ఎట్టకేలకు భూమి పైకి రానున్న సునీతా విలియమ్స్.. ముహూర్తం ఫిక్స్ చేసిన నాసా

ఎట్టకేలకు భూమి పైకి రానున్న సునీతా విలియమ్స్.. ముహూర్తం ఫిక్స్ చేసిన నాసా

వాషింగ్టన్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బారీ విల్మోర్ ఎట్టకేలకు తిరిగి భూమి పైకి వచ్చేందుకు ముహూర్తం ఖరారు అయ్యింది. తొమ్మిది నెలలుగా స్పేస్‎లో చిక్కుకుపోయిన ఈ ఇద్దరూ ఆస్ట్రోనాట్లను భూమి పైకి తీసుకొచ్చేందుకు నాసా ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఈ మేరకు 2025, మార్చి 16న వీరిద్దరూ తిరిగి భూమికి వస్తారని నాసా అధికారులు వెల్లడించారు. బిలియనీర్ ఎలన్ మస్క్‎కు చెందిన స్పేస్‌ఎక్స్ డ్రాగన్‌లో సునీతా విలియమ్స్, బారీ విల్మోర్‎లను భూమి పైకి తీసుకురానున్నట్లు నాసా స్పష్టం చేసింది. 

10 రోజుల మిషన్‎లో భాగంగా 2024,  జూన్‎ 5న సునీతా విలియమ్స్, బారీ విల్మోర్‎ అంతరిక్షంలోకి వెళ్లారు. అయితే.. వీరు వెళ్లిన బోయింగ్ స్టార్‌లైనర్‌ షిప్‎కు అంతరిక్షంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో సునీతా విలియమ్స్, బారీ విల్మోర్ స్పేస్ నుంచి తిరిగి రాలేక అక్కడే చిక్కుకుపోయారు. దాదాపు తొమ్మది నెలలు ఈ ఇద్దరూ  అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉంటున్నారు. 

వీరిని భూమి పైకి తీసుకొచ్చేందుకు నాసా ప్రయత్నాలు చేయగా అవేవి ఫలించలేదు. దీంతో ఈ ఆస్ట్రోనాట్ల జోడీని భూమి పైకి తీసుకువచ్చే మిషన్ వాయిదా పడుతూ వస్తోంది. సునీతా విలియమ్స్, బారీ విల్మోర్‎ను తిరిగి తీసుకురావాలని ప్రభుత్వం ఆదేశించడంతో నాసా దూకుడు పెంచింది. ఈ క్రమంలోనే 2025, మార్చి 16న ఇద్దరిని భూమి పైకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేసింది.