- పార్టీ ప్రోగ్రామ్‌ల సక్సెస్ బాధ్యత మీదే
- బీజేపీ ఫుల్ టైమర్స్ తో మీటింగ్ లో సునీల్ బన్సల్
హైదరాబాద్, వెలుగు: బీజేపీ హైకమాండ్ ఇచ్చిన ప్రోగ్రామ్‌లను సక్సెస్ చేసే బాధ్యత పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఫుల్ టైమర్(విస్తారక్)లదేనని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ సునీల్ బన్సల్, సహా ఇన్చార్జ్ అరవింద్ మీనన్ స్పష్టం చేశారు. ఆర్గనైజేషన్, ఎలక్టోరల్, పొలిటికల్, సోషల్ అనాలసిస్ చేసి ఎప్పటికప్పుడు రిపోర్ట్ ఇవ్వాలని విస్తారక్ లను ఆదేశించారు. ప్రతి బూత్ లో వాట్సప్ గ్రూప్ లు ఏర్పాటు చేయాలని, వారితో సరళ్ యాప్ ను డౌన్ లోడ్ చేయించాలని చెప్పారు. శుక్రవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో విస్తారక్ లతో సమావేశమైన సందర్భంగా సునీల్ బన్సల్ పలు విషయాలపై చర్చించి వారికి దిశానిర్దేశం చేశారు. బూత్ కమిటీలు వేయాలని, ఆ కమిటీ సభ్యులకు అప్పగించిన వర్క్ ను ఫాలో అప్ చేయాలని సూచించారు.
శక్తి కేంద్రాల ఇన్చార్జీలను సమన్వయం చేసుకోవాలని, మండల అధ్యక్షులతో రెగ్యులర్ గా కాంటాక్ట్ లో ఉండాలన్నారు. ప్రతి నెల మండల సమావేశం జరిగేలా చూడాలని, తమకు అప్పగించిన నియోజకవర్గాల్లో పర్యటించేందుకు బైక్ లను కూడా పార్టీ సమకూరుస్తుందని చెప్పారు. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో విస్తారక్ ల పాత్ర కీలకం అన్న విషయాన్ని మరవొద్దన్నారు. కాగా, సునీల్ బన్సల్, అరవింద్ మీనన్ శుక్రవారం హైదరాబాద్ లోని మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఇంటికి బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ కు వెళ్లారు. తాజా రాజకీయాలపై వారు చర్చించుకున్నట్లు తెలిసింది.