MS Dhoni: ధోనీ వల్లే కోహ్లీ గొప్ప క్రికెటర్‌గా ఎదిగాడు: సునీల్ గవాస్కర్

MS Dhoni: ధోనీ వల్లే కోహ్లీ గొప్ప క్రికెటర్‌గా ఎదిగాడు: సునీల్ గవాస్కర్

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ మధ్య గొడవ ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. విరాట్ స్ట్రైక్‌రేట్‌పై మొదలైన ఈ వివాదం.. సైలెంట్ వార్‌లా రోజుకో మలుపు తీసుకుంటోంది. తాజాగా, ఈ గొడవలోకి మరో ఆసక్తికర విషయాన్ని తీసుకొచ్చారు.. లిటిల్ మాస్టర్. 

విరాట్ ఆధునిక గ్రేట్‌ బ్యాటర్‌గా మారడంలో ఎంఎస్ ధోని కీలక పాత్ర పోషించారని గవాస్కర్ తెలిపారు. అంతర్జాతీయ కెరీర్‌లో కోహ్లీకి అద్భుతమైన ప్రారంభం దక్కలేదని, అతని సామర్ధ్యాలపై ధోని నమ్మకముంచి మరిన్ని అవకాశాలు ఇవ్వడం వల్లే ఈ స్థాయికి ఎదిగాడని వెల్లడించారు. 

"కెరీర్ ఆరంభంలో విరాట్ కోహ్లీ ఇబ్బంది పడ్డాడు. నిలకడగా రాణించలేకపోయాడు. వాస్తవంగా అదొక స్టాప్-స్టార్ట్ కెరీర్. అలాంటి పరిస్థితుల్లో ధోనీ అతనికి అండగా నిలిచాడు. అతని సామర్థ్యాలపై నమ్మకముంచాడు. వరుస అవకాశాలు ఇచ్చి అతనికి అదనపు ఊపును ఇచ్చాడు. అందువల్లే కోహ్లీ ఈరోజు ఈ స్థాయికి చేరగలిగాడు.. " అని లిటిల్ మాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌లో అన్నారు.

చెన్నైతో అమీ తుమీ.. 

ఐపీఎల్ పదిహేడో సీజన్ ఫస్టాఫ్‌లో దారుణంగా విఫలమైన ఆర్‌సీబీ.. సెకండాఫ్‌లో మాత్రం దుమ్మురేపుతోంది. తొలి 8 మ్యాచ్‌ల్లో ఏకైన విజయన్ని అందుకున్న డుప్లెసిస్ సేన.. తరువాత వరుసగా 5 మ్యాచ్‌ల్లో నెగ్గి ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. శనివారం(మే 18) సొంతగడ్డపై తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఈ మ్యాచ్‌లో గెలవడంతో పాటు మెరుగైన రన్ రేట్ సాధిస్తే ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది.

ఉదాహరణకు మొదట చెన్నై బ్యాటింగ్ చేసి 200 పరుగులు చేసిందనకుంటే.. ఆ లక్ష్యాన్ని బెంగళూరు జట్టు 11 బంతులు మిగిలుండగానే ఛేదించాలి. అదే బెంగళూరు మొదట బ్యాటింగ్ చేస్తే కనీసం 18 పరుగుల తేడాతో విజయం సాధించాలి. అప్పుడే ప్లేఆఫ్స్‌ దశకు అర్హత సాధిస్తారు. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. బెంగళూరు నగరంలో శనివారం వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.