- రెడ్ బాల్ మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండానే బంగ్లాతో టెస్టు ఆడనున్న స్టార్ క్రికెటర్లు
ముంబై: టీ20 వరల్డ్ కప్ తర్వాత శ్రీలంక టూర్‌కు వెళ్లిన టీమిండియా నెల కంటే ఎక్కువ రోజులు ఇంటర్నేషనల్ క్రికెట్‌కు దూరంగా ఉండనుంది. వచ్చే నెల 19 నుంచి బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టు సిరీస్‌తో తిరిగి బరిలోకి దిగనుంది. ఈ మధ్యలోనే ఇండియా డొమెస్టిక్ సీజన్ మొదలవనుంది. ఇందులో మొదటగా వచ్చే నెల 5 నుంచి దులీప్ ట్రోఫీ జరగనుంది. ఈ రెడ్ బాల్ టోర్నీలో పోటీ పడే నాలుగు జట్లలో పలువురు టీమిండియా స్టార్లు బరిలో నిలిచారు.
ఆ నలుగురికి విశ్రాంతి
వన్డే, టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ కు మినహాయింపు ఇచ్చిన సెలెక్షన్ కమిటీ డొమెస్టిక్ క్రికెట్‌లో సత్తా చాటుతున్న అనుభవజ్ఞులు, కుర్రాళ్లతో జట్లను ఎంపిక చేసింది. దులీప్ ట్రోఫీలో రెడ్‌బాల్‌తో ఆడి బంగ్లాదేశ్‌తో టెస్టు సవాల్‌కు సిద్ధం అవ్వాలని టీమిండియా భావిస్తుండగా.. కెప్టెన్ రోహిత్, విరాట్ కోహ్లీ ఈ టోర్నీకి దూరంగా ఉండటాన్ని క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్ తప్పుబట్టాడు. జూన్ 28న టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ఆడిన ఈ ఇద్దరూ.. ఈ నెలలో శ్రీలంకతో మూడు వన్డేలు మాత్రమే ఆడారు. ఈ సిరీస్ ఈ నెల 7న ముగిసింది. ఈ లెక్కన 40 రోజులు పాటు ఆటకు పూర్తిగా దూరంగా ఉండి.. సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో తిరిగి బరిలో దిగనున్నారు. ఇంత విరామం తర్వాత రెడ్ బాల్‌తో మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా టీమిండియా స్టార్లు నేరుగా ఇంటర్నేషనల్ సిరీస్, అందునా టెస్టు సిరీస్‌లో పోటీ పడడం సరికాదని గవస్కర్ అభిప్రాయపడ్డాడు.
‘సెలెక్టర్లు కెప్టెన్ రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీని దులీప్ ట్రోఫీకి ఎంపిక చేయలేదు. దాంతో రెడ్ బాల్‌తో మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండానే బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్‌కు వస్తారు. ఇది మంచి పద్ధతి కాదు. ఒకసారి క్రికెటర్ వయసు 30 దాటిన తర్వాత అతను రెగ్యులర్‌గా మ్యాచ్‌లు ఆడుతుండాలి. అది తను నిర్దేశించుకున్న అత్యున్నత ప్రమాణాలను కొనసాగించేందుకు ఉపయోగపడుతుంది. ఇంత గ్యాప్ వచ్చినప్పుడు ప్లేయర్ల కండరాల పటుత్వం కొంత బలహీనపడుతుంది. మునుపటి ఉన్నత ప్రమాణాలకు తిరిగి రావడం అంత సులభం కాదు’ అని గవాస్కర్ ఓ కాలమ్‌లో పేర్కొన్నాడు.
బుమ్రా ‘విశ్రాంతి’ని అర్థం చేసుకోవచ్చు
పనిభారం, గతంలో గాయాల చరిత్రను దృష్టిలో ఉంచుకుంటే స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వడాన్ని అర్థం చేసుకోవచ్చని సన్నీ చెప్పాడు. సున్నితమైన వెన్నుముక కలిగిన బుమ్రా వంటి పేసర్ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. కానీ, ఇంత లాంగ్ గ్యాప్‌లో బ్యాటర్లు కొంత బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయాలని సూచించాడు. కాగా, దులీప్ ట్రోఫీకి ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, స్పిన్నర్ కుల్దీప్, ఫాస్ట్ బౌలర్ సిరాజ్ కూడా ఎంపికయ్యారు.
బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్ , శ్రేయస్ అయ్యర్ బరిలో నిలిచారు. 2022లో జరిగిన కారు ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత రిషబ్ పంత్ ఈ టోర్నీతోనే తిరిగి రెడ్ బాల్ ఆటను ప్రారంభించనుండగా.. జట్టులో ప్లేస్ కోల్పోయిన మరో కీపర్ ఇషాన్ కిషన్ కూడా రీఎంట్రీకి రెడీ అవుతున్నాడు. కాగా, దులీప్ ట్రోఫీ పెర్ఫామెన్స్ ఆధారంగా బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌కు సెలక్షన్ కమిటీ జట్టును ఎంపిక చేయనుంది. బంగ్లాతో తొలి టెస్టు సెప్టెంబర్ 19 నుంచి చెన్నైలో, రెండో మ్యాచ్ 27 నుంచి కాన్పూర్‌లో జరుగుతుంది.