నింగి నుంచి నేలకు.. తొమ్మిది నెలల తర్వాత తిరిగొస్తున్న సునీత

నింగి నుంచి నేలకు.. తొమ్మిది నెలల తర్వాత తిరిగొస్తున్న సునీత
  • మార్చి 19 తెల్లవారుజామున ల్యాండింగ్
  • ఫ్లోరిడాలోని అట్లాంటిక్ సముద్రంలో స్పేస్ ​ఎక్స్ క్యాప్సూల్
  • అక్కడి నుంచి నేరుగా నాసా సెంటర్​కు తరలింపు
  • రిటర్న్ జర్నీ షెడ్యూల్ ప్రకటించిన సైంటిస్టులు
  • ప్రక్రియ మొత్తం లైవ్ టెలికాస్ట్ చేయనున్న నాసా
  • ఇబ్బంది పెట్టనున్న అనారోగ్య సమస్యలు
  • కొన్ని నెలల పాటు డాక్టర్ల పర్యవేక్షణలోనే ఆస్ట్రోనాట్స్​

న్యూఢిల్లీ: భారత సంతతికి చెందిన ఆస్ట్రోనాట్​ సునీతా విలియమ్స్ మరికొన్ని గంటల్లో భూమికి చేరుకోనున్నారు. మంగళవారం ఉదయం అంతరిక్ష నౌక ‘డ్రాగన్’ అన్ డాకింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. సాయంత్రం ‘డ్రాగన్’ భూమికి ప్రయాణం మొదలుపెడుతుంది. 

బుధవారం తెల్లవారుజామున సుమారు 3:27 గంటలకు ఫ్లోరిడా తీరానికి దగ్గరలో ఉన్న అట్లాంటిక్ సముద్ర జలాల్లో ల్యాండ్ అవుతుంది. అందులో నుంచి ఒక్కొక్కరుగా ఆస్ట్రొనాట్లు బయటికి వస్తారని నాసా సోమవారం వెల్లడించింది. ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఉంటే అనుకున్న టైమ్​కు ఆస్ట్రొనాట్లు భూమిపై అడుగుపెడ్తారని వివరించింది. ఈమేరకు ప్రయాణానికి సిద్ధమవుతున్న వారి ఫొటోలను నాసా విడుదల చేసింది.

హ్యాచ్ క్లోజింగ్ నుంచి ల్యాండింగ్ వరకు..

వ్యోమనౌక హ్యాచ్‌‌‌‌ మూసివేత ప్రక్రియ మంగళవారం ఉదయం 8.15 గంటలకు ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత అన్ డాకింగ్ లైవ్ కవరేజీ మొదలవుతుంది. క్రూ9 స్పేస్ క్రాఫ్ట్ ఐఎస్ఎస్ నుంచి సక్సెస్​ఫుల్​గా అన్​డాకింగ్ అయ్యాక మంగళవారం సాయంత్రానికి భూమి వైపు తన జర్నీ ప్రారంభిస్తుంది. మంగళవారం అర్ధరాత్రి దాటాక భూ కక్ష్యలను దాటి కిందికి వస్తుంది. బుధవారం తెల్లవారుజామున ఫ్లోరిడా సముద్ర జలాల్లో క్యాప్సూల్‌‌‌‌ దిగుతుంది. అక్కడి నుంచి ఆస్ట్రొనాట్లను ప్రత్యేక విమానంలో నాసా సెంటర్​కు తీసుకెళ్తారు.

భూమ్మీదికొచ్చాక నడవలేరు

ఎక్కువ రోజులు స్పేస్​లో ఉండటంతో బుచ్ విల్​మోర్ కంటే సునీతా విలియమ్స్ మానసికంగా, శారీరకంగా చాలా ఒత్తిడికి గురయ్యారు. స్పేస్​లో గ్రావిటీ ఉండదు. దీంతో ఆస్ట్రొనాట్లు ఐఎస్ఎస్​లో గాల్లో తేలుతుంటారు. భూమిపైకి వస్తే అలాంటి పరిస్థితి ఉండదు. అందుకే వారికి స్పెషల్ ట్రీట్​మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. 

భూమిపై అడుగుపెట్టాక వాళ్లు నడవలేరు. నెలల పాటు ఎక్సర్​సైజ్​లు చేయాల్సి ఉంటుంది. వారు సొంతంగా నడిచేంత వరకు డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటారు. కండరాల క్షీణత, ఎముకల సాంద్రత తగ్గుతుంది. తల తిరగడం వంటి సమస్యలతో ఇబ్బందిపడొచ్చు. స్పేస్​లో ఉన్నప్పుడు బాడీలోని లిక్విడ్స్ పైకి కదులుతాయి. దీనివల్ల రక్త ప్రసరణలో మార్పులు వస్తాయి. లో బీపీ,  ఎముకల కదలికల్లో నొప్పి ఉండొచ్చు. కంటి చూపుతో పాటు గుండె సంబంధిత సమస్యలూ ఎదురవుతాయి. 

9 నెలల తర్వాత భూమి వైపు ప్రయాణం 

2024 జూన్‌‌‌‌ 5న ప్రయోగించిన బోయింగ్‌‌‌‌ వ్యోమనౌక ‘స్టార్‌‌‌‌లైనర్‌‌‌‌’లో ఐఎస్ఎస్​కు 8 రోజుల పర్యటనకు వెళ్లారు. అయితే, స్టార్‌‌‌‌లైనర్‌‌‌‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఆస్ట్రొనాట్లు లేకుండానే అది భూమికి తిరిగొచ్చింది. దీంతో, సునీతా విలియమ్స్, బుచ్‌‌‌‌ విల్​మోర్ సుమారు 9 నెలలుగా అక్కడే చిక్కుకుపోయారు. కాగా, ఐఎస్ఎస్​లో ఎక్కువకాలం గడిపిన రికార్డు ఫ్రాంట్ రూబియో పేరిట ఉంది. ఆయన 371 రోజులు ఐఎస్ఎస్​లో ఉన్నారు. ఇదే ఇప్పటి వరకు ఉన్న వరల్డ్ రికార్డు. ఐఎస్ఎస్​లో ఎక్కువ కాలం గడిపిన ప్రముఖ ఆస్ట్రొనాట్ల జాబితాలో సునీతా విలియమ్స్ చేరారు.

ఎందుకు ఉండిపోవాల్సి వచ్చింది?

వ్యోమనౌక ‘స్టార్​లైనర్’ ప్రొపల్షన్ సిస్టమ్‌‌‌‌లో లీకులు ఏర్పడటం, థ్రస్టర్స్ మూసుకుపోవడంతో పాటు హీలియం కూడా అయిపోయింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రొనాట్లను ఈ నౌకలో తిరిగి భూమిపైకి తీసుకురావడం సేఫ్ కాదని ఆగస్టు నెలాఖరు నాటికి నాసా నిర్ణయానికి వచ్చింది. దీంతో ఆస్ట్రొనాట్​లు లేకుండా బోయింగ్ స్టార్ లైనర్ 2024, సెప్టెంబర్ 7న భూమికి తిరిగి వచ్చింది. సునీతా, విల్​మోర్ లను తీసుకొచ్చేందుకు నాసా, స్పేస్‌‌‌‌ ఎక్స్‌‌‌‌లు కలిసి క్రూ 10 మిషన్‌‌‌‌ను చేపట్టాయి. శనివారం నలుగురు ఆస్ట్రొనాట్లతో కూడిన ఫాల్కన్‌‌‌‌ 9 రాకెట్‌‌‌‌ నింగిలోకి దూసుకెళ్లింది.

ఎంతో జాగ్రత్తగా రిటర్న్ జర్నీ

అన్ డాకింగ్ సక్సెస్ అయ్యాక డ్రాగన్‌‌‌‌ స్పేస్‌‌‌‌ క్రాఫ్ట్‌‌‌‌ భూమి వైపు జర్నీ ప్రారంభిస్తుంది. సోలార్‌‌‌‌ ప్యానెళ్ల ద్వారా స్పేస్‌‌‌‌క్రాఫ్ట్‌‌‌‌ బ్యాటరీలు చార్జ్​ అవుతాయి. భూమిపై ల్యాండింగ్​కు 44 నిమిషాల ముందు థ్రస్టర్‌‌‌‌ ఆన్‌‌‌‌ చేస్తారు. దీంతో డ్రాగన్‌‌‌‌ క్యాప్సూల్‌‌‌‌ వేగం తగ్గుతుంది. ల్యాండింగ్‌‌‌‌కు 3 నిమిషాల ముందు 3 ప్యారాచూట్లు తెరుచుకుంటాయి. దీంతో వేగం మరింత తగ్గుతుంది. డ్రాగన్‌‌‌‌ క్యాప్సూల్‌‌‌‌ అట్లాంటిక్‌‌‌‌ మహా సముద్రంలో ల్యాండ్‌‌‌‌ అవుతుంది. ఆ తర్వాత రికవరీ టీమ్‌‌‌‌, దాన్ని తీరానికి తీసుకొస్తుంది.

నాసా వెబ్​సైట్, టీవీలో లైవ్

వ్యోమనౌక హ్యాచ్‌‌‌‌ మూసివేత ప్రక్రియ మొదలు నుంచి ఆస్ట్రొనాట్లు భూమిపై అడుగుపెట్టే వరకు మొత్తం ప్రక్రియను లైవ్​గా చూసేందుకు అవకాశం కల్పించినట్లు నాసా తెలిపింది. మంగళవారం ఉదయం 8.30 గంటలకు నాసా టీవీ, నాసా వెబ్​సైట్​తో పాటు, యూట్యూబ్ చానెల్​లోనూ చూడొచ్చని ప్రకటించింది. కాగా,  సునీతాను భూమ్మీదికి తీసుకొచ్చేందుకు అమెరికా, జపాన్, రష్యాకు చెందిన నలుగురు వ్యోమగాములు అన్నె మెక్లెయిన్‌‌‌‌, నికోల్‌‌‌‌ అయర్స్‌‌‌‌, టకుయా ఒనిషి, కిరిల్‌‌‌‌ పెస్కోవ్‌‌‌‌ స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ స్పేస్‌‌‌‌‌‌‌‌క్రాఫ్ట్‌‌‌‌లో వెళ్లారు.