sunitawilliamsreturn: భూమి మీద అడుగుపెట్టిన సునీతా విలియమ్స్.. 9 నెలల నిరీక్షణకు తెర..

sunitawilliamsreturn: భూమి మీద అడుగుపెట్టిన సునీతా విలియమ్స్.. 9 నెలల నిరీక్షణకు తెర..

9 నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన ఆస్ట్రోనాట్స్ సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ లు సురక్షితంగా భూమి మీద అడుగుపెట్టారు.భారత కాలమానం ప్రకారం బుధవారం ( మార్చి 19 ) తెల్లవారుజామున 3:27 గంటలకు భూమి మీదకు క్షేమంగా అడుగుపెట్టారు.

స్పేస్ ఎక్స్ కి చెందిన క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ లో అంతరిక్షం నుండి బయలుదేరిన ఆస్ట్రోనాట్స్ సుమారు 18 గంటల ప్రయాణించిన తర్వాత ఫ్లోరిడా తీర ప్రాంతంలో ల్యాండ్ అయ్యారు.

 

ఎనిమిది రోజుల మిషన్ కోసమని అంతరిక్షానికి వెళ్లి, తొమ్మిది నెలలకుపైగా అక్కడే చిక్కుకుపోయారు సునీతా విలియమ్స్ ఎన్నో అవాంతరాల తర్వాత భూమికి తిరిగి బయలుదేరారు. సునీతతోపాటు నాసా ఆస్ట్రోనాట్లు బుచ్ విల్మోర్, నిక్ హేగ్, రష్యన్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బనోవ్ తోకూడిన స్పేస్ఎక్స్ క్రూ డ్రాగన్ వ్యోమనౌక భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 10:35 గంటలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి అన్ డాక్ అయి భూమికి బయలుదేరింది. ముందుగా సునీత, ఇతర ఆస్ట్రోనాట్లు క్రూ డ్రాగన్ క్యాప్సూల్​ లోకి చేరుకున్న తర్వాత అది ఐఎస్ఎస్ నుంచి విడిపోయింది. 

ఆ తర్వాత క్యాప్సూల్ హ్యాచ్ (మూత) క్లోజ్ అయింది. అనంతరం భూమి చుట్టూ కక్ష్యలో తిరుగుతూ 17 గంటల రిటర్న్ జర్నీని క్యాప్సూల్ మొదలుపెట్టింది. బుధవారం తెల్లవారుజామున 3.27 గంటలకు అమెరికాలోని ఫ్లోరిడా వద్ద సముద్రంలో క్యాప్సూల్ స్ప్లాష్ డౌన్ అయ్యింది. ఆ వెంటనే క్యాప్సూల్​ను తీరానికి చేర్చిన తర్వాత అందులో నుంచి ఆస్ట్రోనాట్లు బయటకు వచ్చారు. తర్వాత మెడికల్ టెస్టుల కోసం నేరుగా నాసా స్పేస్ సెంటర్​కు తరలించారు.

ఇన్నాళ్లూ అతరిక్షంలో జీరో గ్రావిటీ పరిస్థితుల్లో గడిపినందున వారు భూమిపై తిరిగి గ్రావిటీ పరిస్థితులకు అలవాటుపడేందుకు కొన్ని నెలల సమయం పట్టనుంది. కాగా, సునీత, విల్మోర్ స్పేస్ఎక్స్ క్రూ 9 మిషన్ లో భాగంగా గతేడాది జూన్ 5న బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమనౌకలో ఐఎస్ఎస్​కు వెళ్లారు. వారం తర్వాత వారు తిరిగి రావాల్సి ఉండగా, స్టార్ లైనర్​లో వరుసగా సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో వారి రిటర్న్ జర్నీ వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా గత శనివారం స్పేస్ఎక్స్ కంపెనీ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్​ను పంపగా, అందులోనే సునీత, ఇతర ఆస్ట్రోనాట్లు తిరిగి వచ్చారు.