సత్యసాయి ఆసుపత్రి సేవలు భేష్​: మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్

కొండపాక, వెలుగు: సత్య సాయి సంజీవని ఆసుపత్రి సేవలను ఈ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకొని చిన్నారుల గుండెకు భద్రత కల్పించుకోవాలని మాజీ క్రికెటర్  సునీల్  గవాస్కర్  సూచించారు. గురువారం సిద్దిపేట జిల్లా కొండపాకలోని శ్రీ సత్య సాయి సంజీవిని ఆసుపత్రిలో వైద్య సేవలను ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాంతంలో సత్యసాయి అనుగ్రహంతో వెలిసిన ఈ ఆసుపత్రి సిద్దిపేట జిల్లా ప్రజల అదృష్టమని పేర్కొన్నారు.

గతంలో మాజీ మంత్రి హరీశ్​రావు ఈ ఆసుపత్రి నిర్మాణానికి ఎంతగానో సహకరించారని గుర్తు చేశారు. బాలల దినోత్సవం రోజు చిన్నారుల  గుండె ఆసుపత్రి సేవలను ప్రారంభించడం శుభ సూచకమన్నారు. పుట్టుకతో చిన్నారులకు వచ్చిన గుండె సంబంధించిన వ్యాధులను నయం చేసుకోవచ్చని తెలిపారు. దేశంలో సత్యసాయి ట్రస్టు ద్వారా అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. సత్యసాయి సంజీవని ఆసుపత్రుల చైర్మన్  శ్రీనివాస్, ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు.