బాల్కొండ, వెలుగు: కర్నాటకలో పథకాల అమలుపై ఎమ్మెల్యే సవాల్ ను స్వీకరించని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ బాల్కొండ అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం బాల్కొండ మండలంలోని ఇత్వార్ పేట్, జలాల్ పూర్, నాగాపూర్, భీమ్ గల్, ముచ్కూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేశారు. నియోజకవర్గంలో మంత్రి తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.
కర్నాటక వెళ్లి కాంగ్రెస్ గ్యారంటీల అమలు తీరు తెలుసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజార్టీతో గెలిచి, 100 రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందన్నారు. రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ, రూ.3 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు, రైతు భరోసా ద్వారా ఏడాదికి ఎకరానికి రూ.15000 పెట్టుబడి సాయం, రైతు కూలీలకు రూ. 12000 సాయం అందిస్తామని వెల్లడించారు. పసుపు పంటకు రూ.12 వేల మద్దతు ధర, క్వింటాల్ వడ్లకు రూ.500 బోనస్ కల్పిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, ఇప్పటికే జాబ్‌క్యాలెండర్ ప్రకటించినట్లు చెప్పారు. మండలానికో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామన్నారు.