న్యూఢిల్లీ: సైబర్ నేరగాళ్లు సాధారణ ప్రజలనే కాదు బిలియనీర్లనూ వదలడం లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీతో ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్‌లా మాట్లాడి, దుబాయ్‌లోని కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ను మోసం చేయడానికి ప్రయత్నించాడో ఓ స్కామర్. డబ్బులు పంపమని ఈ ఎగ్జిక్యూటివ్‌ను డిమాండ్ చేశాడు. సునీల్ మిట్టల్ పెద్ద మొత్తంలో డబ్బులు పంపమని అడగరని తెలిసిన ఈ ఎగ్జిక్యూటివ్, సైబర్ నేరాన్ని ముందుగానే గుర్తించి తనను తాను రక్షించుకోగలిగాడు. ఎన్‌డీటీవీ వరల్డ్ సమ్మిట్‌లో ఈ వివరాలను సునీల్ మిట్టల్ స్వయంగా పంచుకున్నారు.
ఏఐ వంటి టెక్నాలజీలను సైబర్ నేరగాళ్లు తప్పుగా వాడుతున్నారని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన సలహా ఇచ్చారు. ‘అచ్చం నేను మాట్లాడినట్టే సైబర్ నేరగాళ్లు ఏఐ సాయంతో మాట్లాడారు. అది విని షాక్ అయ్యాను’ అంటూ ఈ విషయాన్ని మిట్టల్ గుర్తు చేసుకున్నారు.