
హైదరాబాద్: ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. స్లీపింగ్ పిల్స్ మింగి సూసైడ్ అటెంప్ట్ చేసిన ఆమెను పోలీసులు చికిత్స నిమిత్తం నిజాంపేట్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషయం తెలియగానే పలువురు సినీ ప్రముఖులు ఆమెను పరామర్శించేందుకు ఆసుపత్రికి క్యూ కట్టారు. ఈ క్రమంలోనే ప్రముఖ సింగర్ సునీత మంగళవారం (మార్చి 4) రాత్రి కల్పన చికిత్స పొందుతోన్న హాస్పిటల్కి చేరుకుని ఆమె ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ప్రస్తుతం కల్పన హెల్త్ కండీషన్ ఎలా ఉందని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు సునీత. తన సహచరురాలికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు.
ALSO READ | ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం
కాగా, సింగర్ కల్పన ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. నిద్రమాత్రలు మింగి ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ నిజాంపేట్లోని ఓ అపార్ట్ మెంట్లో నివాసం ఉంటోన్న కల్పన.. గత రెండు రోజులుగా ఇంటి డోర్ తీయకపోవడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. కల్పన ఇంటికి చేరుకున్న పోలీసులు ఆమె అపార్ట్మెంట్ తలుపులు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా.. అప్పటికే ఆమె ఆపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. పోలీసులు హుటాహుటిన సింగర్ కల్పనను నిజాంపేట్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
కల్పన హెల్త్ కండీషన్ ప్రస్తుతం ఎలా ఉందన్న విషయం తెలియాల్సి ఉంది. కల్పన ఆత్మహత్యయత్నానికి పాల్పడటానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే సింగర్ కల్పన భర్తపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రికి వచ్చిన కల్పన భర్తను అదుపులోకి తీసుకుని మరోసారి ఇంటికి తీసుకెళ్లారు. గత రెండు రోజులుగా తాను బయటికి వెళ్లానని కల్పన భర్త చెప్తున్నాడు. కల్పన భర్త కదలికలు అనుమానస్పదంగా ఉండటంతో పోలీసులు సింగర్ ఇంట్లో తనిఖీలు చేస్తున్నట్లు తెలిసింది.