పాలమూరు, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపులో మహిళలు ప్రధాన పాత్ర పోషించారని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఆమె మీడియాతో మాట్లాడారు. మండల, బ్లాక్, బూత్, గ్రామ స్థాయిలో మహిళా కాంగ్రెస్ ను పటిష్టం చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 12కి పైగా పార్లమెంట్ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పార్లమెంటరీ స్థాయి రివ్యూ మీటింగ్లు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మహిళా ఓటు బ్యాంక్ కీలకమైందని, మహిళలతోనే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధ్యమైందన్నారు.
నామినేటెడ్ పదవుల్లో మహిళ కాంగ్రెస్ కు 33 శాతం కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్, బీజేపీ నేతలు చేస్తున్న విష ప్రచారాన్ని అడ్డుకుంటామని చెప్పారు. ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే రెండు పథకాలను అమలుచేసినట్లు తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిందని, ప్రతి వ్యక్తిపై లక్షన్నర అప్పు చేసిందని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ కు డిపాజిట్ కూడా దక్కదన్నారు. మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు వసంత పాల్గొన్నారు.