తెలంగాణలో త్వరలో పొద్దుతిరుగుడు కొనుగోళ్లు

తెలంగాణలో త్వరలో పొద్దుతిరుగుడు కొనుగోళ్లు
  • రైతు సంఘం వినతితో స్పందించిన సర్కారు

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో త్వరలో పొద్దు తిరుగుడు కొనుగోళ్లు చేపట్టనున్నారు. పంట​కొనుగోళ్లకు కేంద్రం గ్రీన్​ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్రంలో పొద్దు తిరుగుడు సాగు చేసిన ప్రాంతాల్లో కొనుగోలు చేయడానికి వ్యవసాయశాఖ సిద్దమవుతోంది. సన్​ఫ్లవర్​పంటను రైతులు తక్కువ ధరకే వ్యాపారులకు అమ్ముకొని నష్టపోతున్నారని.. వెంటనే కొనుగోళ్లు చేపట్టాలని రైతు సంఘం సహాయ కార్యదర్శి మూఢ్​ శోభన్​ ఆధ్వర్యంలో అగ్రికల్చర్​ సెక్రటరీ రఘునందన్​రావును కలిసి వినతిపత్రం అందించారు. 

దీనికి స్పందించిన సెక్రటరీ త్వరలో కొనుగోళ్లు చేపడతామన్నారు. రాష్ట్రంలో 16,840 ఎకరాలల్లో రైతులు పొద్దుతిరుగుడు పంటను వేశారు. ఒక ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్ల వరకు పొద్దు తిరుగుడు గింజలు వస్తాయి. ప్రభుత్వం క్వింటాలుకు రూ.7,280 మద్దతు ధరను ప్రకటించింది. వ్యాపారులు రూ.4,800 నుంచి రూ.5,200కు క్వింటాలు చొప్పున కొనుగోలు చేస్తున్నారు. దీంతో దాదాపు  రూ.2 వేలు నష్టపోవాల్సిన పరిస్థితి రైతులకు ఏర్పడింది. ఈ నేపథ్యంలో రైతు సంఘం వినతితో స్పందించిన సర్కారు కొనుగోళ్లకు సిద్ధమవుతోంది.