మోడీ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి: సునీల్ బన్సల్

  • కార్యకర్తలకు బీజేపీ జాతీయ కార్యదర్శి సూచ‌‌‌‌న
  • మోడీ హయాంలో అన్నిరంగాల్లో 
  • దేశం అగ్రగామి అని వెల్లడి

కోరుట్ల రూరల్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ప్రజలు పొందిన లబ్ధిని సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ బన్సల్ పిలుపునిచ్చారు. మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ నియోజకవర్గ స్థాయి బీజేపీ సోషల్ మీడియా కార్యకర్తల సమావేశం సోమవారం జగిత్యాల జిల్లా కోరుట్లలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథి సునీల్ బన్సల్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బన్సల్ మాట్లాడుతూ, దేశంలో 56 ఏండ్లలో జరగని అభివృద్ధి.. ప్రధాని మోడీ 9 ఏండ్ల పాలనలో జరిగిందని చెప్పారు. దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రపంచంలోనే అగ్రగామిలో ఉంచారని పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం చేసిన 9 ఏండ్ల అభివృద్ధిని బీజేపీ సోషల్ మీడియా కార్యకర్తలు వాట్సప్, ఫేస్‌‌బుక్‌‌,  ఇన్‌‌స్టా గ్రామ్‌‌ల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలంటే సోషల్ మీడియా కార్యకర్తలు బాగా కష్టపడాలని చెప్పారు. కేంద్ర సంక్షేమ పథకాలతో ప్రజలకు జరిగిన మంచిని వివరిస్తూ పోస్టులు పెట్టాలన్నారు. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని డిజిటల్ స్క్రీన్ ద్వారా ప్రదర్శించగా వాటిని ఎంపీ అర్వింద్‌‌ వివరించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, కరీంనగర్ మాజీ జడ్పీ చైర్మన్ తుల ఉమా, మాజీ జడ్పీటీసీ సునీతా వెంకట్, సురభి నవీన్, కార్యకర్తలు పాల్గొన్నారు.

పేదలను కేసీఆర్ మోసం చేస్తున్నడు 

హైదరాబాద్‌‌, వెలుగు: పేదలకు ఇండ్లు ఇవ్వకుండా కేసీఆర్ సర్కార్ మోసం చేస్తున్నదని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) స్కీమ్‌‌ను తెలంగాణ సర్కార్‌‌‌‌ అమలు చేయడం లేదన్నారు. దీనికి కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంటరీ ప్రవాసీ యోజన కార్యక్రమంలో భాగంగా మల్కాజ్‌‌గిరిలో ప్రహ్లాద్‌‌ జోషి సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వందల కోట్లు పెట్టి ప్రగతిభవన్‌‌ కట్టుకున్న కేసీఆర్‌‌‌‌, పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో గుజరాత్‌‌లోని భావ్‌‌నగర్‌‌‌‌ ఎంపీ, బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్‌‌ భారతిబెన్ షియల్ పాల్గొన్నారు.

దేశ వ్యతిరేక శక్తులతో రాహుల్: ఇంద్రసేనారెడ్డి

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మన దేశ వ్యతిరేక శక్తులతో కలిసి అమెరికాలో కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారని బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. ఈ మేరకు సోమవారం పార్టీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్‌‌తో లీడర్‌‌‌‌గా ఎదిగిన వ్యక్తి బీజేపీని విమర్శించడం సిగ్గుచేటన్నారు. 

కల్వకుంట్ల ఖజానోత్సవం

విద్యుత్ విజయోత్సవం పేరిట రాష్ట్ర సర్కార్ సోమవారం నిర్వహించిన వేడుకలపై బీజేపీ స్టేట్ చీఫ్, ఎంపీ బండి సంజయ్‌‌ ట్విట్టర్​లో విమర్శలు గుప్పించారు. ‘డిస్కంల నిండా అప్పులు, విద్యుత్ కొనుగోళ్ల పేరిట స్కాములు, ప్రజలకేమో చార్జీల తిప్పలు.. ఇది విద్యుత్ విజయోత్సవం కాదు.. కల్వకుంట్ల ఖజానోత్సవం’’ అని సంజయ్ ట్వీట్ చేశారు.

ఇయ్యాల పార్టీ ముఖ్య నేతలతో సునీల్ బన్సల్ మీటింగ్

పార్టీ రాష్ట్ర ముఖ్య నేతలతో తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్​చార్జ్ సునీల్ బన్సల్ మంగళవారం సమావేశం కానున్నారు. మోడీ తొమ్మిదేండ్ల పాలనపై రాష్ట్రంలో చేపట్టిన కార్యక్రమాలు, ఈ నెలలో బీజేపీ అగ్రనేతలు మోడీ, అమిత్ షా, జేపీ నడ్డాలు హాజరయ్యే అవకాశం ఉన్న మూడు భారీ బహిరంగ సభల ఏర్పాట్లపై ఈ సమావేశంలో ఆయన చర్చించనున్నారు.