అర్చకత్వ బాధ్యతలు నిర్వర్తించే వారి పిల్లలకు మంత్రాలు సుస్వరంగా నేర్పిస్తారు. ప్రతీ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంత పారాయణం చేశారో ఆ భాగాన్ని స్వామి వారికి రాత్రి నిర్వహించే దర్బారు సేవా సమయంలో విన్నవిస్తారు. దానికే అవధారయ అని పేరు. అలాగే ఆలయంలో లోపాలు సరిదిద్దడానికే ఆశీర్వచనం ప్రతి నిత్యం నిర్వహిస్తుంటారు. దీనిద్వారా సకల దోషాలు పోతాయని నమ్మకం. అన్నింటి కంటే ముఖ్యంగా రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్, ముఖ్యమంత్రి లాంటి వీవీఐపీలకు ఆశీర్వచనం చేయాలంటే అర్హత కేవలం వేద పండితులకే ఉంటుంది. విశేషమైన రోజుల్లో వేదపండితులు వేదపారాయణం నిర్వహించడంతో పాటు స్వామివారికి అభిషేకాలు నిర్వహించే సమయంలో పాల్గొని ఆలయ విశిష్టత, ప్రాశస్త్యం భక్తులకు అర్థమయ్యే రీతిలో వివరిస్తారు.