
సునీతా విలియమ్స్ కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూసింది.తొమ్మిది నెలల నిరీక్షణ తర్వాత చివరికి క్షేమంగా దివి నుంచి నేలకు దిగారు. దాంతో ఒక పెద్ద టాస్క్ ముగిసింది. కానీ.. మరో టాస్క్ ఇంకా మిగిలే ఉంది. అదేంటంటే.. సాధారణంగా ఎక్కువ రోజులు స్పేస్‌లో ఉండి తిరిగి వచ్చినవాళ్లకు అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. సునీతది కూడా ఇప్పుడు అదే పరిస్థితి. ఆమె ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను అధిగమించాలంటే నిత్యం వర్కవుట్లు చేస్తూ, సరైన డైట్ పాటిస్తూ.. కొన్నాళ్ల పాటు డాక్టర్ల పర్యవేక్షణలోనే ఉండాలి. అందుకే ఆమె భూమ్మీదకి వచ్చినప్పటినుంచి నాసా డాక్టర్లే ఆమెను చూసుకుంటున్నారు.
సునీతా విలియమ్స్.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ పేరే వినిపిస్తోంది. ఆమె భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి. అంతరిక్ష పరిశోధనల్లో అనేక రికార్డులను సృష్టించి, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్నారు. సునీత 1965 సెప్టెంబర్ 19న అమెరికాలోని పుట్టారు. తండ్రి డాక్టర్ దీపక్ పాండ్యా గుజరాత్ నుంచి అమెరికా వెళ్లిన న్యూరోఅనాటమిస్ట్. తల్లి బోనీ పాండ్యా స్లోవేనియన్ సంతతికి చెందిన అమెరికన్. సునీతకు చిన్నప్పటినుంచే సైన్స్ మీద ఇష్టం ఉండేది. భవిష్యత్తులో డాక్టర్ కావాలి అనుకున్నారు. కానీ.. ఆస్ట్రోనాట్ అయ్యారు. 1989లో హెలికాప్టర్ పైలట్ ట్రైనింగ్ తీసుకున్నారు. తర్వాత నావల్ టెస్ట్ పైలట్‌గా మారి 30కి పైగా విమానాలను పరీక్షించి, 2,770 గంటలకు పైగా ఫ్లైయింగ్ ఎక్స్‌పీరియెన్స్ చేశారు.
సునీతా విలియమ్స్ పాల్గొన్న మొదటి రెండు స్పేస్ మిషన్లు ఏ అడ్డంకులు లేకుండానే పూర్తయ్యాయి. కానీ.. ఈ మధ్య పూర్తైన మూడో మిషన్ వల్ల ఆమె చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నాసా రిలీజ్ చేసిన ఫొటోల్లో సునీత చాలా సన్నగా కనిపించారు.
తెల్ల జుట్టు
సునీతా విలియమ్స్‌లో కనిపించిన మార్పులలో ముఖ్యమైనది ఆమె తెల్ల జుట్టు. సాధారణంగా స్పేస్ ట్రావెల్ వల్ల సెల్యులార్ ఏజింగ్ వేగవంతం అవుతుంది. అంతరిక్షంలో కాస్మిక్ రేడియేషన్‌కు గురికావడం వల్ల డీఎన్ఏ దెబ్బతింటుంది. దాంతో వయసు కాస్త వేగంగా పెరిగి, తొందరగా తెల్లజుట్టు వస్తుంది. సునీత తెల్ల జుట్టు కూడా ఆమె దీర్ఘకాలిక అంతరిక్ష యాత్ర వల్ల కలిగిన బయోలాజికల్ ఏజింగ్ ప్రాసెస్‌లో భాగమని ఎక్స్పర్ట్స్ అంటున్నారు.
బరువు తగ్గింది
సునీతకు ఎక్కువగా మజిల్ లాస్ కావడం వల్లే మణికట్టు సన్నగా మారిందని, బరువు తగ్గిందని డాక్టర్లు చెప్తున్నారు. యూకేకు చెందిన డాక్టర్ ఒలాలేకన్ ఒటులానా “ఎక్కువ కాలం స్పేస్‌లో ఉంటే ప్రధానంగా చేతి కండరాల క్షీణత ఉంటుంది. ఎందుకంటే మైక్రోగ్రావిటీలో ఈ కండరాల వాడకం తగ్గుతుంది” అన్నారు. అంతేకాదు.. ఎముకల సాంద్రత కూడా తగ్గుతుంది. ఈ సమస్యల బారిన పడకుండా ఉండేందుకు సునీత అంతరిక్షంలో ప్రతిరోజూ వ్యాయామం చేసేవారు. వ్యక్తిగతంగా కూడా ఆమెకు వ్యాయామం విషయంలో క్రమశిక్షణ ఎక్కువే. పైలట్‌గా, టెస్ట్ పైలట్‌గా ఉన్నప్పుడు ప్రతిరోజూ స్విమ్మింగ్, సైక్లింగ్ చేసేవారు.
మానసిక ఆరోగ్యం
అంతరిక్ష యాత్రికులకు మానసికంగా కూడా చాలా సమస్యలు వస్తుంటాయి. సునీత వాటిని కూడా విజయవంతంగా అధిగమించారు. ఎనిమిది రోజుల కోసమని వెళ్లి, 9 నెలల పాటు అక్కడే ఉన్నా ఆ పరిస్థితులను చాలా ధైర్యంగా ఎదుర్కొన్నారు. చక్కగా నవ్వుతూ మాట్లాడుతున్నారు. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఐఎస్‌ఎస్‌లో ఆమె పత్యేకమైన షెడ్యూల్‌ను పాటించారు. రెగ్యులర్‌గా సైన్స్ ప్రయోగాల్లో పాల్గొన్నారు. కొలీగ్స్, ఫ్యామిలీతో వీడియో కాల్స్‌లో మాట్లాడారు.
నాసాలో చేరిక
సునీతా విలియమ్స్ 1998లో నాసాలో ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ కోసం ఎంపికయ్యారు. షటిల్ సిస్టమ్స్, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్
(ఐఎస్ఎస్) సిస్టమ్స్, టీ-38 ఫ్లైట్ ట్రైనింగ్, సర్వైవల్ టెక్నిక్స్ లాంటివి నేర్చుకున్నారు. మొదటి అంతరిక్ష ప్రయాణం 2006 డిసెంబర్‌లో స్పేస్ షటిల్ డిస్కవరీతో మొదలైంది.
మైక్రోగ్రావిటీలో జీర్ణక్రియ
అంతరిక్షంలో ఎక్కువ రోజులు ఉంటే జీర్ణక్రియ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఆమె శరీరం ఆహారాన్ని సమర్థవంతంగా ప్రాసెస్ చేసుకోలేకపోవడం కూడా సునీత బరువు తగ్గడానికి కారణం కావచ్చు. మైక్రోగ్రావిటీలో జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. అందుకే వ్యోమగాములు తక్కువగా తింటారు. సునీత అంతరిక్షంలో ఉన్నన్ని రోజులూ ప్రొటీన్, విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకుంది. అంతేకాకుండా ఆ ఫుడ్ మైక్రో గ్రావిటీ ఎఫెక్ట్‌ని తట్టుకునేలా తయారుచేశారు. ఆమె ఎప్పుడో ఒకసారి ఎంఅండ్ఎం చాక్లెట్లను తిన్నప్పటికీ రోగనిరోధక శక్తిని కాపాడుకోవడానికి సమతుల్య ఆహారానికే ప్రాధాన్యత ఇచ్చారు. అయినా.. రెగ్యులర్‌గా తక్కువ ఫుడ్ తినడం వల్ల ఆమె కడుపు కుచించుకుపోయి ఉండొచ్చు. కాబట్టి వెంటనే బరువు పెరగడం కాస్త కష్టమే. అంతరిక్షంలో ఉన్నప్పుడు సునీత తను బరువు తగ్గడానికి మైక్రోగ్రావిటీ వల్ల వచ్చిన ఫ్లూయిడ్ షిఫ్ట్, కండరాల మార్పులే కారణమని చెప్పారు.
కోలుకోవడానికి టైం పట్టొచ్చు!
సునీతకు చదువుకునే రోజుల నుంచే వ్యాయామం చేసే అలవాటు ఉంది. రోజూ ఉదయం రెండు గంటలు, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత సాయంత్రం మరో రెండు గంటలు స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేసేవారు. ఆరేళ్ల వయసు నుంచే స్విమ్మింగ్ పోటీల్లో పతకాలు సాధించారు. అయినా భూమికి తిరిగి వచ్చాక కోలుకోవడానికి చాలా టైం పడుతోంది. సునీత 45 రోజుల పాటు డాక్టర్లు, మానసిక నిపుణుల పర్యవేక్షణలో ఉంటారు. ఈ టైంలో ఆమె శరీరం భూమి గురుత్వాకర్షణకు అలవాటు పడేందుకు వ్యాయామాలు, చికిత్సలు అందిస్తారు. అంతరిక్షంలో రేడియేషన్‌కు గురవడం వల్ల ఆమెకు అన్ని హెల్త్ టెస్ట్‌లు చేస్తారు. ఎక్కువ రోజులు స్పేస్‌లో ఉండి వచ్చాక వ్యోమగాముల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. కనీసం లేచి నిలబడి, నడవడానికి కూడా ఇబ్బంది పడతారు. వాళ్లకు నాలుగు దశల్లో రకరకాల ట్రీట్మెంట్స్, ట్రైనింగ్స్ ఇస్తారు. వామప్‌తో మొదలుపెట్టి స్ట్రెచింగ్, కార్డియోవాస్క్యులర్ లాంటి వ్యాయామాలు చేయిస్తారు. అంతరిక్షంలో చేసినట్లు ఇక్కడ కూడా ట్రెడ్‌మిల్స్, సైకిళ్లపై వ్యాయామం చేయాలి. వాళ్లకు డాక్టర్లు మసాజ్ థెరపీ, హైడ్రో థెరపీ లాంటివి అందిస్తారు. పూర్తిగాకోలుకోవడానికి దాదాపు ఆరు నెలల వరకు పట్టొచ్చు.
ఎక్కువ కాలం ఉంటే..
అంతరిక్షంలో ఉన్నప్పుడు బాడీలోని ఫ్లూయిడ్స్ శరీరం పైభాగంలో అంటే తలలోకి చేరుతాయి. దీని వల్ల ముఖం ఉబ్బినట్టు కనిపిస్తుంది. అందుకే వ్యోమగాములు భూమిపైకి తిరిగి వచ్చిన తర్వాత తల తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. ప్రస్తుతం నాసా డాక్టర్లు సునీత గుండె ఆరోగ్యం, రక్త ప్రసరణ తీరుని కూడా పరిశీలిస్తున్నారు. తలలోకి చేరిన ఫ్లూయిడ్స్ కంటి నరాలపై ఒత్తిడి పెంచడం వల్ల కొందరిలో చూపు కూడా మందగిస్తుంది. స్పేస్‌లో రేడియేషన్ వల్ల రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. అందుకే భూమిపైకి వచ్చిన తర్వాత కొన్ని రోజులపాటు వ్యాధుల బారిన పడే ప్రమాదం పెరుగుతుంది. తగు జాగ్రత్తలు తీసుకోకపోతే డీ హైడ్రేషన్ వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది.
మొదటి మిషన్: సునీత తన మొదటి మిషన్‌లో ఫ్లైట్ ఇంజనీర్‌గా పనిచేశారు. అప్పుడామె 195 రోజుల పాటు అంతరిక్షంలో ఉండి, స్పేస్‌లో ఎక్కువ కాలం గడిపిన మహిళగా రికార్డు క్రియేట్ చేశారు. (ఈ రికార్డును 2017లో పెగ్గీ విట్సన్ బ్రేక్ చేసింది). ఈ మిషన్‌లో ఆమె నాలుగు స్పేస్‌వాక్(29 గంటల 17 నిమిషాలు)లు చేశారు. అత్యధిక సమయం స్పేస్‌వాక్ చేసిన మహిళగా కూడా రికార్డు సృష్టించారు. ఈ మిషన్‌లో భాగంగానే ట్రెడ్‌మిల్‌పై మొట్టమొదటి స్పేస్ మారథాన్ చేశారు.
రెండో మిషన్: సునీత 2012 జులైలో మళ్లీ ఐఎస్‌ఎస్‌కి వెళ్లింది. ఈ మిషన్‌లో మూడు స్పేస్‌వాక్‌లు చేసింది. 127 రోజుల తర్వాత 2012 నవంబర్‌లో భూమికి తిరిగి వచ్చింది.
మూడో మిషన్: 2024 జూన్ 5న సునీత మూడోసారి ఐఎస్‌ఎస్‌కి వెళ్లారు. ఈ మిషన్ కేవలం 8 రోజుల కోసం ప్లాన్ చేసినప్పటికీ సాంకేతిక సమస్యలు, ప్రొపల్షన్ సిస్టమ్‌లో లోపాలు వల్ల ఆమె, ఆమెతోపాటు వెళ్లిన బుచ్ విల్మోర్ 9 నెలలకు పైగా అంతరిక్షంలోనే ఉండిపోయారు. ఈ మిషన్‌లో ఆమె మరో రెండు స్పేస్‌వాక్‌లు చేశారు. మొత్తం 62 గంటల 6 నిమిషాల స్పేస్‌వాక్ చేసి అత్యధిక టైం స్పేస్‌వాక్ చేసిన మహిళగా రికార్డు క్రియేట్ చేశారు.
అమెరికా నుంచి స్పేస్‌లోకి వెళ్లిన మనవాళ్లు
కల్పనా చావ్లా: హర్యానాలోని కర్నాల్‌లో పుట్టిన కల్పనా చావ్లా అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయ మహిళ. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదివింది. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లింది. అక్కడే నాసాలో చేరి, స్పేస్ షటిల్ కొలంబియాలో ప్రయాణించింది. తిరిగి భూమ్మీదకు వచ్చేటప్పుడు జరిగిన ప్రమాదంలో చనిపోయింది.
శిరీష బండ్ల: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శిరీష అమెరికాలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివింది. 2021లో వర్జిన్ గెలాక్టిక్ మిషన్‌లో స్పేస్‌లోకి వెళ్లింది.
రాజా చారి: తెలంగాణ మూలాలు ఉన్న రాజా చారి అమెరికాలో పెరిగారు. యూఎస్ ఎయిర్ ఫోర్స్‌లో పైలట్‌గా పనిచేసిన తర్వాత నాసాలో చేరారు. 2021లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి స్పేస్ఎక్స్ క్రూ-3 మిషన్‌లో వెళ్లారు.
వినాయకుడి బ్లెస్సింగ్స్
సునీత ఎక్కడికి వెళ్లినా తనతో తీసుకెళ్లే అత్యంత విలువైన వస్తువుల్లో ఒకటి గణేశుడి విగ్రహం. గతంలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. ‘‘నేను ఎక్కడికెళ్లినా నాతో గణేశుడు ఉంటాడు. నా ఇంట్లో కూడా ఉన్నాడు. అందుకే అంతరిక్షానికి కూడా తీసుకెళ్లా” అని చెప్పింది. అంతేకాదు.. ఆధ్యాత్మిక గైడెన్స్ కోసం భగవద్గీతను కూడా తనతో తీసుకెళ్లింది. ఆమెకు ఇండియన్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఎక్కడికెళ్లినా మన ఫుడ్ ఉండాల్సిందే. అందుకే అంతరిక్షంలోకి కూడా సమోసాలు తీసుకెళ్లింది.