Paris Olympics 2024: వినేశ్ ఫొగాట్‌‌‌‌కు అన్యాయం జరిగింది : సునీల్ గవాస్కర్

పారిస్ ఒలింపిక్స్‌లో 50 కేజీల స్వర్ణ పతక పోరులో అధిక బరువుతో రెజ్లర్ వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు పడింది. మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ ఫైనల్ పోటీలో ఉదయం 100 గ్రాములు అధిక బరువుతో వినేశ్ ఫొగాట్ అర్హత సాధించలేక టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. ప్రస్తుతం ఈ విషయం ఇండియాలో సంచలనంగా మారింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. తాజాగా భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్  వినేశ్ ఫొగాట్‌‌‌‌కు జరిగిన అన్యాయం గురించి స్పందించాడు.

రెజ్లర్ వినేష్ ఫోగట్ అధిక బరువుతో అనర్హత వేటు వేయడాన్ని భారతదేశం తీవ్రంగా నిరసించాలి అని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ బుధవారం (ఆగస్ట్ 7) తన నిరాశను తెలిపాడు. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)తో పాటు భారత ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని పరిష్కరించాలని సూచించారు. "అత్యంత దురదృష్టకరమని నేను భావిస్తున్నాను. ఆమెకు తీవ్ర అన్యాయం జరిగింది. ఇది ప్రారంభ మ్యాచ్ కాదు. అధికారులు దీనిని గమనించాలి. అనర్హతకు వ్యతిరేకంగా భారతదేశం బలంగా నిరసన తెలపాలి". అని గవాస్కర్ చెప్పుకొచ్చారు.

50 కేజీల విభాగంలో వినేశ్ ఫొగాట్‌‌‌‌ గోల్డ్ మెడల్ సాధిస్తుందని భారత అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురు చూశారు. స్వర్ణ పతకం మిస్ అయినా కనీసం రజత పతకం సాధిస్తుందని ఆశించారు. ఒలింపిక్స్ లో పతకం ఖాయమైనందుకు దేశమంతా సంబరాలు జరిగాయి. అయితే బుధవారం( ఆగస్ట్ 7) ఆమెకు ఊహించని షాక్ తగలడంతో పతకం చేజారింది.