IPL 2025: ఐపీఎల్‌లో కొత్త వివాదం.. రూల్స్‌కు విరుద్ధంగా నరైన్ బ్యాట్

IPL 2025: ఐపీఎల్‌లో కొత్త వివాదం.. రూల్స్‌కు విరుద్ధంగా నరైన్ బ్యాట్

ఐపీఎల్ 2025లో కొత్త వివాదం ఒకటి వెలుగులోకి వచ్చింది. మంగళవారం (ఏప్రిల్ 15)  జరిగిన మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ పై పంజాబ్ కింగ్స్ 16 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్ సమయంలో జరిగిన ఒక వివాదాస్పద సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. చండీగఢ్‌లోని ముల్లాన్‌పూర్‌లో జరిగిన ఈ మ్యాచ్ లో కోల్‌కతా ఓపెనర్ సునీల్ నరైన్ బ్యాట్ ఐపీఎల్ రూల్స్ కు విరుద్ధంగా ఉన్నట్టు తేలింది. 112 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో కేకేఆర్ ఓపెనర్లు సునీల్ నరైన్, క్వింటన్ డి కాక్ క్రీజులోకి వచ్చారు.

ఇన్నింగ్స్ ప్రారంభం కావడానికి ముందు అంపైర్ నరైన్ బ్యాట్‌ను పరిశీలించడానికి ఆటను కాసేపు నిలిపి వేశారు. అయితే ఈ టెస్టులో  నరైన్ బ్యాట్ విఫలమైనట్టు అంపైర్లు తేల్చారు. సునీల్ నరైన్ బ్యాట్ ఉపయోగించిన బ్యాట్ గేజ్ పరీక్షలో విఫలమైంది. నరైన్ బ్యాట్ యొక్క కొలతలు లేదా మందం నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా లేవని అర్థం. అంపైర్ సయ్యద్ ఖలీద్‌తో చర్చించిన తర్వాత, నరైన్ బ్యాట్ నిబంధనలకు అనుగుణంగా లేదని తేలింది. నరైన్ బ్యాట్ తర్వాత అంపైర్ మరో కేకేఆర్ ప్లేయర్ అంగ్‌క్రిష్ రఘువంశీ బ్యాట్‌ను చెక్ చేయగా ఆ బ్యాట్ సరిగానే ఉందని అంపైర్లు చెప్పారు. 

ఈ మ్యాచ్‌లో నరైన్ 4 బంతుల్లో 5 పరుగులే చేయగలిగాడు. రఘువంశీ మాత్రం 28 బంతుల్లో 37 పరుగులు చేసి కేకేఆర్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 11 వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన ఫాస్ట్ బౌలర్ అన్రిచ్ నార్ట్జే బ్యాట్ కూడా చట్టవిరుద్ధమని అంపైర్లు గుర్తించారు. మ్యాచ్ చివరి వికెట్ సమయంలో రహ్మానుల్లా గుర్బాజ్ మైదానంలోకి బ్యాట్‌లను తీసుకురావడంతో మరోసారి మ్యాచ్ కు అంతరాయం కలిగింది. అన్రిచ్ నార్ట్జే ఒక్క బంతిని కూడా ఆడలేదు. 

ఐపీఎల్ రూల్స్ ప్రకారం బ్యాట్ ముందు భాగం వెడల్పు 10.79 సెం.మీ కంటే ఎక్కువ ఉండకూడదు. బ్లేడ్ 6.7 సెం.మీ కంటే మందంగా ఉండకూడదు. బ్యాట్ అంచు 4 సెం.మీకి పరిమితం చేయాలి. బ్యాట్ పొడవు 96.4 సెం.మీ ఉండాలి. ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 15.3 ఓవర్లలో కేవలం 111 పరుగులకే ఆలౌట్ అయింది. 112 పరుగుల లక్ష్య ఛేదనలో కోల్‌కతా 95 పరుగులకే ఆలౌట్ అయింది.