- సీఎంకు, ఆయన కుటుంబానికి జైలే గతి
- బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దియోధర్
ఖమ్మం, వెలుగు : రాష్ట్రంలో అవినీతి పాలన సాగిస్తున్న కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు జైలులో మీటింగులు పెట్టుకునే రోజు దగ్గర్లోనే ఉందని బీజేపీ జాతీయ కార్యదర్శి, ఖమ్మం జిల్లా ఎన్నికల ఇన్చార్జ్సునీల్ దియోధర్ హెచ్చరించారు. గురువారం ఖమ్మంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణతో కలిసి సునీల్ దియోధర్ మాట్లాడారు. రాష్ట్ర ఖజానాను గజదొంగ కేసీఆర్ మింగేస్తున్నారని, ఆయనను సాగనంపినప్పుడే తెలంగాణ బాగుపడుతుందన్నారు. బీజేపీ ప్రభుత్వం రాగానే కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపిస్తుందని, అవినీతిపరులను ప్రధాని మోదీ వదిలిపెట్టబోరని హెచ్చరించారు.
బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ సీక్రెట్ అజెండాతో కలిసి పనిచేస్తున్నాయని, కాంగ్రెస్ కు ఓటేస్తే బీఆర్ఎస్కు వేసినట్టేనన్నారు. రెండూ హిందూ వ్యతిరేక పార్టీలేనని, మైనార్టీలను దగ్గర చేసుకునేందుకు హిందువులను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలోని గిరిజనులకు బీఆర్ఎస్ అన్యాయం చేసిందని అన్నారు. కేంద్ర నిధులను కేసీఆర్కాజేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థలే నిర్ణయం తీసుకుంటాయని, కేంద్రం జోక్యం ఉండదన్నారు.
=కృష్ణా జలాల్లో న్యాయబద్దంగా రాష్ట్రానికి రావాల్సిన వాటాను తేల్చేందుకు కృష్ణ ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడం సంతోషకరమని కొండపల్లి శ్రీధర్‌రెడ్డి అన్నారు. ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల రైతుల తరఫున కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణలో వచ్చేది డబుల్ ఇంజన్ సర్కారే
ఇల్లెందు/మణుగూరు : రాష్ట్రంలో రానున్నది డబుల్ ఇంజన్సర్కారేనని ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి సహాయ మంత్రి బి.ఎల్.వర్మ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ పర్యటనలో భాగంగా గురువారం ఆయన ఇల్లెందులో పర్యటించారు. టౌన్లో పార్టీ ఆఫీసు ప్రారంభించారు. వర్మ మాట్లాడుతూ..డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, రైతు రుణమాఫీ పేరుతో రాష్ట్ర ప్రజలను కేసీఆర్ సర్కార్ మోసం చేసిందని విమర్శించారు. పేదల, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండింటి వ్యూహం ఒక్కటే అన్నట్లు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ఈ సమావేశంలో భద్రాద్రి జిల్లా సమన్వయకర్త నాళ్ల సోమసుందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, నియోజకవర్గ కన్వీనర్ గోపీకృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మణుగూరులో నిర్వహించిన పినపాక నియోజకవర్గ సమావేశంలో బి.ఎల్.వర్మ పాల్గొని మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయ ఢంకా మోగించి, గోల్కొండలో కాషాయ జెండా ఎగరవేసేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రాష్ట్ర కార్యదర్శి ఉమారాణి, జిల్లా ఇన్చార్జి రంగరాజు రుక్మారావు, పార్లమెంట్ప్రభారి నూకల వెంకటనారాయణ రెడ్డి పాల్గొన్నారు.