కోల్‌కతా: వెస్టిండీస్ మాజీ ఆల్ రౌండర్, కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్ ప్లేయర్ టీ20 క్రికెట్‌లో రికార్డు సృష్టించాడు. టీ20 క్రికెట్( అంతర్జాతీయ+ఐపీఎల్)లో 550 , అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన మూడో క్రికెటర్‌గా సునీల్ నరైన్ నిలిచాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2024లో మే11వ తేదీ శనివారం రాత్రి ఈడెన్ గార్డెన్స్‌లో ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన పోరులో నరైన్ ఈ మైలురాయిని సాధించాడు. ఈ జాబితాలో వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో 625 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత అఫ్గాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ 574 వికెట్లతో రెండో స్థానంలో నిలిచాడు.
ముుంబైతో జరిగిన మ్యాచ్ లో నరైన్ మూడు ఓవర్లు వేసి 21 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. మ్యాచ్ 7వ ఓవర్లో ఇషాన్ కిషన్‌ను అవుట్ చేయడంతో ఈ అరుదైన రికార్డును నెలకొల్పాడు. IPL 2024లో ఇప్పటివనరకు 12 మ్యాచ్‌లు ఆడిన సునీల్ నరైన్.. 6.73 ఎకానమీ రేటుతో 15 వికెట్లు తీశాడు.
ఇక, మ్యాచ్ విషయానికి వస్తే.. వర్షం కారణంగా 16 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన కోల్‌కతా 16 ఓవర్లలో 157/7 పరుగులు చేసింది. అనంతరం 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై16 ఓవర్లలో 139/8కే పరిమితమైంది. దీంతో 18 పరుగుల తేడాతో కోల్‌కతా విజయం సాధించింది.
12 మ్యాచ్ ల్లో KKR తొమ్మిది విజయాలు, మూడు ఓటములతో 18 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ విజయంతో కోల్ కతా జట్టు ప్లేఆఫ్ కు చేరుకుంది.