సభ్యత్వం విషయంలో పార్టీని మోసం చేసిన్రు

సభ్యత్వం విషయంలో పార్టీని మోసం చేసిన్రు
  • మెంబర్​షిప్​లు చేయకపోయినా చేసినట్లు చూపిస్తారా?
  • బీజేపీ పదాధికారుల భేటీలో స్టేట్​ ఇన్​చార్జ్​ సునీల్ బన్సల్ ఫైర్
  • కొత్త జిల్లాల అధ్యక్షులు ఏం చేస్తున్నరని నిలదీత

హైదరాబాద్, వెలుగు: బీజేపీ యాక్టివ్ మెంబర్ షిప్ విషయంలో పార్టీకి తప్పుడు సమాచారం ఇచ్చి చీటింగ్ చేశారని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్ సునీల్ బన్సల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 13వేల యాక్టివ్ మెంబర్​షిప్​లు చేయకపోయినా చేసినట్టు చూపించారని సీరియస్ అయ్యారు. బీజేపీ స్టేట్ ఆఫీస్​లో జరిగిన పదాధికారుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తాజా రాజకీయాలపై ఆరా తీశారు. జాతీయ కమిటీ ఇచ్చిన గావ్ చలో బస్తీ చలో, అంబేద్కర్ జయంతి వేడుకల నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 3 నెలల కింద బీజేపీ పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందన్నారు. తాను డైరీలో అప్పుడు ఏం రాసుకున్నానో.. ఇప్పుడు అదే చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కేవలం వర్క్ షాపులు, ఇండోర్ మీటింగ్​లు పెట్టుకుంటూ పోతే సరిపోదన్నారు. ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో ఎందుకు పోరాడటం లేదని ప్రశ్నించారు. వచ్చే నెల 4వ తేదీ వరకు మిగిలిన మండలాలకు అధ్యక్షులను నియమించాలని ఆదేశించారు. 

మే 15 వరకు పూర్తి స్థాయిలో మండల కమిటీలు వేయాలన్నారు. అయితే, కమిటీలో 11 మంది ఉండాలని.. దాంట్లో ముగ్గురు మహిళలు, ఎస్సీ, ఎస్టీ కూడా ఉండాలని సూచించారు. మండల కమిటీల్లో యాక్టివ్ మెంబర్​షిప్ సభ్యులే ఉండాలన్నారు. మే 15 తర్వాత 2 ఉమ్మడి జిల్లాల వారీగా మండల అధ్యక్షుల సమావేశాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. అయితే, కొత్త రాష్ట్ర అధ్యక్షుడిని నియామకం తర్వాతే, పూర్తిస్థాయి జిల్లాల కమిటీలను ఏర్పాటు చేయనున్నట్టు స్పష్టం చేశారు.