
మెహసానా: భారత సంతతి అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ సురక్షితంగా భూమికి తిరిగి చేరుకోవడంతో ఆమె పూర్వీకుల గ్రామం గుజరాత్ లోని మెహసానా జిల్లా ఝులాసన్ లో సంబరాలు అంబరాన్ని తాకాయి. గ్రామస్థులు పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకుంటూ ఆనందంగా గడిపారు. హరహర మహాదేవం అంటూ డాన్సు చేశారు. గ్రామదేవతకు నైవేద్యాలు సమర్పించారు. సునీత సురక్షితంగా తిరిగి రావాలని కోరుకుంటూ అంతకుముందు యజ్ఞం చేశారు. బుధవారం తెల్లవారుజామున సునీత భూమికి సమీపిస్తున్న సమయంలోనే గ్రామస్తులంతా ఒక్కచోట చేరి సునీత రిటర్న్ జర్నీని టీవీ స్క్రీన్ పై లైవ్ లో చూశారు.
బుచ్ విల్ మోర్, సునీతతో పాటు మరో ఇద్దరు వ్యోమగాములు ఉన్న క్యాప్స్యూల్ సముద్రంలో దిగగానే గ్రామస్తులు ఎగిరి గంతులు వేశారు. స్థానిక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఈ సందర్భంగా సంప్రదాయ గార్బా నృత్యం చేశారు. అనంతరం స్టూడెంట్లు, గ్రామస్తులు సునీత ఫొటో చేతపట్టుకుని స్థానిక డోలా మాత ఆలయం వరకు ర్యాలీ తీశారు. ఆలయంలో గ్రామస్తులు పూజలు నిర్వహించారు. కాగా, నిరుడు జూన్ 5న స్పేస్ లోకి వెళ్లి సాంకేతిక కారణాలతో అక్కడే చిక్కుకుపోయిన సునీత కోసం ఝులాసన్ గ్రామస్తులు స్థానిక డోలా మాత ఆలయంలో అదే నెల 27న అఖండ జ్యోతి వెలిగించారు.
సునీత భూమిపై వచ్చే వరకు ఆ జ్యోతిని వెలిగిస్తూనే ఉన్నారు. కాగా.. ఝులాసన్ సునీత పూర్వీకుల గ్రామం. ఆమె తండ్రి దీపక్ పాండ్యది ఈ గ్రామమే. సంబురాల్లో సునీత కజిన్ నవీన్ పాండ్య కూడా పాల్గొన్నారు. కాగా, సురక్షితంగా తిరిగి వచ్చిన సునీతా విలియమ్స్ బృందానికి గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ‘ఎక్స్’ లో అభినందనలు తెలిపారు. ‘‘మన సునీతకు కంగ్రాట్స్. ఆమెను చూసి యావత్ భారతదేశం గర్విస్తున్నది” అని సీఎం ట్వీట్ చేశారు.