హర్యానా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ ప్రచారం ప్రారంభించాయి. ఇందులో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అరవింద్ కేజ్రివాల్ భార్య సునీతా కేజ్రీవాల్ శనివారం హర్యానాలో పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా హర్యానాలోని పంచకులలో జరిగిన టౌన్‌హాల్ సమావేశంలో ఢిల్లీ సీఎం కేజ్రివాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ “కేజ్రీవాల్ కి గ్యారెంటీ” ప్రకటించారు. అందులో ప్రధానంగా 24 గంటల ఉచిత విద్యుత్, ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తామన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ప్రతినెలా రూ.1,000 ఆర్థిక ప్రోత్సాహం అందజేస్తామన్నారు. చదువుకున్న ప్రతి యువకుడికి విద్యార్హత ఆధారంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.
ఈ సందర్భంగా సునీతా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. మన నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ జీరో నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారని తెలిపారు. సొంతంగా పార్టీని స్థాపించి ఢిల్లీకి సీఎం అయ్యారని గుర్తు చేశారు. దేశ రాజధానిని పరిపాలిస్తాడని అప్పుడు ఎవరూ కలలో కూడా ఊహించలేదన్నారు. ఢిల్లీ లాంటి రాష్ట్రానికి ఒక సామాన్యుడు సీఎం కావడం చిన్న విషయం కాదన్నారు. అరవింద్ ప్రస్తుతం బీజేపీ అక్రమంగా పెట్టిన ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడని తెలిపారు. దేవుడు మనవైపే ఉన్నాడని.. హర్యానాలో ఆప్ ప్రభుత్వమే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మరోవైపు తన భర్త అరవింద్ కేజ్రీవాల్ జైలులో ఉండడంతో హర్యానాలో పార్టీ గెలుపు బాధ్యతను సునీతా కేజ్రీవాల్ తన భుజాలపై వేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఆప్ జాతీయ ప్రధాన కార్యదర్శి సందీప్ పాఠక్, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఉన్నారు.
ఆప్ ఒంటరిగానే బరిలోకి:
హర్యానాలో ఉన్న 90 అసెంబ్లీ స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ఆప్ తెలిపింది, ఇక్కడ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. అందుకే ఆప్ వైపు ఆశగా చూస్తున్నారంది. పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ హామీలను జూలై 20న ప్రకటిస్తామని ఆప్ తెలిపింది. కాగా ఈ ఏడాది చివర్లో హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఒంటరిగా పోరాడుతుందని ఆప్ నేత సంజయ్ సింగ్ అన్నారు. ఆప్ మొత్తం 90 స్థానాల్లో పోటీ చేస్తుందని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, సీనియర్ ఆప్ నాయకులు సందీప్ పాఠక్, అనురాగ్ ధండా, పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సుశీల్ గుప్తా తెలిపారు.