న్యూఢిల్లీ: నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో స్పేస్ నుంచే ఓటు హక్కు వినియోగించుకుంటానని ఇండియన్ ఆరిజిన్ వ్యోమగామి సునీతా విలియమ్స్, అమెరికన్ ఆస్ట్రోనాట్ బుచ్ విల్‌మోర్ వెల్లడించారు. అంతరిక్షంలో ఎక్కువకాలం గడపడం కష్టమే అయినా.. ఇది తనకు హ్యాపీ ప్లేస్ అని సునీత చెప్పారు. బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్‌లో సమస్యలతో రోదసిలోనే చిక్కుకుపోయిన వీళ్లిద్దరూ శనివారం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ఐఎస్‌ఎస్) నుంచి వీడియో ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ‘ఓటు మా బాధ్యత. అంతరిక్షం నుంచి ఓటు వేసేందుకు ఎదురుచూస్తున్నా’ అని సునీత చెప్పారు.
‘బ్యాలెట్ కోసం మా రిక్వెస్ట్‌ను నాసాకు పంపించాం. అమెరికన్లుగా ఓటు హక్కు వాడుకోవడం మా కర్తవ్యం. నాసా సహకరిస్తుందని భావిస్తున్నం’ అని విల్‌మోర్ అన్నారు. కాగా, సునీత, విల్ మోర్లను ఐఎస్‌ఎస్ వద్దే వదిలేసి బోయింగ్ స్టార్ లైనర్ భూమికి చేరుకుంది. వీళ్లను తీసుకువచ్చేందుకు స్పేస్ ఎక్స్‌కు చెందిన ‘డ్రాగన్’ స్పేస్ క్రాఫ్ట్‌ను నాసా పంపనుంది. వీళ్లు వచ్చే ఫిబ్రవరిలోనే భూమికి తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి.