నల్గొండ: మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ వెయ్యి కోట్లు ఖర్చు పెట్టినా ఫైనల్ గా బీజేపీదే విజయమని ఆ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ సునీల్ బన్సల్ ధీమా వ్యక్తం చేశారు. మునుగోడులో నిర్వహించిన బీజేపీ బూత్ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశానికి మునుగోడు ఉప ఎన్నికల ఇంచార్జ్ వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తో కలిసి బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ బన్సల్ హాజరయ్యారు. ఈ సమావేశానికి బీజేపీ కార్యకర్తలు భారీగా హాజరు కాగా.. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపు కోసం చేయాల్సిన గ్రౌండ్ వర్క్ పై కార్యకర్తలకు ఆయన దిశా నిర్దేశం చేశారు. అనంతరం సునీల్ బన్సల్ మాట్లాడుతూ... రాష్ట్రంలో రానున్నది బీజేపీ ప్రభుత్వమేనన్నారు. అందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.
మునుగోడులో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని జిమ్మిక్కులు చేసినా.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపును ఆపలేరన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ బీజేపీ అని పేర్కొన్న బన్సల్... అత్యధిక మంది కార్యకర్తలు కలిగిన పార్టీ కూడా బీజేపీయేనని తెలిపారు. ప్రధాని మోడీ ఆధ్వర్యంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని ఆయన పేర్కొన్నారు.
-