- వంశీచంద్ ను గెలిపించాలని కొడంగల్ సభలో విజ్ఞప్తి
- కీలకంగా మారనున్న సునీల్ కనుగోలు రిపోర్ట్
- కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారిన లిస్ట్
- 14 సీట్లు పక్కా గెలుస్తామని రిపోర్ట్ ఇచ్చినట్టు టాక్
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులెవరో తేలిపోయిందా..? పాలమూరు నుంచి వంశీచందర్ రెడ్డి బరిలోకి దిగబోతున్నారా..? మిగతా స్థానాల్లో ఎవరెరు పోటీ చేస్తారు..? అన్నది ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. త్వరలో రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. నిన్న కొడంగల్ లో పర్యటించిన సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సభలో మాట్లాడుతూ రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో వంశీచందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. కొడంగల్ నియోజకవర్గం నుంచే యాభై వేల ఓట్ల మెజార్టీ ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేయడమే కాకుండా వంశీచంద్ రెడ్డి చేయి పట్టుకొని లేపి గెలిపించాలని కోరారు.
దీంతో కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే వారెవరో తేలిపోయిందా..? అందులో భాగంగానే సీఎం వంశీచంద్ రెడ్డి పేరు ప్రకటించారా..? అన్నది పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించి అధిష్టానానికి ఒక రిపోర్ట్ అందించినట్టు తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారు. ఈ క్రమంలో కనుగోలు ఇచ్చిన జాబితాపై చర్చ జరిగి ఉంటుందనే టాక్ నడుస్తోంది. అందుకే వంశీచంద్ రెడ్డి పేరును రేవంత్ రెడ్డి ప్రకటించారా..? అన్నది చర్చనీయాంశంగా మారింది.
అడ్జెస్ట్ మెంట్ చేస్తున్నారిలా..!
రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాలకు ఆశావహుల నుంచి పీసీసీ దరఖాస్తులు స్వీకరించింది. మొత్తం 309 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అత్యధికంగా మహబూబాబాద్(ఎస్టీ) సెగ్మెంట్ నుంచి 48, ఆ తర్వాత వరంగల్ (ఎస్సీ) నుంచి 42 అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో కొందరిని ఇప్పటికే అకామిడేట్ చేశారు, వరంగల్ టికెట్ ఆశించిన సిరిసిల్ల రాజయ్యకు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. ఖమ్మం నుంచి దరఖాస్తు చేసుకున్న రేణుకా చౌదరిని రాజ్యసభకు పంపారు. సికింద్రాబాద్ టికెట్ ఆశించిన అనిల్ కుమార్ యాదవ్ కూడా పెద్దల సభలో అడుగు పెట్టబోతున్నారు.
14 సీట్లు పక్కా..
సామాజిక సమీకరణాలు, అభ్యర్థుల బలాబలాలు, స్థానిక పరిస్థితుల ఆధారంగా సునీల్ కనుగోలు టీం సర్వే చేసింది. ఈ నేపథ్యంలో ఒక రిపోర్ట్ ను కాంగ్రెస్ అధినాయకత్వానికి అందించినట్టు తెలుస్తోంది. అందులో 14 చోట్ల కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఉన్నట్టు సమాచారం. అభ్యర్థి ఎవరైతే గెలుస్తారనే అంశాన్నీ కనుగోలు సూచించినట్టు తెలుస్తోంది. గెలుపుపై ప్రభావం చూపే అంశాలు.. అభ్యర్థి ప్లస్, మైనస్ లను రిపోర్టులో వివరించారని సమాచారం. ఇలాంటి కీలక రిపోర్టులోని అంశాలు సీఎంకు సంపూర్ణంగా తెలుసనే వాదన బలంగా వినిపిస్తోంది. అందులో భాగంగానే వంశీచంద్ రెడ్డి పేరును అనూహ్యంగా చెప్పకనే చెప్పారని తెలుస్తోంది.