దళితులను అవమానించిన వాళ్లను అరెస్ట్​ చేయండి

దళితులను అవమానించిన వాళ్లను అరెస్ట్​ చేయండి
  • సిద్దిపేట​ సీపీకి జాతీయ ఎస్సీ కమిషన్ డైరెక్టర్​ ఆదేశం

జగదేవపూర్, వెలుగు: మెదక్​ జిల్లా జగదేవపూర్​ మండలం తిమ్మాపూర్ గ్రామ దళితులను అవమానించిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని పోలీస్ కమిషనర్ శ్వేతను జాతీయ ఎస్సీ కమిషన్  డైరెక్టర్ సునీల్ కుమార్ ఫోన్​లో ఆదేశించారు. తిమ్మాపూర్ దళితులు డీబీఎఫ్ (దళిత బహుజన ఫ్రంట్​) జాతీయ కార్యదర్శి  పి.శంకర్ అధ్వర్యంలో మంగళవారం   జాతీయ ఎస్సీ కమిషన్ డైరెక్టర్​ను హైదరాబాద్​లో కలిశారు. గ్రామస్తులందరికీ కటింగ్ చేసే సెలూన్​ షాపులో కటింగ్, షేవింగ్ చేయకుండా దళితవాడలో చెట్ల కింద చేస్తూ కుల వివక్ష, అంటరానితనం  పాటిస్తున్నారని  డైరెక్టర్​కు వివరించారు.  వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించే విధంగా కలెక్టర్, పొలీస్ కమిషనర్​ను ఆదేశించాలని ఫిర్యాదు చేశారు. 

అదేవిధంగా హనుమన్ గుడిలోకి దళితులను రానివ్వకపొవడం, తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో చెరువుల పండుగలో దళితులు కూరగాయలు కట్ చేయనివ్వకుండా అవమానించారని వివరించారు. ఈ సందర్భంగా త్వరలోనే తిమ్మాపూర్​లో జాతీయ ఎస్సీ కమిషన్ వైస్ చైర్మన్ పర్యటిస్తారని డైరెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో తిమ్మాపూర్ దళిత నాయకులు నర్సింలు, కనకరాజు, అశోక్, శ్రీకాంత్, మహేందర్​, కర్ణాకర్, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.