
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ స్పిన్నర్ సునీల్ జోషి బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (సీఓఈ)లో స్పిన్ బౌలింగ్ కోచ్ పదవికి పోటీపడుతున్నాడు. మాజీ స్పిన్నర్ సాయిరాజ్ బహుతులే రాజీనామా చేసి ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్తాన్ రాయల్స్‌లో అసిస్టెంట్ కోచ్‌గా చేరిన తర్వాత ఈ పోస్టు ఖాళీ అయింది. గతంలో నేషనల్ క్రికెట్ అకాడమీగా సేవలందించిన సీఓఈలో ఈ పోస్టు కోసం జోషి దరఖాస్తు చేసుకున్నాడు.
బోర్డు సమాచారం ప్రకారం అతను సీఓఈ క్రికెట్ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, బీసీసీఐ జనరల్ మేనేజర్ (క్రికెట్ ఆపరేషన్స్) అబేయ్ కురువిల్లాతో కూడిన ప్యానెల్ ముందు ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. మరో నలుగురు అభ్యర్థులు వ్యక్తిగతంగా ఇంటర్వ్యూలకు హాజరయ్యారు.
వారిలో ఇండియా అండర్-19 విమెన్స్ టీమ్ కోచ్ నూషిన్ అల్ ఖదీర్ కూడా ఉంది. . గుజరాత్, సౌరాష్ట్ర మాజీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ రాకేష్ ధ్రువ్, విదర్భ ఆఫ్-స్పిన్నర్ ప్రీతమ్ గాంధీ కూడా ఈ పోస్టుకు పోటీ పడుతున్నారు. అయితే, ఎలైట్ స్థాయి కోచింగ్‌లో మంచి అనుభవంతో అందరిలో 54 ఏళ్ల జోషికే మొగ్గు కనిపిస్తోంది.