ఒక్క దెబ్బకు రెండు రికార్డులు బ్రేక్: అశ్విన్, రషీద్ ఖాన్‎ల రికార్డులు బద్దలుకొట్టిన నరైన్

ఒక్క దెబ్బకు రెండు రికార్డులు బ్రేక్: అశ్విన్, రషీద్ ఖాన్‎ల రికార్డులు బద్దలుకొట్టిన నరైన్

కోల్‎కతా స్టార్ స్పిన్నర్ సునీల్ నరైన్ ఐపీఎల్‎లో ఒకే మ్యాచులో రెండు రికార్డులు బ్రేక్ చేశాడు. శుక్రవారం (ఏప్రిల్ 11) చెన్నైతో జరిగిన మ్యాచులో 13 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టిన నరైన్.. స్టార్ స్పిన్నర్స్ అశ్విన్, రషీధ్ ఖాన్‎ల రికార్డులు బద్దలు కొట్టాడు. ఈ మ్యాచులో తన నాలుగు ఓవర్ల స్పెల్‌లో స్పిన్ మ్యాస్ట్రో ఒక్క బౌండరీ (ఫోర్ లేదా సిక్స్) కూడా ఇవ్వలేదు. ఐపీఎల్‎లో తన నాలుగు ఓవర్ల కోటాలో ఒక్క బౌండరీ కూడా ఇవ్వకపోవడం నరైన్‎కు ఇది 16వ సారి. గతంలో ఈ రికార్డ్ అశ్విన్, నరైన్ (15 సార్లు) పేరిట ఉండేది. చెన్నైతో జరిగిన మ్యాచులో ఈ రికార్డును నరైన్ బ్రేక్ చేశాడు. ఐపీఎల్‎లో 16 సార్లు ఒక్క బౌండరీ కూడా ఇవ్వని స్పిన్నర్ల జాబితాలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లాడు. 

ఈ మ్యాచులో అశ్విన్‎తో పాటు మరో స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‎కు సంబంధించిన ఓ రికార్డును కూడా నరైన్ బద్దలు కొట్టాడు. అదేంటంటే.. నరైన్ ఒక ఐపీఎల్ మ్యాచ్‌లో 15 కంటే తక్కువ పరుగులు ఇవ్వడం ఇది 13వ సారి. గతంలో ఈ రికార్డు రషీద్ ఖాన్, నరైన్ (12) పేరిట  సంయుక్తంగా ఉండేది. కానీ చెన్నైపై అద్భుత ప్రదర్శన చేసిన నరైన్ కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చి రషీద్ ఖాన్‎ను వెనక్కి నెట్టాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో నాలుగు ఓవర్లలో 13 సార్లు 15 పరుగుల కంటే తక్కువ పరుగులు ఇచ్చిన తొలి బౌలర్‎గా రికార్డ్ సృష్టించాడు. 

ఇక, మ్యాచ్ విషయానికొస్తే బంతితో అద్భుతంగా రాణించిన సునీల్ నరైన్.. బ్యాటింగ్‎లోనూ దుమ్మురేపాడు. ఓపెనర్‎గా బరిలోకి దిగి కేవలం 18 బంతుల్లో 44 పరుగులు చేశాడు. 104 పరుగుల స్వల్ప లక్ష్యంతో ఛేజింగ్‎కు దిగిన కేకేఆర్ నరైన్ దూకుడుతో కేవలం10.1 ఓవర్లలోనే విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన నరైన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెల్చుకున్నాడు.